శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Oct 20, 2020 , 05:29:50

రైతులు అధైర్యపడొద్దు..

రైతులు అధైర్యపడొద్దు..

  • వర్షాల కారణంగా నష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తాం..
  • రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా  అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి
  • తుర్కయాంజాల్‌, రాగన్నగూడ గ్రామాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన 

హయత్‌నగర్‌: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ, తుర్కయాంజాల్‌ గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా  అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య సోమవారం వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. మన్నెగూడలో ఎర్రకుంట చెరువు దిగువన వరద తాకిడికి దెబ్బతిన్న వరి చేనును, తుర్కయాంజాల్‌ మాసాబ్‌ చెరువులో మునిగిన పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలతో జిల్లాలో సుమారు 83 వేల 810 ఎకరాల్లో పంట నష్టం జరుగగా అందులో పత్తి 61వేలు, వరి 18, 960 ఎకరాలు, కంది 2,747 ఎకరాల్లో దెబ్బతిన్నాయన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల పరిధిలో సుమారు 1050 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు.  పంట నష్టం నివేదిక రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రూ. 550 కోట్లు మంజూరు చేశారనన్నారు. తెలంగాణలో సంభవించిన జల విలయాన్ని  జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం రెండు వందల కోట్లు మంజూరు చేయాలని కోరారు. రైతులు తమ దెబ్బతిన్న పంటలకు సంబంధించిన చిత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలను వ్యవసాయ అధికారులకు అందజేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో  రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌  బలదేవ రెడ్డి, ఏఓ ఉమ, ఏఈఓలు కళ్యాణి, లక్ష్మణ్‌, నాయకులు విజయానంద్‌ రెడ్డి, రైతులు  పాల్గొన్నారు.