బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Oct 17, 2020 , 00:28:03

ఫార్మాసిటీ అంటే.. ప్రతిపక్షాలకు భయం

ఫార్మాసిటీ అంటే.. ప్రతిపక్షాలకు భయం

ఉనికిని కోల్పోతామనే విమర్శలు

భూములు కోల్పోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు 

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కందుకూరు: ఫార్మాసిటీ అంటే ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని, ఎక్కడ తమ ఉనికిని కోల్పోతామోననే భయం పట్టుకునే అర్థం లేని విమర్శలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న ప్రతి రైతునూ ఆదుకుంటామన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఫార్మాసిటీ రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోని భయంతో ప్రతి పక్షాలకు చెందిన నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. పీవోటీ రైతులను కూడా ఆదుకుంటామని హమీ ఇచ్చారు. గతంలో భూముల కోల్పోయి డబ్బులు అందని రైతులకు, రాళ్లు ఉన్న పొలాలకు కూడా పరిహారం అందించడానికి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంలో పీవోటీ రైతులు ఆందోళన చేందాల్సిన అవసరం లేదన్నారు. 288, 90, 112, 155 సర్వే నంబర్లలో పొలాలు ఉన్న రైతులకు నష్టపరిహారంతో పాటు పట్టా రైతులకు ఇచ్చేలా ఇంటికో ఉద్యోగం, ఎకరాకు 121 గజాల స్థలం ఇస్తామన్నారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, తాసిల్దారు జ్యోతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జయేందర్‌ ముదిరాజ్‌, కాకి దశరథ ముదిరాజ్‌, గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, ప్రవీణ్‌నాయక్‌, సదానంద్‌గౌడ్‌, ఇందిరమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.