మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 28, 2020 , 05:43:05

‘ధరణి’ సేవలకు సర్వం సిద్ధమైంది...

‘ధరణి’ సేవలకు సర్వం సిద్ధమైంది...

  • రేపటి నుంచి అందుబాటులోకి  సేవలు
  • పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితారెడ్డి..
  • తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తి
  • ధరణి పోర్టల్‌ ద్వారానే స్లాట్‌ బుకింగ్‌ 
  • నిమిషాల్లో పూర్తికానున్న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 
  • వెంటనే ప్రింటెడ్‌ పాస్‌బుక్‌ జారీ
  • పూర్తిగా అవగాహన పెంచుకున్న తాసిల్దార్లు
  • ఒక్కొక్కరు 20 సార్లకు పైగా ప్రాక్టీస్‌

‘ధరణి’ సేవలకు సర్వం సిద్ధమైంది.  ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌కు  శ్రీకారం చుట్టనుండగా, ఉమ్మడి  రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ మంత్రి  సబితారెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తాసిల్దార్‌ కార్యాలయాల్లో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, సీసీ, వెబ్‌ కెమెరాలు, టీవీ, ఫింగర్‌ ప్రింట్‌ డివైజ్‌, తదితర వస్తువులను జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా తాసిల్దార్లతోపాటు డిప్యూటీ తాసిల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై  శిక్షణ ఇచ్చారు. సిబ్బంది 20 సార్లకు పైగా ట్రయల్స్‌ చేసి పూర్తి అవగాహనతో నాణ్యమైన సేవలందించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిమిషాల్లో పూర్తికావడంతోపాటు వెంటనే ప్రింట్‌ చేసిన పట్టా పాస్‌పుస్తకం అందజేయనున్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వస్తే ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా భూముల రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

రంగారెడ్డి, వికారాబాద్‌ నమస్తే తెలంగాణ : కొత్త రెవెన్యూ చట్టం అమలులో భాగంగా తాసిల్దార్‌ కార్యాలయాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా మారనున్నాయి. ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనుండగా, ఉమ్మడి జిల్లాలో మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  గురువారం నుంచే ప్రారంభంకానుంది. జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా తాసిల్దార్లు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. సాగు భూముల రిజిస్ట్రేషన్లు తాసిల్దార్‌ కార్యాలయాల్లో చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ‘ధరణి’ పోర్టల్‌ అందుబాటులోకి తేనున్నారు.  గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముహూర్తం ఖరారైంది. జిల్లాలో ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, కందుకూరు, చేవెళ్ల, షాద్‌నగర్‌ ఈ ఐదు డివిజన్లు, 21 గ్రామీణ, 6 అర్బన్‌ మండల తాసిల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అలాగే జిల్లాలో 18 సబ్‌ రిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మేరకు ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో వెబ్‌సైట్‌ను రూపొందించారు. 

సమస్యలు తలెత్తకుండా ముందస్తు ట్రయల్‌

  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ట్రయల్న్‌ సైతం చేపట్టారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అంతా సిద్ధం చేశారు. దసరా పండుగరోజు ధరణి పోర్టల్‌ను ప్రారంభించాలనుకున్నప్పటికీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఈనెల 29న ప్రజలకు, రైతులకు అందుబాటులోకి రానుంది. రెవెన్యూ సంస్కరణల్లో విప్లవాత్మకమైన ‘ధరణి’ పోర్టల్‌ ..భూమి రిజిస్ట్రేషన్‌ ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో తాసిల్దార్లు ఒక్కో మండలంలో 10నుంచి 15 డమ్మీ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

తాసిల్దార్‌ కార్యాలయంలో ధరణి కేంద్రం 

ధరణి కేంద్రం కోసం తాసిల్దార్‌ కార్యాలయాల్లో ఒక గదిని ఏర్పాటు చేశారు. ఇక నుంచి తాసిల్దార్‌ ఉదయం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించడంతో పాటు మధ్యా హ్నం నుంచి తాసిల్దార్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందుకు సంబంధించి కొత్త కంప్యూటర్లు, స్కానర్లు, ఇన్వర్టర్లు, ఫర్నిచర్‌ సమకుర్చారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అవసరమయ్యే వాటిని తాసిల్దార్‌ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచారు.

పారదర్శకంగా సేవలు

  జిల్లాల్లోని అన్నీ కార్యాలయాల్లో డమ్మీ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. దీంతో పాటు జిల్లాలోని మిగతా అన్ని మండలాల్లో ధరణి సేవ లు అందుబాటులోకి రానున్నాయి. పారదర్శకత, జవాబుదారీతనం, భద్రతతో కూడిన పోర్టల్‌ను తయారు చేసి దాని అమలు దిశగా రేపటి నుంచి అడుగులు మొదలు కానున్నాయి. ఇక నుంచి మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు సులువుగా కొనసాగనున్నాయి. జిల్లాలోని 2లక్షలకుపైగా మంది రైతులకు సంబంధించిన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయి. రైతు పేరు, చిరునామాతోపాటు భూమి సర్వే నంబర్‌, ఖాతా నంబర్‌, విస్తీర్ణం, ఎవరి ద్వారా సంక్రమించింది. వన్‌-బీ పహణి తదితర వివరాలు ధరణిలో ఉన్నాయి. 

నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిమిషాల వ్యవధిలో పూర్తి కానుంది. గతంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తై సంబంధిత భూపత్రాలు సదరు వ్యక్తులకు చేరేందుకు నాలుగైదు రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కావడంతోపాటు సులువుగా, క్షణాల్లోనే ప్రింటెడ్‌ పాసు పుస్తకాలను జారీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్‌ ఆపరేటర్ల వద్ద 10 నిమిషాల సమయం, తాసిల్దార్ల వద్ద మరో 10 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తి కానుంది. అయితే ఒరిజినల్‌ పట్టాదారు పాసు పుస్తకాలు తర్వాత నేరుగా సదరు వ్యక్తులకు అందజేయనున్నారు. 

ఒక్కో స్థాయి అధికారికి.. ఒక్కో లాగిన్‌

 తాసిల్దార్‌ కార్యాలయాల్లో త్వరలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించనున్న దృష్ట్యా ప్రస్తుతం తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు, ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇందుకు ఒక్కో స్థాయి అధికారికి ఒక్కో లాగిన్‌ ఇచ్చారు. లాగిన్‌ ద్వారా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి రిజిస్ట్రేషన్‌ ఎలా చేయాలనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ధరణిపై ప్రత్యేక శిక్షణనిచ్చారు.