మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Oct 17, 2020 , 00:28:08

ఇండ్లు కూలిపోయిన వారికి పరిహారం అందించేందుకు కృషి..

ఇండ్లు కూలిపోయిన వారికి పరిహారం అందించేందుకు కృషి..

వరదలో గల్లంతై చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం

పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నంరూరల్‌: సాగు నీరులేక ఇరవై ఏండ్లుగా రైతు అల్లాడుతున్న తరుణంలో వరుణుడి కరుణించడంతో నియోజక వర్గంలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా నిండి, అలుగు దుంకుతుండడం ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నరు. ఈ సందర్భంగా వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్‌, ముకునూరు, దండుమైలారం, పోల్కంపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. రాయపోల్‌, పోల్కంపల్లిగ్రామాల్లో చెరువులు పారుతుండడంతో ఎంపీపీ కృపేశ్‌, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం వర్షాలతో నష్టపోయిన వరి, కూరగాయల పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను అంచనా వేసి త్వరలో నివేదిక తయారు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్కడక్కడ పురాతన ఇండ్లు కూలిపోయాయని, వాటి స్థానంలో కొత్తవి కట్టించేందుకు కృషిచేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కురిసిన వర్షాలకు నలుగురు మృత్యువాత పడ్డారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించేందుకు కృషిచేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో వేసిన చేపలు ఇటీవల వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయినందున మళ్లీ అందించేందుకు అధికారులతో మాట్లాడి కృషిచేస్తానన్నారు. ఇరవై ఏండ్ల తరువాత పెద్దచెరువుకు నీరు రావడంతో రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 17 అడుగుల నీరు చేరింది. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ వెంకటప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు మల్లీశ్వరి జంగయ్య, బల్వంత్‌రెడ్డి, ఆండాలు గిరి, జ్యోతిరాజు, ఎంపీటీసీలు ఆండాలు రవి, గంగిరెడ్డి జ్యోతిభాస్కర్‌రెడ్డి, అచ్చన శ్రీశైలం, పిట్టల అనసూయ, సహకార సంఘం చైర్మన్లు బిట్ల వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎంపీడీవో నరేందర్‌, తాసిల్దార్‌ వెంకటేశ్వర్లు, ఏఈ ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, నాయకులు మంఖాల దాసు, గుండ్ల దానయ్యగౌడ్‌, అశోక్‌గౌడ్‌, బాలుగౌడ్‌, నర్సింహ, రమణారెడ్డి, జెర్కోని రాజు, మైలారం విజయ్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి, జగదీశ్‌, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, సురేందర్‌, బాలుగౌడ్‌, జగన్నాధం పాల్గొన్నారు. 

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

హయత్‌నగర్‌: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని పలు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, నిండిన చెరువుతో పాటు తెగిన ఉమర్‌ఖాన్‌ గూడ చెరువు కట్టను సందర్శించారు. త్వరితగతిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొహెడ వెంకట్‌రెడ్డి వాగును, మొండికుంట, బ్రహ్మణపల్లి, తొర్రూర్‌లో అలుగు పారుతున్న చెరువులను పరిశీలించి, ఆనందం వ్యక్తంచేశారు. 

మృతుల కుటుంబాలకు పరామర్శ

మాసాబ్‌ చెరువు వదర ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన తొర్రూర్‌ గ్రామానికి చెందిన జయదీప్‌, ప్రణయ్‌ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. రాజీవ్‌ గృహకల్పకు చేరుకుని మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ సత్తయ్య, రంగారెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు జ్యోతి, శ్రీలత, టీఆర్‌ఎస్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల అధ్యక్షుడు చక్రవర్తి గౌడ్‌, నాయకులు బిందు రంగారెడ్డి, విజయ్‌ ఆనంద్‌రెడ్డి, ధన్‌రాజ్‌ పాల్గొన్నారు. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ, కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కొశిక ఐలయ్య, కౌన్సిలర్‌ సునీల్‌ కూడా మృతుల కుటుంబాలను పరామర్శించారు.