గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Oct 03, 2020 , 04:48:19

విశ్వనగరం ప్రగతిపథం

విశ్వనగరం ప్రగతిపథం

ఎండకాలం వచ్చిదంటే చాలు ఖైరతాబాద్‌ జలమండలి కేంద్ర కార్యాలయం ముందు, నగర శివారులోని జలమండలి ప్రాంతీయ కార్యాలయాల ఎదుట ప్రతిపక్ష పార్టీలు ఖాళీ బిందెలు, కుండలతో నిరసనకు దిగేవారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో జలమండలి కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు క్యాలెండర్‌ మాదిరిగా.. వంతుల వారీగా ధర్నాలు చేసేది. మహిళలు తండోపతండాలుగా వెళ్లి ధర్నాలు చేయడం, లాఠీ చార్జీలు జరుగడం.. మంచినీటి తిప్పలంటూ పత్రికలు పుంకాలు పుంకాలు రాయడం ఇది ఉమ్మడి పాలనలో పరిస్థితి. కానీ టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ధర్నాలు, నిరసనలు చేసిన దాఖలాలు లేవు. మండుటెండల్లోనూ సరిపడా నీళ్లు అందించి ప్రతిపక్ష పార్టీలకు పనిలేకుండా చేసింది. ఔటర్‌ రింగు రోడ్డు లోపల గ్రామాల

వరకు సేవల పరిధిని పెంచుకుని ఇంటింటికీ నల్లా ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తూ పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనదైన మార్కును సొంతం చేసుకుంది. 

గుక్కెడు నీటి కోసం అలమటించిపోయిన జనం.. బిందె నెత్తిన పెట్టుకుని మహిళలు మైళ్లు నడిచే దైన్యం.. అరకొరగా వచ్చే నల్లా నీరు చాలక ప్రైవేట్‌ వాటర్‌ (క్యాన్లు) బాటిళ్లకు వందలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి.. వాటర్‌ ట్యాంకర్‌ వస్తే కుస్తీపాట్లు.. అపార్ట్‌మెంట్లలో క‘న్నీటి’ కష్టాలు.. వీటన్నింటికీ తెలంగాణ సర్కారు చెక్‌ పెట్టింది. మండు టెండల్లోనూ సమృద్ధిగా నీరు అందించి అందరి నోట శభాష్‌ అనిపించుకుంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు పని లేకుండా చేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్షాభావ పరిస్థితుల్లో నగరలో నీటి సరఫరా కష్ట సాధ్యమైన పరిస్థితుల నుంచి భవిష్యత్తు తరాలకు సమృద్ధిగా నీరు అందించడమే లక్ష్యంగా పునాధులు వేసింది.

సర్కార్‌ చిత్తశుద్ధికి ఇదే కొలమానం ..

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా రిజర్వాయర్లలోని నీటి నిల్వలు సరిగా లేవు. అప్పటి వరకు కృష్ణా రెండు దశల్లో 180, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల ద్వారా 50, సింగూర్‌, మంజీరాతో 120ఎంజీడీల నీటిని నగరానికి తరలించారు. ఐతే వర్షాభావ పరిస్థితుల కారణంగా సింగూర్‌, మంజీరా, నగరంలోని జంట జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోయి సుమారుగా 170ఎంజీడీల నీరు నిలిచిపోయింది. 

కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి తదితర శివారు ప్రాంతాలు ఒకప్పుడు దాహంతో అలమటించాయి. వారం, పది రోజులకోకసారి వచ్చే నీటితో ప్రజలు అల్లాడిపోయారు. ఇదంతా ఆరేండ్ల కిందటి మాట. ఉమ్మడి ఏపీ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో రెండ్రోజులకోమారు మంచినీళ్లొస్తే అద్భుతమే.. అది కూడా గ్యారంటీ కాదు.. గ్రామాల్లో మాట దేవుడెరుగు.. మహానగరంలోనే మంచినీటికి అల్లాడే పరిస్థితి నాడు. హైదరాబాద్‌ను తామే ఉద్దరించామని కనిపించిన చోటల్లా చెప్పుకొనే నాయకులు ముఖ్యమంత్రులుగా వెలగబెట్టిన కాలమది.. కానీ 2014లో స్వరాష్ట్రంలో మన పాలన మొదలైంది. ప్రాంతాలకు అతీతంగా రోజూ విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది.ప్రజలకు సురక్షితంగా, 

సమృద్ధిగా జలాలు అందుతున్నాయి.

ఇంటింటికీ సమృద్ధిగా నీరు

క‘న్నీటి’ కష్టాల నుంచి గ్రేటర్‌ వాసులకు విముక్తి  

రూ. 1900 కోట్ల హడ్కో ప్రాజెక్టుతో శివారు మున్సిపాలిటీలకు పుష్కలంగా నీరు 

రూ.756కోట్లతో ఔటర్‌ లోపల గ్రామాలకు నీటి సరఫరా 

రూ.420 కోట్లతో ఐటీ కారిడార్‌లో నీటి లభ్యత పెంపు 

వందేండ్లకు భరోసానిచ్చే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ 

కృష్ణా, గోదావరి సరఫరా వ్యవస్థలను కలుపుతూ ఇంటర్‌ కనెక్టివిటీ గ్రిడ్‌ 

ఆరేండ్లలో మారిన పరిస్థితులు

గుక్కెడు నీటి కోసం అల్లాడి పోవాల్సిన అవసరం లేదు. నల్లా నీరు ఎప్పుడు వస్తుందో.. అని నిద్రాహారాలు, ఉద్యోగాలు మానుకుని వేచి చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. డబ్బులు పెట్టి క్యాండ్లద్వారా నీరు కోనాల్సిన దుస్థితి పోయింది. వారం పదిరోజులకోమారు వచ్చే ట్యాంకర్ల వద్ద శికపట్టు యుద్ధాలు పడాల్సిన రోజులు పోయాయి. ఇదంతా.. ఉమ్మడి రాష్ట్రంలో నగర వాసులు ఎదుర్కొన్న దుర్భర పరిస్థితి.. ఆ రోజులు గుర్తుకు వస్తేనే కంటినిండా నీళ్లు తిరిగుతాయి.. గొంతులు ఎండి పోతాయి. కాని స్వరాష్ట్రంలో ఆ రోజులు మారాయి. తలాపూనే పారుతున్న గోదావరి,

కృష్ణా జలాలు భగీరథ ప్రయత్నంతో మైళ్ల దూరం పైకి ఎగబాకి నగర ప్రజల గొంతు తడిపాయి. వేల కోట్లు ఖర్చుపెట్టి ఏరియా కో రిజర్వాయర్‌ నిర్మించి లో ఫ్రెషర్‌ సమస్య లేకుండా..

ఇంటింటికీ నల్లా కనెక్షన్‌, రోజు విడిచి రోజు పుష్కలంగా నీటి సరఫరా జరుగుతున్నది.

సీఎం కేసీఆర్‌ చేపట్టిన భగీరథ ప్రయత్నం ప్రతీ ఆడబిడ్డ కష్టాలను తీర్చింది.

కేశవాపూర్‌ ప్రత్యేకతలు

సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్‌ -పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రికార్డు స్థాయిలో నిర్మించారు. ఇందులో భాగంగానే మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట వద్ద నిర్మిస్తున్న కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు 10టీఎంసీల నీటిని పంపింగ్‌ చేస్తారు. ఈ రిజర్వాయర్‌ నుంచి జంట నగరాలకు కూడా తాగునీరు అందించనున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం నుంచి కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు పైసా ఖర్చు లేకుండా భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ఆధారంగానే సరఫరా చేసేందుకు వీలుగా 3,600 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్‌ స్టీల్‌ పైపులైన్‌లను రెండు వరుసల్లో జలమండలి అధికారులు ఏర్పాటు చేయనున్నారు. అక్కడికి సమీపంలోని బొమ్మరాస్‌పేట నీటి శుద్ధి కేంద్రంలో 172మిలియన్‌ గ్యాలన్ల (10టీఎంసీల) రావాటర్‌ను శుద్ధి చేసి  లింగంపల్లి, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ అనుసంధానం చేసి నగరం నలుమూలల స్వచ్ఛమైన జలాలను అందించనున్నారు. ఆయా రిజర్వాయర్ల నీటి నిల్వల విషయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా హైదరాబాద్‌ తాగునీటి సరఫరాకు ఢోకా ఉండదు. 

గ్రేటర్‌కు జలమాల 

ఔటర్‌ చుట్టూ కృష్ణా, గోదావరి పైపులైన్‌ వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ఇంటర్‌ కనెక్టివిటీ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రింగు మెయిన్‌ ప్రాజెక్టు ద్వారా ఎటువైపు నుంచైనా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. 158 కిలోమీటర్ల మొత్తంలో భారీ పైపులైన్‌, 12చోట్ల రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ.4765.00కోట్ల అంచనాతో టాటా కన్సల్టెన్సీ డిటెల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను రూపొందించారు. ప్రస్తుతం ఈ డీపీఆర్‌ ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, త్వరలోనే కార్యరూపంలోకి రానున్నది. వీటితో పాటు కృష్ణా నాలుగవ దశ (సుంకిశాల) పథకాన్ని తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా భాగ్యనగర ప్రజలకు సురక్షిత, సమృద్ధి నీటి సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నది.

జలమండలి అధికారుల మనోగతం

ఏ ఒక్క ఆడబిడ్డ బిందెలు పట్టుకుని నీటి కోసం ఆరాటపడకూడదని, అలాంటి పరిస్థితికి చరమగీతం పాడాలన్న సీఎం కేసీఆర్‌ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి సత్ఫలితాలను రాబట్టడం సంతృప్తిని కలిగించింది. గత ప్రభుత్వాలకంటే నీటి సరఫరాను గణనీయంగా పెంచి మెరుగైన అభివృద్ధిని సాధించాం. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వర్షాభావ పరిస్థితులు నెలకొని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, సింగూరు, మంజీరా నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ నత్తనడకన సాగుతున్న గోదావరి జలాల తరలింపు పథకం పనులపై దృష్టి సారించి రైల్వే, ఫారెస్ట్‌ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో తనదైన శైలిలో చొరవ తీసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేసి జలాలను సరైన సమయంలో తీసుకువచ్చి నగర ప్రజల దాహార్తిని తీర్చారు. కృష్ణా జలాల మూడు దశలోనూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి అదనంగా 90ఎంజీడీలను తీసుకువచ్చి దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల నీటి నిల్వలను స్టోరేజీగా మలచి భూ గర్భ జలాలను అభివృద్ధి చేశారు. నీటి లభ్యతను మెరుగుపర్చడమే కాదు శివారు మున్సిపాలిటీలు, ఔటర్‌ లోపల గ్రామాల ప్రజల తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపారు. భవిష్యత్తులో నగరంలో నెలకొన్న మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శామీర్‌పేట సమీపంలోని కేశవాపూర్‌ వద్ద భారీ స్టోరేజ్‌ రిజర్వాయర్‌కు శ్రీకారం చుట్టారు. ఔటర్‌ వరకు సివరేజీ మాస్టర్‌ప్లాన్‌, ఔటర్‌ రింగు రోడ్డు చుట్టూ భారీ పైపులైన్‌ నిర్మాణం ద్వారా కృష్ణా, గోదావరి పైపులైన్‌ వ్యవస్థలను అనుసంధానం చేస్తూ ఇంటర్‌ కనెక్టివిటీ గ్రిడ్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధం చేశారు.

మరో వందేండ్ల భరోసానిచ్చే

భవిష్యత్తు ప్రణాళికలు 

నిజాం కాలంలో భవిష్యత్తు తరాల దృష్ట్యా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ తరహాలోనే సీఎం కేసీఆర్‌ రాబోయే వందేండ్లకు సరిపడాసమృద్ధి నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవంగా హైదరాబాద్‌ తాగునీటి కోసం వందల కిలోమీటర్ల నుంచి తరలిస్తున్న నదీజలాలను నిల్వ చేసేందుకు భారీ రిజర్వాయర్‌లేని దుస్థితి. ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఒక్కరోజు నీటి వనరు నుంచి తరలింపు నిలిచిపోతే గ్రేటర్‌ హైదరాబాద్‌వాసులు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా సింగూరు, మంజీరా, హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్ల నీటి నిల్వలు ప్రతి ఏటా ఆందోళన కలిగిస్తూ నీటి సరఫరాపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్‌కు డెడికేటెడ్‌ రిజర్వాయర్లు ఉండాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. ఈ మేరకు అధికారులు ఇటు కృష్ణా.. అటు గోదావరి నదీజలాలను నిల్వ చేసేందుకుగాను భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికల్లో తొలుత కేశవాపూర్‌ను సిద్ధం చేశారు. దాదాపు రూ.4777 కోట్లతో చేపట్టనున్న ఈ భారీ రిజర్వాయర్‌ భూసేకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చిన ప్రభుత్వం పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నది.

ఇదీ జలమండలి

ప్రస్తుత సేవల పరిధి 

కోర్‌ సిటీ 169.3 స్కేర్‌ కిలోమీటర్లు 

శివారు మున్సిపాలిటీల వరకు 518.90 స్కేర్‌ కిలోమీటర్లు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు సేవల పరిధి 939.80స్కేర్‌ కిలోమీటర్లు మొత్తం సేవల పరిధి 1628 స్కేర్‌ కిలోమీటర్లు మేర నీటి సరఫరా అందిస్తున్నది.

రోజువారీ సరఫరా చేస్తున్న నీరు 448 ఎంజీడీలు (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) 

జంట జలాశయాల నుంచి 7 ఎంజీడీలు, అక్కంపల్లి కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, ఎల్లంపల్లి గోదావరి ద్వారా 172 ఎంజీడీలు కలిపి రోజూ 449 మిలియన్‌ గ్యాలన్లను తరలిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఏరియాలో 400 ఎంజీడీలు, జీహెచ్‌ఎంసీ అవతల 48 ఎంజీడీల సరఫరా జరుగుతుంది

కోర్‌ సిటీలో 98 శాతం (150ఎల్‌పీసీడీ), శివార్లలో 80 శాతం (130ఎల్‌పీసీడీ) నీటి సరఫరా  

జలమండలి పరిధిలో మొత్తం నల్లా కనెక్షన్లు సుమారు 12 లక్షలు  

నెలవారీ నిర్వహణ ఖర్చులు -138 కోట్లు

నెలవారీ సంస్థ రాబడి  - 120కోట్లు

ఫలించిన భగీరథ ప్రయత్నం

నగర వాసులు నీటికోసం అల్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చేపట్టిన భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. భగీరథ ప్రయత్నంలో భాగంగా కృష్ణా మూడో దశ ద్వారా 90 ఎంజీడీలు, గోదావరి తొలి విడత పథకం ద్వారా 100 ఎంజీడీల మేర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నిర్ణీత సమయంలో ఈ రెండు పథకాల ద్వారా దాహార్తిని తీర్చింది. ముఖ్యంగా గోదావరి పథకం పనుల్లో భాగంగా రక్షణ, ఆటవీ, రైల్వే శాఖల అనుమతుల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తీసుకున్న చొరవ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టింది. రైల్వే శాఖ అనుమతుల విషయంలో సీఎం తనదైన శైలిలో ఘాటుగా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 

గోదావరి తొలి విడత పథకాన్ని పూర్తి చేసి రోజూ 172ఎంజీడీల మేర నీటిని డిసెంబరు 2015నుంచి నగరానికి తరలిస్తూ వస్తున్నారు. 

కృష్ణా మూడో దశ జలాలను జవనరి 2015 నుంచి అదనంగా 90ఎంజీడీల నీటిని నగరానికి తరలించి నీటి ఎద్దడి లేకుండా చేశారు. 

శివారు మున్సిపాలిటీల్లో రూ.1900 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులను కేవలం ఏడాదిన్నరలోనే పూర్తి చేసి సమృద్ధిగా నీటి సరఫరాకు శ్రీకారం చుట్టింది. దాదాపు 300 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో 56 సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణ పనులు, 2200 కిలోమీటర్ల పైపులైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ పైపులైన్‌ విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి సుమారు 40లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చింది. 

ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాల్లోని ప్రజల క‘న్నీటి’ కష్టాలను తీర్చే లక్ష్యంతో రూ.756కోట్లతో అర్బన్‌ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి పథకాన్ని చేపట్టారు. బోరు నీటిపైన అధారపడిన గ్రామాల ప్రజలకు సురక్షిత జలాలు అందించారు.

ప్రస్తుతం రెండు లక్షల మంది వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తున్న జలమండలి రాబోయే రోజుల్లో ఓఆర్‌ఆర్‌ పరిధిలో మరో లక్ష మందికి నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. అంతేకాకుండా మనిషికి 150 ఎల్‌పీసీడీ మేర నీటిని అందించే ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు. 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌కు నీటి లభ్యతను పెంచుతూ మెదక్‌ జిల్లా ఘన్‌పూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పటాన్‌చెరువు వరకు రూ.398కోట్లతో 58 కిలోమీటర్ల మేర 1800 ఎంఎం సామర్థ్యం కలిగిన పైపులైన్‌ వేసి నీటి కష్టాలు లేకుండా చేశారు. 

పాతబస్తీలో సురక్షిత మంచినీటి సరఫరాకు రూ.100కోట్ల మేర ఖర్చు పెట్టారు. 

మల్కాజిగిరి నియోజకవర్గంలో వరల్డ్‌ బ్యాంకు నిధులతో రూ.335 కోట్లు ఖర్చు పెట్టి 16 రిజర్వాయర్లను నిర్మించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. 

ప్రధానంగా దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు లక్ష వరకు రూపాయికే నల్లా కనెక్షన్లు మంజూరు చేశారు.

సమృద్ధిగా నీటి సరఫరాకు 

కట్టుబడి ఉన్నాం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం ప్రజలకు సమృద్ధిగా నీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపడుతున్నాం. రికార్డు సమయంలో తాగునీటి విస్తరణ పనులను పూర్తి చేసి 12 మున్సిపాలిటీలలో నీటి సరఫరా ప్రక్రియను మెరుగుపరిచాం. అర్బన్‌ మిషన్‌ భగీరథలో 190 గ్రామాల్లో నీటి సరఫరా అందిస్తున్నాం. భవిష్యత్తులో నగర ప్రజల డిమాండ్‌ అనుగుణంగా భారీ స్టోరేజి రిజర్వాయర్లు, మెరుగైన నీటి సరఫరా వ్యవస్థకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. వర్షాలు సమృద్ధిగా పడటంతో అన్ని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. రాబోయే మూడేండ్ల వరకు తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు.

-దానకిశోర్‌,  ఎండీ, జలమండలి