శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Oct 27, 2020 , 10:25:24

చెరువు కన్నీటి గాథ

చెరువు కన్నీటి గాథ

బడంగ్‌పేట: గత పాలకులు చేసిన తప్పిదాలు.. నేడు ప్రజలకు శాపంగా మారాయి. మొన్నటి వానలతో  చాలా ప్రాంతాలకు ముంపునకు గురయ్యాయి. ముంపు సమస్యకు ప్రధాన కారణం గతపాలకుల హయాంలో ఎఫ్‌టీఎల్‌లో, నాలాలపై నిర్మాణాలు చేపట్టడంతో ముంపు సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.  దీంతో మీర్‌పేట పెద్ద చెరువుకు ఎగువన ఉన్న కాలనీలు, చెరువుకు దిగువన ఉన్న కాలనీలు 15 రోజుల నుంచి పూర్తిగా నీటిలో ఉన్నాయి. ఇండ్లలో ఉన్న ప్రజలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా భయటకు తీసుకొచ్చారు. ఎఫ్‌టీఎల్‌ సరిహద్దు రాళ్లను తొలగించారు. చెరువులోకి వర్షం నీరు చేరకుండా ఆడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. గత పాలకులు చెరువులను రక్షించి ఉంటే.. ప్రజలకు ఈరోజు ముంపు సమస్య ఉండేది కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పెద్ద చెరువు సర్వే నంబర్‌ 61లో 71 ఎకరాల విస్తీర్ణలో ఉండేది. చెరువు చుట్టూ ఉన్న స్థలం కబ్జాకు గురైంది.. ఎఫ్‌టీఎల్‌లో రియల్టర్స్‌ వెంచర్లు చేశారు. గత పాలకులు వాటికి అనుమతులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలతో 71 ఎకరాల్లో ఉన్న చెరువు భూమిలో దాదాపు 30 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు.  ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను ధ్వంసం చేసి.. ఎఫ్‌టీఎల్‌  ఆనవాళ్లు లేకుండా చేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులను సైతం తారు మారు చేసినట్లు అధికారులు చెప్పడం కొసమెరుపు.  ప్రస్తుతం వరద నీరు ఎక్కడి వరకు  ఆగిఉందో..  అక్కడి వరకు ఎఫ్‌టీఎల్‌ ఉంటుందని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. 

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్లు..

గత 20 ఏండ్ల కిందట కొంత మంది రియాల్టర్ల కన్ను చెరువు భూములపై పడింది. ఇంకేముంది.. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో వెంచర్లు వెలిశాయి. అమాయకులకు గాలం వేశారు. తక్కువ ధరకు స్థలం  వస్తుందని చెప్పడంతో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించారు. భారీ వర్షం వస్తే తప్పా.. అక్కడి ప్రజలకు నిజాలు తెలియరాలేదు. వర్షకాలం వచ్చింది అంటే  చాలూ.. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఎక్కడి నుంచి వరద వస్తుందో.. అని జనం బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తారు. చాలా సందర్భాల్లో ఇండ్లు ఖాళీ చేసి పోయారు. 

ఎఫ్‌టీఎల్‌ కబ్జా..

మీర్‌పేట పెద్ద చెరువు పరిధిలో ఉన్న సాయి బాలాజీ టౌన్‌ షిప్‌, నవయుగ కాలనీ, మల్‌రెడ్డికాలనీ, సీతా హోమ్స్‌, లక్ష్మీనగర్‌, సాయికృష్ణ ఎన్‌క్లేవ్‌ కాలనీలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో చేసిన         వెంచర్లు ముంపు సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. వర్షంపోయి మూడు రోజులు గడుస్తున్నా.. వరద నీటి సమస్య మాత్రం నేటికి తీరలేదని స్థానికులు చెబుతున్నారు. చెరువు నాలాలు పూర్తిగా కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు.

గత పాలకులు  తప్పిదం..

గత పాలకులు చెరువులను కాపాడిఉంటే ముంపు సమస్య ఉండేది కాదు. చెరువులో వెలసిన ఇండ్లకు గతంలో పనిచేసిన అధికారులు అనుమతులిచ్చారు. చెరువుల్లో డ్రైనేజీ, రోడ్లనిర్మాణం, విద్యుత్‌కు అనుమతులిచ్చారు. దీంతో కాలనీ వాసులు మాకు ఇబ్బంది లేదని భావించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అనుమతులు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉన్నా.. అధికారులు పట్టించుకోలేదు. 

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో..

మీర్‌పేట పెద్ద చెరువుపైన ఉన్న కాలనీలు సాయి బాలాజీ, నవయుగ కాలనీ, లక్ష్మీ కాలనీతోపాటు చెరువు దిగువన ఉన్న ఎంఎల్‌ఆర్‌ కాలనీ, టీఎస్‌ఆర్‌ కాలనీలు సైతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న కాలనీలు మాత్రమే ముంపునకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఇంకా వరద ముంపులోనే కాలనీలు..

ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న కాలనీలు సా యి బాలాజీ టౌన్‌ షిప్‌, నవయుగ కాలనీ, సీతాహోమ్స్‌, శ్రీకృష్ణ ఎన్‌క్లేవ్‌ కాలనీలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ఎన్‌డీఆర్‌ఎస్‌ బృందాలు మూడు రోజులుగా శ్రమిస్తున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను రిలీఫ్‌ కేంద్రాలకు తరలించారు. వరదలో చిక్కుకున్న ప్రజల కన్నీరు మున్నీరుగా విలపించారు. ముంపు సమస్యకు శాశ్విత పరిష్కారం కావాలంటే నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగించాలని, నాలాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

రెండు కాలనీల సమస్య..

రోజు రోజుకూ వరద ఉధృతంగా ప్రవహించడంతో చెరువు పైన ఉన్న కాలనీ వాసులు చెరువు కట్టకు గండి పెట్టి దిగువకు నీరు వదలడంతో.. దిగువన ఉన్న కాలనీ వాసులు గండిని పూడ్చివేసే ప్రయత్నం చేశారు. దీంతో గత పది రోజుల నుంచి చెరువు పరిసర కాలనీల మధ్య విభేదాలొచ్చాయి. రోజు చెరువు దగ్గర ఘర్షణ వాతావరణం చేటు చేసుకుంటుంది. ఈ సమస్యను పరిష్కరించలేక మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

చెరువు నాలాలను కబ్జా చేశారు..

 ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సర్వే నంబర్‌ 61లో మీర్‌పేట పెద్ద చెరువు  71ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుతం చెరువు భూమి కూడా కబ్జాకు గురైంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంతో చాలా కాలనీలు ముంపునకు గురయ్యాయి. గతంలో జరిగిన తప్పిదం వల్లే ముంపు సమస్య వచ్చింది. చెరువు శిఖంలో నిర్మాణాలు చేపట్ట కూడదు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపడితే ముంపు సమస్య తప్పదు. ఇటీవల కాలంలో చెరువులను కబ్జా చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాం. నాలాలను పునరుద్ధరించినప్పుడే ముంపు సమస్య తీరుతుంది. నాలాలకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తాం. - డి. శ్రీనివాస్‌ రెడ్డి, తహసీల్దార్‌, బాలాపూర్‌ 

నాలాల పైన ఉన్న నిర్మాణాలను తొలగించాలి..

నాలాలపై ఉన్న నిర్మాణాలను తొలగించాలి. వరద నీరు సజావుగా చెరువులోకి పోయే విధంగా ఏర్పాటు చేయాలి. చెరువులను కాపాడాలి. చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను గుర్తించి చెరువు చుట్టూ కంచె వేయాలి.  దొంగ అనుమతులు ఇచ్చిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. అమాయకులను మోసం చేసిన వారిని శిక్షించాలి. - రామిడి సూరకర్ణారెడ్డి