మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 16, 2020 , 02:16:09

కొంగరకలాన్‌లో ఉద్యాన పంటల మార్కెట్‌

కొంగరకలాన్‌లో ఉద్యాన పంటల మార్కెట్‌

  • 300 ఎకరాల ప్రభుత్వ భూముల సేకరణకు రెవెన్యూ అధికారుల ‘సర్వేలు’
  • నూతన సమీకృత కలెక్టరేట్‌ను సందర్శించిన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ హరీశ్‌

ఆదిబట్ల : ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో  సమీకృత నూతన కలెక్టరేట్‌ సమీపంలో 300 ఎకరాల్లో ఉద్యాన పంటల మార్కెట్‌కు ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. అందుకు భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొంగరకలాన్‌లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ పక్కన సర్వే నంబర్‌ 300లో 300 ఎకరాల ప్రభుత్వ భూములు టీఎస్‌ఐఐసీ ఆధీనంలో ఉన్నాయి. అలాగే మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూలో కూడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి టీఎస్‌ఐఐసీ భూముల్లో 150 ఎకరాలు, మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూలో 150 ఎకరాల ప్రభుత్వ భూములు సేకరించేందుకు అధికారులు సర్వే పనులు గురువారం మొదలు పెట్టారు. జాయింట్‌ కల్టెకర్‌ హరీశ్‌ కొంగరకలాన్‌ కల్టెరేట్‌కు వచ్చారు. దీంతో ఇబ్రహీంపట్నం తాసిల్దార్‌ వెంకటేశ్వర్లు, మహేశ్వరం తాసిల్దార్‌ జ్యోతితో పాటుగా రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వారితో ఉద్యానవన పంటల మార్కెట్‌కు సంబంధించిన విషయాలను ఆయన చర్చించారు.  సేకరించే భూముల చుట్టూ సర్వేయర్లు హద్దులు ఏర్పాటు చేసే పనులు వేగవంతంగా చేపడుతున్నారు. కొంగరకలాన్‌కు ఉద్యానవన పంటల మార్కెట్‌ ఏర్పాటుతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్టరేట్‌ను సందర్శించిన కలెక్టర్‌..

కొంగరకలాన్‌లో ఉద్యానవన పంటల మార్కెట్‌ ఏర్పాటు నేపథ్యంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ గురువారం నూతన సమీకృత కలెక్టరేట్‌కు చేరుకున్నారు.  రెవెన్యూ అధికారులతో భూముల సేకరణకు సంబంధించి చర్చించారు. ఉద్యాన పంటల మార్కెట్‌ ఏర్పాటుకు భూముల సేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అలాగే కొంగరకలాన్‌ రెవెన్యూ, కొంగరకుర్దు రెవెన్యూలో 300 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సర్వే పనులు చేపట్టామని వివరించారు. 

చెరువులు, రోడ్లకు   మరమ్మతులు చేస్తాం..

వర్షానికి గండిపడిన చెరువులు, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేస్తామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని గండిపడిన చెరువులు, తెగిన రోడ్లును గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆదిబట్ల సమీపంలో కూలిపోయిన బ్రిడ్జిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొత్త ఆర్తిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కోరే కళమ్మ , కమిషనర్‌ సరస్వతితో కలసి పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట కౌన్సిలర్లు గోపగల్ల మహేందర్‌, కోలా నాగేశ్‌, వనం శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కొత్త ప్రవీణ్‌, కోరే జంగయ్య తదితరులు ఉన్నారు.