మంగళవారం 20 అక్టోబర్ 2020
Rangareddy - Sep 18, 2020 , 02:27:45

వాన.. వరద

వాన.. వరద

పొంగిపొర్లిన వాగులు, కాలువలు 

ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరిన నీరు

అలుగుపారిన చెరువులు, కుంటలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని ప్రధానమైన మూసీ, కాగ్నా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. మరోవైపు కోట్‌పల్లి, జుంటుపల్లి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి భారీగా అలుగుపారుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి అనంతగిరి ఆలయం లోపల నుంచి వరద నీరు ప్రవహించింది. కోట్‌పల్లి, బంట్వారం, మర్పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు నిండగా, చెరువులు అలుగుపారుతున్నాయి. అదేవిధంగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని శివసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మరోవైపు ధారూర్‌ మండలంలోని స్టేషన్‌ ధారూర్‌కు వెళ్లే మార్గంతోపాటు పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి, నాగసముందర్‌ వెళ్లే మార్గంలో తాత్కాలిక వంతెనలు రెండోసారి వరద ధాటికి కొట్టుకుపోవడంతో వికారాబాద్‌-తాండూర్‌తో పాటు పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అనంతగిరి అటవీ ప్రాంతంలో కొండల మధ్య నుంచి వచ్చే జలపాతం పర్యాటకులను ఆకర్షించింది. అదేవిధంగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథనాయికగా అనంతగిరి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సినిమా షూటింగ్‌ భారీ వర్షం కారణంగా నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయింది. 

అత్యధికంగా 70.4 మి.మీ వర్షపాతం...

జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వికారాబాద్‌ మండలంలో అత్యధికంగా 70.4 మి.మీటర్లు, పూడూరు మండలంలో 65.4 మి.మీటర్లు, బంట్వారం మండలంలో 63 మి.మీటర్లు, ధారూరు మండలంల 42.4 మి.మీటర్లు, బషీరాబాద్‌ మండలంలో 37.6 మి.మీటర్లు, తాండూరు మండలంలో 28.4 మి.మీటర్లు, నవాబుపేట మండలంలో 27.2 మి.మీటర్లు, కుల్కచర్ల మండలంలో 24.6 మి.మీటర్లు, పరిగి మండలంలో 23 మి.మీటర్లు, పెద్దేముల్‌ మండలంలో 16 మి.మీటర్లు, మర్పల్లి మండలంలో 15.2 మి.మీటర్ల, మోమిన్‌పేట్‌ మండలంలో 14.6 మి.మీటర్లు, దోమ మండలంలో 13 మి.మీటర్లు, దౌల్తాబాద్‌ మండలంలో 10 మి.మీటర్లు, యాలాల మండలంలో 6.6 మి.మీటర్లు, బొంరాస్‌పేట్‌ మండలంలో 6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

మూసీనదికి పోటెత్తిన వరద..

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌, శంకర్‌పల్లి పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. షాబాద్‌ మండలంలోని చందనవెళ్లి పెద్ద చెరువు అలుగుపారింది. వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లో  కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని పలు మండలాల గుండా వెళ్లే మూసీనదికి వరద పోటెత్తెంది. శంకర్‌పల్లి మున్సిపల్‌లోని పత్తెపురం వద్ద పాత చేవెళ్ల రోడ్డు ఖాజ్‌వే పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. logo