మంగళవారం 01 డిసెంబర్ 2020
Rangareddy - Oct 01, 2020 , 04:29:01

అభివృద్ధే ఎజెండా

అభివృద్ధే ఎజెండా

  • - ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
  • - ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గస్థాయి 
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

ఇబ్రహీంపట్నం : టీఆర్‌ఎస్‌ శ్రేణులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలోని శాస్ర్తాగార్డెన్‌లో నియోజకవర్గస్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించడంతోపాటు వారందరిని ఓటర్లుగా చేర్పించడం కోసం మండలాలు, మున్సిపాలిటీలవారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలు వార్డులవారీగా, గ్రామాలవారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి వారిని ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు వారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేలా పనిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు క్యామ మల్లేశ్‌ మాట్లాడుతూ.. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ గెలుపే ఖాయమనే రీతిలో ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని అన్నారు.  

పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగావకాశాలు

నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి,  పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికే ఆదిబట్లలో ప్రత్యేక సెజ్‌లు ఏర్పాటు చేసి పలు ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఐటీ సంస్థల్లో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది నిరుద్యోగులైన పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు లభించాయని చెప్పారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే సుమారు 25 నుంచి 30 ఇంజినీరింగ్‌ కళాశాలలు, మరో 20 వరకు బీఫార్మసీతోపాటు ఎంబీఏ, బీటెక్‌ లాంటి కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. ఈ కళాశాలల్లో అనేకమంది నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేశామన్నారు. యాచారం మండలంలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీ వల్ల కూడా వేలాది ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలున్నాయన్నారు. మంచాల మండలంలోని తాళ్లపల్లిగూడ, ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, యాచారం మండలంలోని మొండిగౌరెల్లి తదితర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు నోముల కృష్ణగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు కప్పరి స్రవంతి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రమేశ్‌, నిరంజన్‌రెడ్డి, చీరాల రమేశ్‌, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సహకార సంఘం చైర్మన్లు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.