మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Oct 23, 2020 , 06:10:28

పూలు,పండ్లు,కూరగాయలు.. అన్నీ ఒకేచోట

పూలు,పండ్లు,కూరగాయలు.. అన్నీ ఒకేచోట

  • ఢిల్లీ ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో ఏర్పాటుకు యోచన
  • భూ సేకరణ పూర్తి..
  • సమగ్ర నివేదిక తయారీకి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
  • అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చేయత్నం
  • రంగారెడ్డి జిల్లా రైతులకు మరింత ప్రయోజనం   
  • అన్ని రంగాల్లో అభివృద్ధితో మారుతున్న జిల్లా రూపురేఖలు

అభివృద్ధిలో దూసుకుపోతున్న రంగారెడ్డి జిల్లాలో 300 ఎకరాల్లో ఉద్యానవన మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  ఢిల్లీ ఆజాద్‌పూర్‌లో 80 ఎకరాల్లో  ఇటువంటి మార్కెట్‌ ఉండగా, అదే నమూనాతో అంతకు మించిన సదుపాయాలతో కొంగరకలాన్‌వద్ద ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ సమీపంలో  మార్కెట్‌  కోసం భూ సేకరణ పూర్తి చేసిన అధికారులు వాటికి హద్దులు కూడా నిర్ణయించారు. పండ్లు, కూరగాయలు అధికంగా సాగుచేసే జిల్లా రైతులకు ఈ మార్కెట్‌ వరంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో ఉద్యానవనశాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక మార్కెట్‌ గురించి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఔటర్‌కు సమీపంలో ఉండడంతో కొంగరకలాన్‌కు  రవాణా కూడా సులభమవుతుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలకు ఈ ప్రదేశం చిరునామాగా మారగా.. ఈ ప్రతిష్టాత్మక మార్కెట్‌తో రూపురేఖలు మారిపోనున్నాయి. 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: పండ్లు, కూరగాయల పంటలకు పెట్టింది పేరు రంగారెడ్డి జిల్లా. జిల్లాలో అధిక మొత్తంలో పండ్లు, పూలు, కూరగాయలు సాగుచేస్తారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ తరహాలో అత్యాధునిక హంగులతో మార్కెట్‌ ఏర్పాటు కానున్నది. ఇది పూలు, పండ్లు, కూరగాయల విక్రయానికి ఆద్భుతమైన వేదిక కానున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ తరహా కొంగరకలాన్‌లో 300 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్రం ప్రభుత్వం ఉన్నది. ఇటీవల నిర్వహించిన ఉద్యానవన శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు వివరాలు ప్రకటించారు. పూలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తున్న జిల్లా రైతులకు ఇది వరంలా మారనున్నది. రాష్ట్రంలో ఉద్యాన సాగులో జిల్లా నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇది ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు మంచి తరుణం. 

300 ఎకరాల్లో విస్తీర్ణం

ఆజాద్‌పూర్‌ మార్కెట్‌ కేవలం 80 ఎకరాల్లోనే విస్తరించి ఉంది. కానీ కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయనున్న మార్కెట్‌ దీనికి రెండు రేట్ల అధిక విస్తీర్ణంలో ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్‌ సమీపంలోని కొంగరకలాన్‌ వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొంగరకలాన్‌ సర్వే నంబర్‌ 300లో 150 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగరకుర్దులోని 153 ఎకరాల భూమి సేకరణకు అధికారులు రంగం సిద్ధంచేశారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలను ఇబ్రహీంపట్నం, మహేశ్వరం తాసిల్దార్ల నుంచి వివరాలు సేకరించారు. ల్యాండ్‌ సర్వే అధికారులతో హద్దులు ఏర్పాటు చేశారు. 

ప్రతి ఏటా లక్ష ఎకరాల్లో సాగు

జిల్లాలో ప్రతి ఏటా 80 నుంచి లక్ష ఎకరాల్లో దాదాపుగా 60 నుంచి 70 వేల మంది రైతులు సాగు చేస్తున్నట్లు అంచనా. 60 వేల ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు, 34 వేల ఎకారాల్లో పండ్ల తోటలు, 6వేల ఎకరాల్లో పూలు, 300 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలు సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో సాగవుతున్న పంటల ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌ హైదరాబాదే. పండించిన ఉత్పత్తులను ప్రతిరోజు గుడిమల్కాపూర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, కొత్తపేట, రైతు బజార్‌, మాదన్నపేట, బోయిన్‌పల్లికి తీసుకెళ్లి రైతులు విక్రయించుకుంటారు. కొంగరకలాన్‌లో ఉద్యానవన పంటల మార్కెట్‌ అందుబాటులోకి వస్తే జిల్లా రైతులకు మరింత సౌకర్యంగా ఉండనున్నది. ఇక ట్రాఫిక్‌ కష్టాలు, వ్యయ ప్రయాసలు తొలగనున్నాయి. ఇక్కడ ఆయా జిల్లాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి కూడా ట్రేడర్లు ఉత్పత్తులు కొనడానికి రానున్నారు. దీంతో విస్తృతంగా మార్కెటింగ్‌ అవకాశాలు మెరుగవడంతో పాటు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించనున్నది. జిల్లాలో ఇన్ని మండలాలాకు నలుగురు అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు రెండు నియోజకవర్గాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్క మండలానికి ఒక ఉద్యానవన అధికారి నియామకానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమం త్రి కేసీఆర్‌ వెల్లడించారు. వరి, పత్తి, కంది పం టల సాగులో సత్తాచాటిన తెలంగాణ, పూలు, పండ్లు, కూరగాయల సాగులోనూ దేశంలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రణాళికలు రూపొదించాలని అధికారులను ఆదేశించారు. 

10 ఏండ్ల క్రితమే భూముల సేకరణ 

ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కొంగరకలాన్‌లో 332 ఎకరాల భూమిని సేకరించారు. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో కొంగరకుర్దులో 275 దిల్‌ భూమి, 53 ఎకరాల ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించారు. కొంగరకలాన్‌లో గుర్తించిన భూమిలోంచి 46.18ఎకరాల భూమిని రంగారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయానికి కేటాయించారు. 50 ఎకరాలు ఇండో యూకే హెల్త్‌ కేర్‌ యూనిట్‌కు, 100 ఎకరాలు జ్యుడీషియల్‌ అకాడమీ, 70 ఎకరాలు రోడ్లు ఓపెన్‌ ఏరియాలను కలిపి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు (డీసీసీబీ, డీసీఎంఎస్‌లు రెండు కలిపి) 4 ఎకరాలు, డీసీఎంఎస్‌ గోదాంకు 4 ఎకరాల చొప్పున కేటాయించడానికి నివేదిక పంపింది. దీంతో పాటుగా కొంగరకుర్దులో 275 ఎకరాలు దిల్‌ భూమి, 53 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించి, స్థలం లభ్యతపై రెవెన్యూశాఖ అధికారులు గుర్తించారు. ఈ స్థలాల్లో ఉద్యానవన మార్కెట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ భూములకు సమీపంలోనే నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం నిర్మాణం పూర్తి కావచ్చింది.

ఇంటర్నేషనల్‌ స్థాయిలో..

జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల రాకతో కొంగరకలాన్‌ పరిధి దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ కలెక్టరేట్‌తో పాటుగా టీసీఎస్‌, ఏరోస్పేస్‌ హాబ్‌, లాజిస్టిక్‌ పార్కు, హార్డ్‌వేర్‌ పార్కులు ఏర్పాటయ్యాయి.  సమీపంలోనే శంషాబాద్‌ విమానాశ్రయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉద్యానవన మార్కెట్‌ ఏర్పాటు చేయనుండడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధించనున్నది. నూతనంగా ఏర్పాటు చేయనున్న మార్కెట్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో.. హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్న రావిర్యాల, బొంగుళూర్‌ ఔటర్‌ రోడ్డుకు అతి చేరువలో ఉన్న కొంగరకలాన్‌లో ఉద్యానవన పంటల మార్కెట్‌ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల్లో సమగ్ర నివేదికను రూపొదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.