మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 04, 2020 , 00:17:24

ఐటీ మనమే మేటి

ఐటీ మనమే మేటి

  • పెట్టుబడులకు స్వర్గధామం.. 
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి గమ్యస్థానం 
  • దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న భాగ్యనగరం..  
  • ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ అంటే ఆర్భాటమే..
  • కొలువుల కోసం వలస వెళ్లే దుస్థితి.. 
  • స్వరాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీల రాక 
  • స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు.. 
  • కరోనా కష్టకాలంలోనూ ఎగుమతుల్లో వృద్ధి
  • నూతన ఆవిష్కరణలు సర్కారు ప్రోత్సాహం

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఇతర ప్రాంతాలకు  వలస వెళ్లి.. అష్టకష్టాలు పడ్డారు. బతుకుదెరువు కోసం కన్నవాళ్లను విడిచి.. చెట్టుకొక్కరు..పుట్టకొకరు వెళ్లేవాళ్లు. సొంతగడ్డపై పరాయి పాలనతో యువకుల హృదయాలు చిన్నబోయేవి. ‘ మీకు పాలించడం తెలియదు? రాష్ట్రం విడిపోతే కంపెనీలు హైదరాబాద్‌ను విడిచి వెళ్లిపోతాయి?” అంటూ అప్పటి నాయకులు హేళన చేసేవారు. నాలుగు గోడలను చూపించి.. అదే ఐటీ అని బురిడీ కొట్టించేవాళ్లు.  తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవారికి చెంపపెట్టుగా నేడు భాగ్యనగరం ఐటీలో బాద్‌షా నిలిచింది. ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో తెలంగాణ దూసుకుపోతున్నది. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. 

వినూత్న ఆలోచనలకు.. 

వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. స్టార్టప్‌ ద్వారా ఆలోచనలను పంచుకునే అవకాశం కల్పిస్తున్నది. పల్లె నుంచి పట్నం వరకు ఈ వేదికను ఉపయోగించుకొని ఎంట్రప్రెన్యూర్స్‌గా ఎదుగుతున్నారు. గ్రామాలకు పరిమితమైన వ్యాపారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మంత్రి కేటీఆర్‌ తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఆయన  ఆలోచనలకు అనుగుణంగా టీ హబ్‌ ఏర్పాటైంది. ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించడంతో పాటు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో టీ హబ్‌-2ను కూడా నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద ఇంక్యూబేషన్‌ సెంటర్‌గా టీ హబ్‌-2 నిలుస్తుంది. 

పెట్టుబడులు పెట్టేందుకు..

హైదరాబాద్‌ ప్రపంచంలోనే డైనమిక్‌ సిటీగా అవతరించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలే ప్రధాన కారణం. అందుకే భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. 24 గంటల పాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే కావడం విశేషం. ఇటీవల జేఎల్‌ఎల్‌ విడుదల చేసిన 2020 సిటీ మూమెంటం ఇండెక్స్‌లో హైదరాబాద్‌ డైనమిక్‌ సిటీగా కీర్తినార్జించింది. ప్రపంచవ్యాప్తంగా 130 నగరాలు పోటీపడగా, భాగ్యనగరం మొదటిస్థానాన్ని దక్కించుకున్నది. ఇలా ఏ నివేదికలు చూసినా.. అన్నింటా నగర ఖ్యాతి పెరుగుతున్నది. 

లివబుల్‌సిటీగా.. 

ప్రపంచంలోనే అత్యధిక సీసీ టీవీ కెమెరాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. పౌరుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవడంలో సర్కారు ముందుంది.  నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేసింది. షీటీమ్స్‌ పనిచేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా నివసించే వాతావరణం ఒక్క భాగ్యనగరంలోనే కనిపిస్తుంది. అందుకే బెస్ట్‌ లివబుల్‌ సిటీగా పేరొందింది. అంతేకాదు పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించేలా ఐటీ పాలసీలను ప్రభుత్వం తీసుకురావడంతో ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. స్కిల్డ్‌ పవర్‌ ఎక్కువగా ఉండటం తదితర కారణాలతో హైదరాబాద్‌లో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు మెరుగైన రవాణా వ్యవస్థ, సిటీ చుట్టూ 158 కి.మీ పరిధిలో విస్తరించిన ఔటర్‌ రింగురోడ్డు, ఎక్కడి నుంచైనా సిటీ మొత్తం తిరిగేందుకు అవకాశం ఉన్న మెట్రోతో పాటు,  ట్రాన్స్‌పోర్టు సిస్టం మెరుగ్గా పనిచేస్తుండటం కూడా పెట్టుబడులకు ఊతమిస్తున్నది. 

 దిగ్గజ కంపెనీలు

భాగ్యనగరంలో భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతున్నాయి. పోచారంలో ఇన్ఫోసిస్‌, రహేజా ఐటీ పార్కు , ఉప్పల్‌ ప్రాంతంలో 35 ఐటీ పార్కులు రాబోతున్నాయి. ఆదిబట్లలో బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ రూ. 400 కోట్లతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన పీడీఐ.. భారత్‌లో తన కార్యకలాపాల్లో భాగంగా హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 

నలు దిక్కులా ఐటీ విస్తరణ..

భాగ్యనగరానికి అగ్రగామి కంపెనీలు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో నలు దిక్కులా ఐటీ విస్తరిస్తున్నది. ఇప్పటికే గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఐటీ దిగ్గజ కంపెనీలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. అదే జోష్‌లో భాగ్యనగర రూపురేఖలు మారేలా తెలంగాణ ప్రభుత్వం గ్రిడ్‌ తీసుకొచ్చింది. ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ నలు వైపులా ఐటీ పరిశ్రమలను విస్తరించాలని సంకల్పించింది.

ఆత్మవిశ్వాసంతో అడుగులు..

మహిళలు వ్యాపార రంగంలో ఎదిగేలా వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం వీ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు 5 వేలకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. ఒక్కో స్టార్టప్‌ 10 నుంచి 70 వరకు ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. 2 లక్షలకు పైగా ఉపాధి పొందుతున్నారు. వీ హబ్‌ కృషికి ఎన్నో అవార్డులు దక్కాయి. అంతేకాదు ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు వీ హబ్‌తో కలిసి పనిచేస్తున్నాయి.  ఆయా రాష్ర్టాల ప్రజలకు స్టార్టప్‌లపై వీ హబ్‌ అవగాహన కల్పిస్తున్నది. 

మంత్రి కేటీఆర్‌ కృషి ఎనలేనిది.. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రూపురేఖలను మార్చేశారు  మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో ఐటీని విస్తరించడంలో ఆయన కృషి ఎనలేనిది. దేశ, విదేశాల్లో పర్యటిస్తూ.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా శ్రమిస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ.. భాగ్యనగర కీర్తిని నలుదిశలా చాటిచెబుతున్నారు. కరోనా క్లిష్ట సమయంలో సైతం అనేక వెబీనార్‌లు నిర్వహిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు వచ్చేలా  కృషి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తెలంగాణ విజయాలను తెలియజేస్తున్నారు.  

స్కిల్‌.. అప్‌స్కిల్‌.. రీస్కిల్‌..

“స్కిల్‌, అప్‌ స్కిల్‌, రీస్కిల్‌. నైపుణ్యం సాధించడం, సాధించిన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవడం.. తిరిగి నూతన నైపుణ్యాలను సంపాదించడం.. ఇదే నేటి ప్రపంచ మంత్రం” అని మంత్రి కేటీఆర్‌ ఓ సమావేశంలో చెప్పారు. ఉమ్మడి పాలనలో ‘టెక్నాలజీ.. టెక్నాలజీ” అని గగ్గోలు పెట్టడమే కానీ అదేంటో ఎలా పనిచేస్తుందో? ప్రజలకు దానివల్ల ఉపయోగం ఏమిటో చెప్పగల నాయకులు, వివరించే సమర్థులు అప్పుడు లేరు. కానీ ప్రస్తుతం ఐటీ రంగంపై విశేష అనుభవాన్ని సంపాదించుకున్న మంత్రి కేటీఆర్‌ ఐటీ మినిస్టర్‌గా ఉండటం తెలంగాణ పౌరుల అదృష్టమని ఇన్వెస్టర్లు చెబుతున్నారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం ఐటీ పాలసీని ప్రారంభించింది. 10 రంగాలపై దృష్టి పెట్టింది. అందులో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఒకటి.  భూ రికార్డుల నిర్వహణ ఈ టెక్నాలజీతో సాధ్యమవుతుంది. భూమిని ఎవరికి అమ్మారు? ఎవరు కొన్నారు? తదితర విషయాలన్నీ భద్రంగా ఉంటాయి. అలాగే ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌, డేటా అనాలసిస్‌, కోడింగ్‌ తదితర నూతన సాంకేతిక విప్లవాలు వస్తున్నాయి. భవిష్యత్‌ను ముందే అంచనా వేసి అందుకు తగ్గ నైపుణ్యాన్ని అందించేందుకు సర్కారు అనేక వేదికలను ఏర్పాటు చేస్తున్నది. 

వృద్ధిలో వేగం.. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పటయ్యాక భారత జాతీయ సగటే కాదు దేశంలో ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని తెలంగాణ సాధించింది.  కరోనా కష్టకాలంలో ఆర్థిక రంగం కుదేలైనప్పటికీ ఐటీ మాత్రం అదే జోరును కొనసాగిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినా... ఇక్కడ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఆరేండ్లలో ఎగుమతులు రెట్టింపు కాగా, 2.10 లక్షల మందికి అదనంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. 2019-20 ఏడాదికి రాష్ట్ర ఐటీ ఎగుమతులు 19.93 శాతం, జాతీయ స్థాయిలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.60 శాతం నుంచి 11.60 శాతానికి పెరిగాయి. జాతీయ స్థాయిలో 8.09 శాతం ఎగుమతులు కావడం విశేషం.