బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Oct 25, 2020 , 07:29:55

పండుగ పూట జర భద్రం

పండుగ పూట జర భద్రం

చేవెళ్ల రూరల్‌ : నేడు దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలు భద్రంగా ప్రయాణాలు సాగించాలని, అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ ప్రజలను కోరారు. మొదటగా ఆయన ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ బాలకృష్ణ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  

1). రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలి.

2). అనుమానాస్పద వ్యక్తులు ఎదురుపడితే పోలీసులకు సమాచారమివ్వాలి.  

3). పండగ పూట అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సీఐ బాలకృష్ణ సూచించారు.

వాహనదారులు పాటించాల్సిన ముఖ్య సూచనలు..

1). మోటార్‌ సైకిళ్లపై వెళ్లే వాహనదారులు నాణ్యమైన హెల్మెట్‌ ధరించాలి.

2). కార్లలో వెళ్లే వాహనదారులు సీట్‌ బెట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. 

3). భద్రత కోసం రోడ్డుపై అనుమతించిన వేగంతోనే బండిని నడిపించాలి. అతి వేగంతో నడుపడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. 

4). సొంత ఊళ్లకు వెళ్లేటప్పుడు బ్యాగులు, లగేజీని బైక్‌ హ్యాండిల్‌పైన, పక్కన పెట్టి నడుపడం ప్రమాదకరం. తద్వారా వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగే అవకాశముంటుంది. 

5). ఆటోలు, కార్లలో పరిమితికి మించి ప్రయాణాలు సాగించవద్దు. 

6). పిల్లలను పెట్రోల్‌ ట్యాంకులపై కూర్చోబెట్టి ప్రయాణించొద్దు. 

7). రహదారులపై ఫొటోలు, వీడియోలు తీసుకోవడం ప్రమాదమే.

8). రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై బైక్‌లను నడపడం మంచిది కాదు. 

9). రాత్రి సమయాల్లో ప్రయాణించాల్సి వస్తే లేత రంగు (లేత ఆకుపచ్చ, పసుపు, తెలుపు) దుస్తులు ధరించండి. 

10). సరదాకు కూడా పిల్లలకు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇవ్వకండి. 

పై సూచనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటిస్తే  పండుగ వేళ ప్రయాణాలు ఎంతో సుఖవంతంగా సాగుతాయన్నారు. అశ్రద్ధ వహిస్తే ప్రమాదాలను కొనితెచ్చినవారవుతారని ఈ సందర్భంగా చేవెళ్ల ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.బాలకృష్ణ తెలిపారు.