మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Oct 23, 2020 , 06:13:28

చెరువులను కాపాడుకోవాలి

చెరువులను కాపాడుకోవాలి

  • నాలుగు ట్రంక్‌ లైన్‌ పనులకు ప్రతిపాదనలు
  • ప్రతి ఇంటికి కేసీఆర్‌ కిట్టు. పది వేలు అందజేస్తాం
  • విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి 

బడంగ్‌పేట: ముంపు సమస్యను అధిగమించడానికి నాలుగు ట్రంక్‌లైన్లు  ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 1, 3, 4, 15, 28 వార్డుల్లో వరద బాధితులకు రూ.పదివేలు, కేసీఆర్‌ రిలీఫ్‌ కిట్‌ను మేయర్‌ పారిజాతరెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, కమిషనర్‌ కృష్ణ మోహన్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వరదల కారణంగా ఎన్ని ఇండ్లు మునిగిపోయాయో అధికారులు గుర్తించిన తర్వాత రూ.పది వేలు ఇంటి వద్దకే వచ్చి అధికారులు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే చూస్తామన్నారు. భారీ వర్షాల వల్ల ఆపార నష్టం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం జరుగకుండా చూశామన్నారు. బాలాపూర్‌ మండలంలో ఉన్న గొలుసు కట్టు చెరువులు పూర్తి స్థాయిలో నిండాయన్నారు. చెరువులు తెగి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రూ.23 కోట్లతో మొదటి ట్రంక్‌ లైన్‌ పనులు త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ఈ పనులు పూర్తయితే వరద ముంపు సమస్య ఉండదన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రతి ఇంటికి పదివేలు, కేసీఆర్‌ కిట్‌ అందజేయాలని చెప్పారన్నారు. వర్షాలు ప్రారంభం అయిన్నప్పటి నుంచి మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్స్‌, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేప్పట్టారన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్స్‌ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, ఎర్ర మహేశ్వరి జైహింద్‌, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, సూర్ణగంటి అర్జున్‌, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీలవాసులు  పాల్గొన్నారు.