సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 24, 2020 , 06:03:43

నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం

నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తాం

భారీ వర్షానికి కలిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని కేంద్ర బృందం సభ్యుడు గౌర్‌ అన్నారు. హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలలో శుక్రవారం కేంద్ర బృందం సభ్యులు పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు.  రైతులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి నష్టపోయిన పంటలపై ఆరా తీశారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు దెబ్బతిన్న పంటల వివరాలను బృందానికి వివరించారు.   

హయత్‌నగర్‌/తుక్కుగూడ: అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కేంద్ర బృంద సభ్యులు గౌర్‌, మనోహర్‌ తెలిపారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృం దం శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిరాలలో పర్యటిం చారు. రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌ జైన్‌, హరీశ్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు సేకరించారు. పంటలు ఎలా దెబ్బతిన్నాయో దానికి సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. తారామతిపేట ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద, గౌరెల్లి- ప్రతాప్‌ సింగారం బ్రిడ్జి వద్ద మూసీ నది వరద దాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయామని, తమను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కేంద్ర బృందానికి మొరపెట్టుకున్నారు. 

మునిగిన ప్రాంతాల పరిశీలన

వరి, పత్తి వివిధ పంటలతో పాటు  పశువులు, మోటర్లు వ్యవసాయ సామగ్రి, ఇటుక బట్టీలు, మునిగిన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. రావిరాల పెద్ద చెరువు (ఎఫ్‌టీఎల్‌) 855 ఎకరాల విస్తీర్ణం ఉండ గా 95 శాతం నీట మునిగిందని, సమీపంలోని వంద ల ఎకరాలు దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్రం మొత్తంగా అక్కడక్కడ పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సభ్యుడు గౌర్‌ తెలిపారు.

చెరువులకు మరమ్మతులు చేయించండి :సీపీఎం

భారీ వర్షాలకు తెగిన చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ  సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు యాదయ్య కేంద్ర బృందానికి వినతిపత్రం అందజేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని, ఇండ్లు ధ్వంసమైన వారికి కొత్తవి కట్టించి, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఆర్డీవో వెంకటా చారి, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, ఉద్యాన శాఖ డీడీ సునందరాణి, ఆర్‌డీవో రవీందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏడీఏ సత్యనారాయణ, ఎంపీపీ రేఖాగౌడ్‌, జడ్పీటీసీ దేవాదాసు గౌడ్‌, బాటసింగారం సొసైటీ చైర్మన్‌ విఠల్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ పాషా, సర్పంచ్‌ మల్లేశ్‌, ఏవో ఉమ, ఏఈలు లక్ష్మణ్‌, కల్యాణి, ఎంఆర్‌వో జ్యోతి , ఏడీఏ సుజాత, తుక్కుగూడ మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.