గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 21, 2020 , 04:55:05

ఇంటింటికీ సాయం...

ఇంటింటికీ సాయం...

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.10వేల ఆర్థికసాయం ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం  మీర్‌పేటలోని ముంపు ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పర్యటించి బాధిత కుటుంబాలకు  ఆర్థికసాయం అందజేశారు.  ఇంటింటికీ వెళ్లి  ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసి ఓదార్చారు. ఎవరూ ఆందోళన పడొద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  ఇంకా వర్షం ముప్పు తొలగనందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే, హయత్‌నగర్‌, పెద్దఅంబర్‌పేటలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు తక్షణసాయం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వరద బాధితులకు అండగా నిలిచారన్నారు. గతంలో ఎన్నడూ  ఇంత త్వరగా సాయమందించిన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు.  

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పండుగొస్తే ఆడపడుచులకు చీరలివ్వడమేకాదు.. కష్టమొస్తే ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటామని మరోమారు సీఎం కేసీఆర్‌ నిరూపించారని వర్షం బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేకమంది ఇక్కట్లు పడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముంపు ప్రాంతాల వారికి కుటుంబానికి రూ.10వేలు, ఇండ్లు మొత్తం కూలిపోతే రూ.1లక్ష, పాక్షికంగా కూలితే రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించిన విషయం విదితమే. ప్రజాప్రతినిధులు మంగళవారం పలుచోట్ల పర్యటించి ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. తామున్నామని భరోసా ఇచ్చారు. ఈ విపత్తునుంచి బయట పడే వరకు ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తామని, అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

బాధితులకు అండగా ఉంటాం: మంత్రి సబితారెడ్డి

   ఇటీవలి భారీ వర్షాలకు ఇళ్లలో నీరు చేరి ఇబ్బందులు పడ్డ వరద బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సాయాన్ని మీర్‌పేట్‌లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న  సహాయం ఎంతో గొప్పదన్నారు.  వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 550 కోట్లు మునిసిపల్‌ శాఖకు విడుదల చేశారని చెప్పారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్ల పరిధిలోని లెనిన్‌ నగర్‌,నాదర్‌ గుల్‌, కమ్మగూడలో తక్షణ సహాయంగా ఇంటింటికి రూ. 10 వేలు అందజేసినట్లు మంత్రి వివరించారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సహాయం పంపిణీలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, మేయర్లు దుర్గాదీప్‌ లాల్‌ చౌహన్‌, పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్లు తీగల విక్రమ్‌ రెడ్డి, ఇబ్రాం శేఖర్‌, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.

పుకార్లు నమ్మొద్దు, అసత్యాలు ప్రచారం చేయొద్దు..

  మీర్‌పేట్‌ చెరువుకు గండి పడిందనే వార్తలు అవాస్తవమని మంత్రి సబితారెడ్డి తెలిపారు. పుకార్లు నమ్మవద్దని, అసత్యాలు ప్రచారం చేయవద్దని మంత్రి సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్‌లతో కలిసి మీర్‌పేట్‌ చెరువును మంత్రి పరిశీలించారు. అసత్యాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రజలు వీటిని నమ్మొదంటూ పిలుపునిచ్చారు.  

అందరికీ సాయం అందిస్తాం: ఎమ్మెల్యే మంచిరెడ్డి

హయత్‌నగర్‌/పెద్దఅంబర్‌ పేట : వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నగదు పరిహారాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి మంగళవారం పలుచోట్ల అందజేశారు. తుర్కయాంజాల్‌లో  మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్‌ చైర్‌ పర్సన్‌ గుండ్లపల్లి హరిత ధన్‌రాజ్‌ గౌడ్‌తో కలిసి ఇంజాపూర్‌ ఇందిరమ్మ కాలనీ వరద బాధితులకు సాయం అందజేశారు. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలోని కళానగర్‌, భూదాన్‌ కాలనీలలో  స్థానిక వైస్‌ చైర్‌పర్సన్‌ చామ సంపూర్ణారెడ్డి, కమిషనర్‌ బలరాం, కౌన్సిలర్‌ గ్యారాల శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లకు సంబంధించిన నివేదికను రెవెన్యూ, మున్సిపల్‌ శాఖ అధికారులతో తయారు చేయించి మూడు నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికి రూ.10 వేలు నగదు అందేలా చూస్తామన్నారు.  ముంపు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన వరద నీటి కాల్వల నిర్మాణం చేపట్టి లోతట్టు ప్రాంతాల్లో వరద సమస్యను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటా చారి, రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, కమిషనర్‌ అహ్మద్‌ షఫీ ఉల్లా, మాజీ జడ్పీటీసీ నోముల కృష్ణా గౌడ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పెద్దఅంబర్‌పేటలో జరిగిన  కార్యక్రమంలో కౌన్సిలర్లు జిఎస్‌ఆర్‌, చెవుల హరిశంకర్‌, గీత, నాయకులు విజయశేఖర్‌రెడ్డి, బలరాం, చింటు, జోర్క శ్రీరాములు, సుప్రసేనారెడ్డి, కొండల్‌ పాల్గొన్నారు. 

రంగారెడ్డి జిల్లాలో హై అలర్ట్‌.. అధికారుల సెలవులు రద్దు 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ :   జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హై అలర్ట్‌ ప్రకటిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతీ అధికారి విధుల్లో ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ హెడ్‌ క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని స్పష్టంచేశారు. అన్ని రకాల ప్రభుత్వ సెలవులు, వ్యక్తిగత సెలవులను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రకటించారు. ప్రతీ అధికారి తమ పరిధిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ అధికారికి వివరిస్తూ ఉండాలని, ఈ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై సీసీఏ నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.