సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Oct 20, 2020 , 05:29:25

రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు

రైతు వేదికల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దు

  •  వచ్చే సీజన్‌లో సీతాఫలాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
  • రైతులతో పంట వివరాల సేకరణ
  •  వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు
  •  ముజాహిద్‌పూర్‌, శివారెడ్డిపల్లిలో రైతువేదిక భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్‌ 

కులకచర్ల/ దోమ: రైతు వేదిక భవనాల నిర్మాణాలు ఇచ్చిన గడువులోపు పూర్తిచేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. సోమవారం కులకచర్ల మండలంలోని ముజాహిద్‌పూర్‌ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు. రైతు వేదిక భవన నిర్మాణదారులు ఇచ్చిన గడువులోగా భవనాలను పూర్తి చేయాలని సర్పంచ్‌ను, కాంట్రాక్టర్‌ను ఆమె ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు అవసరమైతే ఎక్కువ మంది లేబర్‌ను పెట్టుకోవాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించిన పేమెంట్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు ఆదేశించారు. వైకుంఠధామం పనులు కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రైతు వేదిక భవనాల నిర్మాణం పురోగతి చూయించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

వచ్చే సీజన్‌లో సీతాఫలాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

రాబోవు సీజన్‌లో సీతాఫలాలు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను మండలంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. ముజాహిద్‌పూర్‌ గ్రామంలో సీతాఫలాలు సేకరించేవారు ఎంతమంది ఉన్నారని, వారు రోజూ ఎక్కడ అమ్ముకుని ఎంత సంపాదిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాబోవు రోజుల్లో సీతాఫలాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లాభం ఆర్జించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈసారి వేసిన పంటల వివరాలను రైతులతో అడిగి తెలుసుకోగా అధిక వర్షాలతో చాలామంది నష్టపోయారని తెలిపారు. వేసిన పంటల వివరాలను అడుగగా వరి, కంది, పత్తి పంటలు వేశామని, భారీ వర్షాలకు పంటలు నష్టపోయామని అన్నారు. వర్షాలకు గ్రామాల్లో కూలిన ఇళ్ల వివరాలను సర్వే చేసి తమకు అందజేయాలని తాసిల్దార్లకు కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్‌ నాయక్‌, పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈ ఉమేశ్‌కుమార్‌, ఎంపీడీవో కాలూసింగ్‌, సర్పంచ్‌ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ హరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, తాసిల్దార్‌ అశోక్‌కుమార్‌, నాయకులు సారా శ్రీనివాస్‌, శంకర్‌నాయక్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

దోమలో..

పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతు వేదిక భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని కల్టెర్‌ పౌసుమిబసు అన్నారు. దోమ మండలంలోని శివారెడ్డిపల్లి గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్‌, అధికారులు రైతు వేదిక భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ నెల చివరి నాటికి వాటిని వినియోగంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల వివరాలను వాట్సప్‌ ద్వారా ప్రతి రోజూ సమాచారం అందించాలని ఏఈ మణికుమార్‌ను ఆదేశించారు. అనంతరం ఆమె గ్రామ పారిశుద్ధ్యంపై స్థానిక సర్పంచ్‌ నరేందర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, సంబంధిత అధికారులకు చెప్పినా స్పందించడం లేదని సర్పంచ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు పూర్తి చేయిస్తానని తెలిపారు. గ్రామంలో నీరు నిలిచే ప్రదేశాల్లో వీలైనంత త్వరగా సోక్‌పీట్‌ల నిర్మాణాలను చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ అర్జున్‌రెడ్డి, పీఆర్‌ డీఈ ఉమేశ్‌, ఎంపీడీవో జయరాం, ఏపీవో వెంకటేశ్‌, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.