గురువారం 22 అక్టోబర్ 2020
Rangareddy - Oct 18, 2020 , 00:28:18

ప్రతి 300 ఎకరాల విస్తీర్ణానికి ఒక ట్రాక్టర్‌

ప్రతి 300 ఎకరాల విస్తీర్ణానికి ఒక ట్రాక్టర్‌

రంగారెడ్డి జిల్లాలో 217 సబ్సిడీ వాహనాలు అందజేసిన వ్యవసాయ శాఖ 

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి

ఆర్థికంగా ఎదుగుతున్న అన్నదాతలు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున ట్రాక్టర్లు పంపిణీ చేపట్టింది. దుక్కి దున్నడానికి ప్రతి 300 ఎకరాల విస్తీర్ణానికి ఒక ట్రాక్టర్‌ చొప్పున రాయితీపై రైతులకు అందజేశారు. ప్రత్యేకంగా ట్రాక్టర్ల మేళా పెట్టి రైతులకు వందలాది ట్రాక్టర్లను  ఇచ్చారు. ఇదే సమయంలో యువతకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారింది. వ్యవసాయం మొదలుకొని.. చిన్న చిన్న పనులను ట్రాక్టర్లతో ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యంత్రలక్ష్మి పేరిట ప్రభుత్వం ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నది. 

ఒక్క ఏడాదిలోనే 217 ట్రాక్టర్ల అందజేత

రంగారెడ్డి జిల్లాలోని ఐదు డివిజన్ల పరిధిలో వ్యవసాయాభివృద్ధి పేరిట లక్షలాది రూపాయల రాయితీ ఇస్తున్నారు. విపక్షం.. స్వపక్షం అనే తేడా లేకుండా రైతులందరికీ ట్రాక్టర్లు అందజేస్తున్నారు. వ్యవసాయాధికారులు 2017-18లో 217 ట్రాక్టర్లను రైతులకు అందజేశారు. ట్రాక్టరు కంపెనీలు ప్రత్యేకంగా ముందుకొచ్చి జిల్లాలోని మండలాల వారీగా షోరూంలు ఏర్పాటు చేసుకున్నాయి. వ్యవసాయ అవసరాలకు అవసరమయ్యే అన్ని రకాల ట్రాక్టర్లను అందుబాటులో ఉంచాయి. కొన్ని పల్లెల్లో ఎక్కువ.. మరికొన్నిట్లో తక్కువ ట్రాక్టర్లు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులకు అనుగుణంగా రైతులు మార్చుకుంటున్నారు. ఒక ట్రాక్టర్‌పై గరిష్టంగా రూ.4.50 లక్షల రాయితీ ఇచ్చారు. వాటిని సొంతం చేసుకునేందుకు భారీగా పోటీ నెలకొని ఉన్న ప్రాంతాల్లో లక్కీ డ్రా సైతం తీశారు. దీంతో రాయితీపై ఇచ్చిన ట్రాక్టర్ల యజమనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

యువతకు ఉపాధి

ప్రస్తుతం ఈ ట్రాక్టర్లతో యువతకు ఉపాధి లభిస్తున్నది. సకాలంలో వర్షాలు కురువడంతో పంటలు సాగుచేసేందుకు రైతులు ఆసక్తి కనబర్చారు. దీంతో దుక్కి దున్నడం, గొర్రు కొట్టడం లాంటి పనులకు గంటకు రూ.700 నుంచి 800 చొప్పున అద్దె చెల్లించి వ్యవసాయ పనులు చేయించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ట్రాక్టర్లు ఉన్న వారికి వరంగా మారింది. 

రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి

రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నది. వ్యవసాయ రంగంలో క్రమేణ యాంత్రీకరణ చేయడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశాలున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యయసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆధునిక యంత్రాలను సబ్సిడీపై అందజేస్తున్నది. సబ్సిడీ ట్రాక్టర్లను దుక్కిదున్నేందుకు, పంటలను వేసేందుకు, పండిన పంటలను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు,  కొనుగోలు చేసిన  ఎరువులను తీసుకొచ్చేందుకు అద్దె ట్రాక్టర్లను ఉపయోగించేవారు. దీంతో రైతన్నలు అద్దెలతో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేసి రైతుల్లో మరింత భరోసాను కలిగించింది. వీటిని ఉపయోగించుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతున్నది. 

పెరిగిన ట్రాక్టర్ల వినియోగం

పల్లెలు, పట్టణాల్లో సబ్సిడీ ట్రాక్టర్ల వినియోగం భారీగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో జల వనరులు పెరుగడంతో అదనంగా భూమి సాగులోకి వచ్చిందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వ్యవసాయంలో ట్రాక్టర్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయం కోసమే కాకుండా రవాణా, పంట సరుకులతో పాటుగా భవన నిర్మాణాల సామగ్రిని తరలిస్తున్నారు. పల్లెల్లో ట్రాక్టర్లతో అనేక పనులు చేస్తున్నారు. దీంతో వారికి అది ఆదాయ మార్గంలా మారింది. ఇతర వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు లాక్‌డౌన్‌లో కుదేలైపోయినప్పటికీ రైతులపై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంట పెట్టుబడి సాయం అందజేసింది. దీంతో పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నది. అన్నదాతలు సబ్సిడీ యంత్రాలను సద్వినియోగం చేసుకుంటూ లాభాల బాట పడుతున్నారు. 

ట్రాక్టర్‌తో సాఫీగా వ్యవసాయ పనులు

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్‌తో మా సొంత పొలంలో వ్యవసాయ పనులు సాఫీగా చేసుకుంటున్నం. వీటితోపాటు బ్లేడును ఏర్పాటు చేసి డోజింగ్‌ పనులు చేయిస్తున్నాం. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్‌ వల్ల ఉపాధి లభిస్తున్నది. ట్రాక్టర్‌ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు.   

      - కేతావత్‌ మాల్యా, రైతు,                                   ఎక్లాస్‌ఖాన్‌పేట, కేశంపేట 


చాలా ఉపయోగకరంగా ఉంది 

తెలంగాణ సర్కార్‌ అందజేసిన సబ్సిడీ ట్రాక్టర్‌తో 3.20ఎకరాల భూమిని సాగు చేస్తున్నా. సాగుతో పాటు పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నా. ట్రాక్టర్‌తోనే వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్‌కు తరలిస్తున్నా. అందుకే ఏడాది పొడువునా  లాభం వస్తున్నది. ట్రాక్టర్‌ అందజేసిన తెలంగాణ సర్కార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. 

    - హన్మంత్‌రెడ్డి, రైతు, కమ్మదనం, 

ఫరూఖ్‌నగర్‌ మండలం

సొంత పనులతో ఖర్చు తగ్గింది

తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మా తలరాతలు మారాయి. నాకున్న 5ఎకరాలలో ట్రాక్టర్‌తో సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నా. గతంలో అద్దెకు ట్రాక్టర్‌ తీసుకొచ్చి వ్యవసాయం చేయడానికి ఇబ్బందిగా ఉండేది. సర్కార్‌ సబ్సిడీపై ట్రాక్టర్‌ను అందజేసింది. దీంతో నా పొలంలో సొంతగా సాగు చేస్తున్నా. అందుకే చాలా ఖర్చులు తగ్గాయి.  -దామోదర్‌, రైతు,

చించోడ్‌, ఫరూఖ్‌నగర్‌ 


logo