బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Oct 28, 2020 , 08:39:28

కల్లాల వద్దే కాంటాలు

కల్లాల వద్దే కాంటాలు

కందుకూరు: ఎద్దు నవ్విన ఎవుసం, రైతు మురిసిన రాజ్యంగా స్వరాష్ర్టంలో సమర్థవంతమైన పాలన నడుస్తున్నది.. నాడు పండిన పంటలను దళారులు కల్లాల్లోనే దోచుకుపోతే, నేడు అదే కల్లాల్లోనే ప్రభుత్వ ప్రతినిధులు గిట్టుబాట ధర కల్పించి కొనుగోలు చేస్తున్నారు. సరికొత్తగా ప్రవేశపెట్టిన నియంత్రిత సాగుతో లక్ష్యానికి మించి వరి సాగైంది. దానిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఈ సారి కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నది. వరి కొనుగోలే లక్ష్యంగా పై అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. వానకాలం వరిపంట సిద్ధమవుతున్న వేళ, చివరి గింజనూ కొనుగోలు చేసేందుకు సర్కారు సమాయత్తమైంది. కొవిడ్‌ కారణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరిధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక తయారు చేసింది. ఈ సారి కూడా కల్లాల వద్దకే వెళ్లి రైతుల పంటను కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాగు విస్త్రీర్ణం పెరగడం , అందుబాటులోకి కొనుగోలు కేంద్రాలు రావడం దళారి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో రైతు పండించిన పంట పూర్తి స్థాయిలో సర్కారు కొనుగోలు కేంద్రాలకే రానున్నది. 35 గ్రామ పంచాయతీలు అనుబంధ గ్రామాల్లో ఈ సారి 5 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. 100 క్విటాళ్లకు పైగా పంట రావడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.