సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 24, 2020 , 05:52:38

తాగునీటి సమస్య రానివ్వొద్దు..

తాగునీటి సమస్య రానివ్వొద్దు..

సాంకేతిక సమస్యతో భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మిషన్‌ భగీరథ అధికారులతో సమావేశం 

వివిధ ప్రాంతాలకు నీటి సరఫరాపై దిశానిర్దేశం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు వద్ద ఎంజీకెఎల్‌ఐ లిఫ్ట్‌-1 వద్ద సాంకేతిక సమస్యతో భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని, తాగునీటి సమస్య తలెత్తకుండా వెంటనే ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మిషన్‌ భగీరథ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.  కాగ్నా నుంచి తాండూరు, కొడంగల్‌ మున్సిపాలిటీలతోపాటు, 216 గ్రామాలకు, వికారాబాద్‌ మున్సిపాలిటీకి శివసాగర్‌ నుంచి నీటి సరఫరా చేయాలన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ, మొయినాబాద్‌, శంకర్‌పల్లి మండలాల్లోని 40 గ్రామాలకు మంజీరా, గున్‌గల్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 133 గ్రామాలతోపాటు తుక్కుగూడ మున్సిపాలిటీకి నీరు అందించాలన్నారు. వెంటనే బోర్లకు మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎల్లూరు వద్ద సాంకేతిక సమస్యలు రావటంతో నిలిచిపోయిన నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మిషన్‌ భగీరథ అధికారులను  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం శ్రీనగర్‌ కాలనీలోని మంత్రి నివాసంలో రంగారెడ్డి,వికారాబాద్‌ జిల్లాల మిషన్‌ భగీరథ అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లూరు వద్ద యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టిందని,సరఫరాను సాధ్యమైనంత త్వరగా చేపట్టడానికి కృషి చేస్తున్నదన్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు.. ఎక్కడికక్కడ ఉన్న అవకాశాలను అంచనా వేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకుని, ఎక్కడా సమస్య రాకుండా చూడాలన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 133 గ్రామాలు, మున్సిపాలిటీలతో పాటు తుక్కుగుడా మున్సిపాలిటీలకు గున్‌గల్‌కు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ ద్వారా నీరు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని గ్రామాలకు కూడా గున్‌గల్‌ నుండి నీరు సరఫరా చేసేందుకు ప్రయత్నించాలన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీతో పాటు శంకర్‌పల్లి,మొయినాబాద్‌ మండల్లాలోని 40 గ్రామాలకు పాత మంజీర పథకం ద్వారా నీటి సరఫరాను రెండు రోజుల్లో పునరుద్ధరించాలన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూరు మున్సిపాలిటీలకు కాగ్నా నది ద్వారా, వికారాబాద్‌ మున్సిపాలిటీకి శివసాగర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు.అదేవిధంగా కొడంగల్‌ నియోజకవర్గంలోని 216 గ్రామాలకు కాగ్నా ద్వారా నీటి సరఫరాకు ట్రయల్‌ రన్‌ పూర్తయ్యిందని.. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు.ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని 1064 గ్రామాలు, వికారాబాద్‌ జిల్లాలోని 956 గ్రామాల సర్పంచ్‌లకు కృష్ణా నీటి పునరుద్ధరణ జరిగే వరకు గ్రామాలలోని స్కీమ్‌ బోర్లను, సింగల్‌ ఫేస్‌ బోర్లను వాడుకోవాలని సూచించటం జరిగిందన్నారు. బోరు మోటర్ల రిపేర్లు, మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు. ఈ దిశలో మిషన్‌ భగీరథ అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించాలన్నారు.అవసరం అయితే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామాలపై ఆర్థిక భారం పడకుండా మిషన్‌ భగీరథ నిధులు ఖర్చు చేయాలని సూచించారు. కార్యదర్శులు,ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో సర్పంచ్‌లకు,చైర్మన్‌లకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ ఆంజనేయులు, ఈఈలు రాజేశ్వర్‌, నర్సింహులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.