బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 30, 2020 , 00:31:09

త్వరలో ధాన్యం కొనుగోళ్లు

త్వరలో ధాన్యం కొనుగోళ్లు

వచ్చేనెల రెండోవారం నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.  గత సీజన్‌లో కరోనా ఉన్నప్పటికీ పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించిన విషయం విదితమే. గతంతో పోలిస్తే ఈ సీజన్లో వరిసాగు భారీగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 71,492 వేల ఎకరాల్లో, వికారాబాద్‌ జిల్లాలో 74,960 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీంతో అదే స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో 26, వికారాబాద్‌ జిల్లాలో 120 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఐదు వేల క్వింటాళ్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రణాళికా బద్ధంగా రైతుల దగ్గర ధాన్యం సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొనుగోళ్లు పూర్తయిన తరువాత వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. ఇందుకోసం ఖాతాల వివరాలు ఇంకా ఇవ్వని రైతుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాలవారీగా రైతులకు టోకెన్లు ఇవ్వడంతో పాటు, శానిటైజర్లు, సబ్బులు నీళ్లు అందుబాటులో ఉంచనున్నారు. 

రంగారెడ్డి /వికారాబాద్‌ నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు పత్తితోపాటు వరి పంటను అధిక మొత్తంలో సాగు చేసిన దృష్ట్యా పెద్దమొత్తంలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అం దుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా యాసంగి సీజన్‌లో 200లకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు, వరి పండించే ప్రతీ గ్రామం లో ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే చాలా కొనుగోలు కేంద్రాల్లో కనీసం 500 క్వింటాళ్ల ధాన్యం కూడా రాకపోవడంతో ఈ దఫా ఈ కేంద్రాల సంఖ్యను తగ్గించారు. అయినప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి వారికి కేటాయించిన తేదీల వారీగా ధాన్యాన్ని సేకరించడంతోపాటు ప్రతీ కొనుగోలు కేంద్రంలో శానిటైజర్లతోపాటు సబ్బులు, నీటిని అందుబాటులో ఉంచనున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో 80 శాతం సన్నాలే..

రంగారెడ్డి జిల్లావ్యాప్తంతా ఈ సీజన్‌లో 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు రానుందని అంచనా వేశారు. ఈ ధాన్యం కొనుగోళ్ల కోసం 26 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో  పీఏసీఎస్‌ 20,డీసీఎంఎస్‌ 2, రైతు సమాఖ్య 1,మార్కెటింగ్‌ 2,ఐకేపీ ఆధ్వర్యంలో 1 ఏర్పాటు చేయనున్నారు. 4.20లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాకాలం నుంచి నియంత్రిత సాగు విధానాన్ని ప్రారంభించింది.అందులో భాగంగా దొడ్డు రకం ధాన్యం కంటే సన్నరకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేయడం రైతులు ఆ మేరకు సాగు చేశారు. 80 శాతం సన్నాలే ఉంటాయి. ఈ సారి జిల్లాలో 71,492 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు.ఈ మొత్తం విస్తీర్ణం నుంచి 14లక్షల 29వేల 840 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుండగా..ఎంఎస్‌పీ ధర కంటే బహిరంగ మార్కెట్‌ ధర పలికితే ఇక్కడికి  కేవలం ధాన్యం 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని సివిల్‌ శాఖ అంచనా వేసింది.

వచ్చేనెల రెండో వారం నుంచి కొనుగోళ్లు..

ఈసారి ధాన్యం క్వింటాల్‌కు ఏగ్రేడ్‌కు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కొనుగోళ్లకు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సూచనల మేరకు అదనపు కలెక్టర్‌ హరీశ్‌ ఒకటి రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అక్టోబర్‌ రెండో వారం నుంచి వానకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది.రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 రైస్‌ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం ధాన్యం సరఫరా చేయాలని నిర్ణయించారు.ధాన్యం రవాణా కు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేశారు.  

వికారాబాద్‌లో 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా...

ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లా రైతాంగం వరి పంటను సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 74,960 ఎకరాల్లో 40 వేల మంది రైతులు వరి సాగు చేశారు. అయితే 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. గత సీజన్‌లో 35 వేల ఎకరాల్లో వరి పంట సాగవ్వగా, ఈ ఏడాది రెండింతలు పెరగడం గమనార్హం, అక్టోబర్‌ నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లావ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే ప్రతీ 5000 క్వింటాళ్లకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో సాగవుతున్న వరి పంటను బట్టి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు, 3-4 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటుకానుంది. రైతులు పండించిన ధాన్యాన్ని సంబంధిత అధికారులు కేటాయించిన గ్రామంలోని పాఠశాల లేదా పంచాయతీ కార్యాలయం వద్దకు ధాన్యాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా 35 లక్షల మేర గన్నీ సంచులు అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లాలో 10 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉండగా, మిగతావి కొనుగోలు కేంద్రాలు తెరిచేలోగా అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే జిల్లాలో వరి పంటను కొడంగల్‌, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూర్‌, పెద్దేముల్‌, కుల్కచర్ల, దోమ, పరిగి, ధారూర్‌ మండలాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ధాన్యాన్ని విక్రయించిన రైతులకు వారంలోగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ఇంకా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌ వివరాలను అందజేయని రైతుల నుంచి సంబంధిత అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. 

కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం

-శ్యామరాణి, రంగారెడ్డి జిల్లా డీఎం పౌరసరఫరాల శాఖ 

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో సమావేశం జరగనుంది. అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. గోనే సంచులు సమకూర్చుతున్నాం. రంగారెడ్డి జిల్లాలో 26 కేంద్రాల ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ కేంద్రాలు ఇంకా పేరగొచ్చు..లేదా తగ్గొచ్చు. 

రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు

వికారాబాద్‌ జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ విమల

అక్టోబర్‌ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచుతాం. కొనుగోలు కేంద్రాలకు నవంబర్‌ మొదటి వారంలో ధాన్యం వచ్చే అవకాశముంది.. కాబట్టి రైతులకు ఇబ్బందులు కలుగకుండా సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని సేకరించనున్నాం.