సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Oct 22, 2020 , 06:33:12

అందరినీ ఆదుకుంటాం

అందరినీ ఆదుకుంటాం

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  

  • మహేశ్వరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన 
  • బాలాజీనగర్‌లో వరద బాధితులకు పరిహారం అందజేత  

బడంగ్‌పేట: ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గంలో జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అంతేకాక బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బాలాజీనగర్‌, మల్లాపూర్‌ వీకర్‌ సెక్షన్‌, వెంకటాపూర్‌, జెల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని ఉస్మాన్‌ నగర్‌, మీర్‌పేట, జెల్‌పల్లి, బడంగ్‌పేట తదితర ప్రాంతాల్లో వరద బాధితులకు పదివేలు, కేసీఆర్‌ కిట్లును అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన వారిని గుర్తించి ఆర్థిక సాయం చేసేందుకు సర్వే చేస్తున్నామన్నారు. ముంపు ప్రాంతవాసులను ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఆస్థినష్టం జరిగినా ప్రాణనష్టం జరగకుండా చూస్తామన్నారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులనూ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి లక్ష, పాక్షికంగా ధ్వంసమైతే యాభై వేలు ఇస్తున్నామన్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోక ముందే పెద్ద విపత్తు వచ్చి పడిందన్నారు. భారీగా వచ్చిన వరదలకు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. పరిస్థితి చక్కబడిన తర్వాత మరమ్మతులు చేయిస్తామన్నారు. కొట్టుకుపోయిన రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నాలుగు ట్రంక్‌లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఇబ్రం శేఖర్‌, కమిషనర్‌ సుమన్‌ రావు, కార్పొరేటర్లు భారతమ్మాకొమరయ్య యాదవ్‌, బాలు నాయక్‌, ఏనుగు రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రామిడి రాంరెడ్డి, బొర్ర జగన్‌ రెడ్డి, సంరెడ్డి వెంకట్ర్రెడ్డి, బీమిడి జంగారెడ్డి, సిల్వేరు సాంబశివ పాల్గొన్నారు.