గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 10, 2020 , 01:46:16

సారె మెరిసె.. ఆడబిడ్డ మురిసె..

సారె మెరిసె.. ఆడబిడ్డ మురిసె..

బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం సందడిగా ప్రారంభమైంది.  ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళల హడావిడితో పట్టణాలు, గ్రామాల్లో  పండుగ వాతావరణం కనిపించింది. దసరా కానుకగా ప్రభుత్వం అందజేసిన చీరలను తీసుకున్న మహిళలు మురిసిపోయారు.  పండుగపూట కొత్త బట్టలు పెట్టిన సీఎం కేసీఆర్‌ నిండునూరేళ్లు సల్లంగ ఉండాలని ముసలమ్మలు దీవించగా.. తోడబుట్టిన అన్నలా  సారె పెట్టిండని ఆడపడుచులు సంతోషం వ్యక్తం చేశారు.  వికారాబాద్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలో  స్థానిక ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కడ్తాల్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ బతుకమ్మ చీరల పంపిణీని  ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ  ప్రతి పండుగకు  కానుకలు అందజేస్తున్నదన్నారు.  రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.  

బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందంగా జరుపుకొనేందుకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరుగా మొదలైంది. మొదటి రోజు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, ఇబ్రహీం పట్నం, ఆమనగల్లు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లోని చాలా మండలాల్లో బతుకమ్మ చీరలు పంపిణీచేశారు.  ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చీరలను పేదింటి మహిళలకు అందజేశారు. చీరలందుకున్న ఆడపడుచులు తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. సీఎం కేసీఆర్‌లాంటి నాయకుడు ఉన్నంతకాలం తెలంగాణలో ఆడపిల్లలు, మహిళల సంక్షేమం, భద్రతకు ఎలాంటి ఢోకాలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ పదికాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. 

కేసీఆర్‌ సారు సల్లంగుండాలే..

అక్కా చూసినావే.. బతుకమ్మ చీర ఎంత మంచిగున్నదో.. నువ్వు ఏ రంగు చీర తీసుకున్నావ్‌.. నేను బులుగు రంగు తీసుకున్న.. అవునా చెల్లె.. నేను పచ్చరంగు చీర తీసుకున్న... పుట్టింటోళ్లు బతుకమ్మ పండుగకు ఆడపిల్లలకు బట్టలు పెట్టినట్లు, ఏటా మన సీఎం కేసీఆర్‌ సారు పెద్దన్నలెక్క చీరలు ఇస్తూ దసరాను సంబురంగా జరుపుకోవాలని దీవిస్తున్నడు.. ఆడపడుచుల కండ్లల్లో ఆనందం నింపేందుకు సీఎం కేసీఆర్‌ మస్తు కష్టపడుతున్నడు అక్కా.. ఆ సారు సల్లంగుండా.. ఆడపడుచులకు అన్నలా.. మేనమామలా ఆదుకుంటున్నడు. అంటూ వికారాబాద్‌లోని మున్సిపల్‌ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఇద్దరు మహిళల మధ్య జరిగిన సంభాషణ.

సారుకు రుణపడి ఉంటాం.. 

ఏ సర్కారోళ్లు కూడా మహిళల పట్ల ఇంత మంచిగ చేయలేదు. పండుగ పూట పేద మహిళలందరికీ చీరలు అందజేస్తున్న కేసీఆర్‌ సారు సల్లగుండాలే. ఆయన ఆడపడుచులకు తోబుట్టువు లెక్క చేస్తున్న పనులతో సంతోషంగా ఉన్నాం. ఆడోళ్లంతా కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం.

- బాకారం భారతమ్మ, రాయపోల్‌ (ఇబ్రహీంపట్నం రూరల్‌) 

సారిచ్చే చీరలు యాదికొస్తయ్‌..

కేసీఆర్‌ సార్‌ ఇస్తున్న బతుకమ్మ చీరలు పోయినసారి కంటే ఇప్పుడు బాగున్నయ్‌. బతుకమ్మ పండుగ వస్తే మాకు సార్‌ ఇచ్చే చీరలే యాదికొస్తయ్‌. పేదింటి ఆడబిడ్డల గురించి కేసీఆర్‌ సారు అన్నదమ్ముడిలా ఆలోచిస్తున్నడు. ఆ సారు దయవల్ల దసరా పండుగకు ఇదే చీరను కట్టుకుంటా. కరోనా కాలంలో ఆదుకుంటున్నడు.

- రాములమ్మ, వికారాబాద్‌

చీరలిచ్చే సంప్రదాయం గొప్పది

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరను ఏటా తీసుకుంటున్న. పండుగకు చీరను అందిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి రుణపడి ఉంటా. బతుకమ్మ పండుగకు చీరలను అందించే సంప్రదాయం చాలా గొప్పది. ఈ చీర పుట్టింటి నుంచి వచ్చిందనుకుంటున్న. ఈసారి ప్రభుత్వం అందిస్తున్న చీరలు నాణ్యతగా, అందమైన రంగుల్లో చాలా బాగున్నాయి. సీఎం కేసీఆర్‌ సారులా మునుపెన్నడూ ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదు. పేదింటి ఆడపడుచులకు అన్ని విధాలుగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారు. సారు పదికాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా..                 - నిర్మల, కడ్తాల్‌ మండలం

ఈసారి చీరలు మంచిగున్నయ్‌

పోయిన సారికంటే ఈసారి ఇచ్చిన చీరలు అందంగా, ఆకర్షణీయంగా, నాణ్యతగా ఉన్నాయ్‌. ఇంత మంచి చీరలు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఓట్లప్పుడు నాయకులు వచ్చి మాటలు చెప్తారు. కానీ ఆడపడుచులందరికీ చీరలు ఇచ్చి అభిమానం చాటింది సీఎం కేసీఆర్‌ ఒక్కరే.. నేరుగా గ్రామంలోకి తెచ్చి చీరలు అందించడం సంతోషంగా ఉంది. పేదింటి ఆడపడుచులకు అన్నలా ఆదుకుంటున్నడు. కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలతో పేదల పిల్లల పెండ్లీళ్లకు మరింత భరోసా కల్పించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నడు. సారుకు అందరం రుణపడి ఉంటాం.  

- సుగుణమ్మ, అప్పరెడ్డిగూడెం,నందిగామ మండలం 

బతుకమ్మ చీరలు బాగున్నాయి

ఈసారి దసరాకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న బతుకమ్మ చీరలు చాలా బాగున్నాయి. ఈ చీరలనే కట్టుకుని బతుకమ్మ ఆడుతా. చీర అందంగా, ఎంతో నాణ్యతతో ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ చీరను సంతోషంగా స్వీకరిస్తున్నా.

- కొంకల పద్మమ్మ, అప్పరెడ్డిగూడెం, నందిగామ మండలం

పండుగను సంతోషంగా జరుపుకొంటాం

ప్రతి ఏడాది సర్కార్‌ ఇచ్చే బతుకమ్మ సారెతో పండుగ జరుపుకొంటున్నాం. ఆడపడుచులకు అండగా కేసీఆర్‌ నిలువడం సంతోషంగా ఉంది. ఏ నాయకుడు చేయనివిధంగా సీఎం కేసీఆర్‌ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కుటుంబ సభ్యుడిలా బతుకమ్మ చీరలు అందిస్తున్న సీఎంకు రుణపడి ఉంటాం. పేదోళ్లమీద ప్రేమ కురిపిస్తున్న కేసీఆర్‌ పదికాలాల పాటు సల్లంగుండాలి. ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుంటున్నడు. 

-పోసమ్మ ఇంద్రనగర్‌కాలనీ షాద్‌నగర్‌

సీఎం కేసీఆర్‌ మా పెద్దన్న..

మహిళలకు బతుకమ్మ చీరలు అందజేయడం ఆనందంగా ఉంది. ప్రతియేడు బతుకమ్మ పండుగకు చీర ఇస్తున్న సీఎం కేసీఆర్‌ మా పెద్దన్న. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు అందజేస్తూ, పుట్టింటి వారిలా ఆదుకుంటున్నడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా సరైన గుర్తింపు వచ్చింది. దీంతో తెలంగాణలో పూలను కూడా పూజిస్తరని తెలిసింది. బతుకమ్మ పండుగ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిండు సీఎం కేసీఆర్‌ సారు. ఆడబిడ్డల గౌరవం మరింత పెరిగేలా చేసిండు. తెలంగాణలోని ప్రతిఒక్కరికీ ఏదో ఒక రకంగా సాయం చేస్తున్నడు. 

- ఎల్లమ్మ, కడ్తాల్‌ మండలం

కరోనా కాలంలో ఆదుకున్నడు

కరోనా వల్ల పనుల్లేక పైసల్లేకుం డ ఉన్నప్పుడు బియ్యం, డబ్బులిచ్చి ఆదుకున్నడు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ సారు బతుకమ్మ చీరలు కూడా ఇస్తున్నడు. చీర మంచిగున్నది. బతుకమ్మ పండుగ వస్తే మాకు కేసీఆర్‌ సారే యాది కొస్తడు. ఆయన నిండు నూరేండ్లు సల్లంగుండాలా.. మరిన్ని సేవలు అందించాలి. - అంబిక, వికారాబాద్‌

మా తోబుట్టువులెక్క..

పండుగ పూట కొత్తబట్టలు కట్టుకునే మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నయ్య లెక్క ఆడపడుచులందరికీ  చీరలు అందజేయడం సంతోషంగా ఉంది. ఇంతకు ముందున్నోళ్లు మహిళల కోసం ఇంతలా ఆలోచించ లేదు. పేదల బాధలు తెలిసిన బిడ్డగా కేసీఆర్‌ సారు అన్ని చేస్తున్నారు. ఆయన వచ్చినంకనే తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కల్యాణం, భద్రతకు  మరింత భరోసా కలిగింది. ఈ సారు నిండు నూరేండ్లు సల్లంగ ఉండాలా.. పేదోళ్లకు గిట్లనే సేవలు చేస్తుండాలా..

- డొంకని జయమ్మ, రాయపోల్‌ (ఇబ్రహీంపట్నంరూరల్‌)