శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rangareddy - Sep 18, 2020 , 02:27:44

గొర్రెలతోనే కాపరుల ఆర్థికాభివృద్ధి

గొర్రెలతోనే కాపరుల ఆర్థికాభివృద్ధి

పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి

మొయినాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల కాపరులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేనివిధంగా గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టి గొర్రెలు పంపిణీ చేసిందని, ప్రస్తుతం కాపరులు ఆదాయం పొంది ఆర్థికంగా ఎదుగుతున్నారని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ వంగల లక్ష్మారెడ్డి అన్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్‌ శ్రీలత ఆధ్వర్యంలో గురువారం మండలంలోని కనకమామిడి గ్రామంలో పారుడు రోగం టీకాలు పంపిణీ చేస్తుండగా ఆయన ఆకస్మికంగా వైద్య శిబిరాన్ని సందర్శించారు. పారుడు రోగం నివారణ టీకాల పంపిణీ ఎలా జరుగుతుందని గొర్రెల కాపరులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక పశువైద్యాధికారులు ప్రతి గొర్రెల కాపరికి సమాచారం అందించి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గొర్రె పిల్లలకు  టీకాలు ఇస్తున్నారని వారు తెలిపారు. దీంతో స్థానిక పశువైద్యాధికారులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మాంసం ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేస్తున్నదని తెలిపారు. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీ ఉండబోవచ్చన్నారు. పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయిస్తుందని, త్వరలో  ప్రతి మండలంలో పశువైద్య కేంద్రాలకు మందులు రావొచ్చని అన్నారు. పశువుల దాహం తీర్చడానికి ప్రతి గ్రామానికి పశువుల నీటి తొట్టీలను నిర్మించడానికి నిధులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఆసక్తి గల వారు ముందుకొస్తే షెడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. కనకమామిడి గ్రామంలో ఉన్న పశువైద్యశాలను సందర్శించారు. గ్రామంలోని పరిసరాలను చూసి పరిశుభ్రతలో చాలా బాగుందని సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డిని అభినందించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్‌ పి.జనార్దన్‌రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పి జనార్దన్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి శ్రీలత, డాక్టర్లు  వెంకట్‌యాదవ్‌, నివేదిత పాల్గొన్నారు.