గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 18, 2020 , 00:28:17

భారీ వర్షానికి ‘గుంతపల్లి’ అతలాకుతలం

భారీ వర్షానికి ‘గుంతపల్లి’ అతలాకుతలం

తెగిపోయిన చెరువు, ధ్వంసమైన ఇండ్లు 

నిలిచిపోయిన రాకపోకలు 

అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షానికి గుంతపల్లి గ్రామం కోలుకోకుండా మారింది. వరద ప్రవాహానికి ఊరంతా అతలాకుతలమైంది. దాంతో తీవ్ర నష్టం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన వరదలతో గ్రామంలోని ప్రజలంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. గుంతపల్లిలో ఎక్కడ చూసినా నేటికి వరదతో జరిగిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గుంతపల్లి చెరువు నిండుకుండలా మారి ఎప్పుడూ చూడని విధంగా అలుగు పారింది. పై భాగంలో ఉన్న ఉమర్‌ఖాన్‌గూడ చెరువు కట్ట తెగడంతో గుంతపల్లి చెరువులోకి వరద నీరు మరింత వచ్చి చేరింది. ఇటీవల చెరువుకట్ట తెగడంతో వరద ప్రవాహం అతివేగంగా ఉగ్రరూపం చూపించింది. గ్రామంలోకి వరద ఉధృతంగా రావడంతో గ్రామస్తులు భయాందోళనతో దిక్కుతోచని స్థితిలో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. ఊరు మధ్యలో వరద కాలువ సైతం కోత కోయడంతో కాలువ పక్కనే ఉన్న ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇండ్లలోని సామగ్రి, బట్టలు, నగదు కొట్టుకుపోయాయి. ఓ ఇంట్లో 20 తులాల బంగారం, మూడు బీరువాలు కొట్టుకుపోయాయి. గుంతపల్లి-మజీద్‌పూర్‌ ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయి వాగులా తలపిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రెండు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. పంచాయతీ కార్యాలయంలోకి నీరు చేరి ఫైల్స్‌ పూర్తిగా కొట్టుకుపోయాయి. సర్పంచ్‌ కరిమెల వెంకటేశ్‌ స్పందించి గ్రామం మధ్యలో తెగిన రోడ్డును ప్రత్యేక చొరువ తీసుకొని సొంతంగా బాగుచేయించారు. ఆయా శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించాలని సర్పంచ్‌, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పట్నంలో భారీ వర్షం

ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఇబ్రహీపట్నం, మంచాల, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయాంజాల్‌, పెద్దఅంబర్‌పేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యాచారంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.