గురువారం 22 అక్టోబర్ 2020
Rangareddy - Sep 18, 2020 , 02:27:45

తగ్గిన భారం.. పేదలకు వరం

తగ్గిన భారం..  పేదలకు వరం

ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల్లో మార్పుతో  అన్నివర్గాలకు ఊరట

రిజిస్ట్రేషన్‌ సమయంలో మార్కెట్‌  విలువ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌  చార్జీలు వసూలు

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు  మున్సిపాలిటీల్లో 214 అనధికారిక  లే అవుట్లు...  పంచాయతీల్లో 221 

రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 3,416 లే అవుట్లు

అనుమతులు ఉన్నవి 1,609

నిబంధనలకు విరుద్ధంగా 1,807

పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారికి క్రమబద్ధీకరణ చార్జీల భారాన్ని తగ్గించేలా నిర్ణయం తీసుకున్నది. ఇటీవల అనధికారిక లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి లబ్ధి చేకూర్చేలా ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన విషయం విధితమే. అయితే ఆగస్టు 26న ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారం క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చేయనున్నట్టు ఆ జీవోలో నిర్ణయించగా.. దీనివల్ల పేదలపై భారం ఎక్కువవుతుందని ప్రభుత్వం భావించింది. వెంటనే ఆ జీవోను సవరిస్తూ భూమి కొనుగోలు చేసినప్పుడు ఉన్న మార్కెట్‌ విలువనే పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను గుర్తించిన అధికారులు అన్ని ప్రాంతాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 1,807, వికారాబాద్‌లో 435 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,965 దరఖాస్తులు రాగా.. తగ్గిన చార్జీలతో నేటినుంచి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  - వికారాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ

వికారాబాద్‌/రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: అనధికారిక లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకుగాను దరఖాస్తు చేయనున్న భూయజమానులకు భారీ ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత ఆగస్టు 26న ఉన్న మార్కెట్‌ ధర ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించిన ప్రభుత్వం...తదనంతరం ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న మార్కెట్‌ విలువ మేరకు క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చేస్తామని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలను సవరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధిక చార్జీలకు భయపడే చాలా మంది భూయజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌కు అంతగా ఆసక్తి చూపనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లు కలిగిన వారంతా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో ధర ప్రకారం చార్జీలు వసూలు చేసినట్లయితే ప్రజలకు భారం భారీగా తగ్గనుంది. 2013కు ముందు మార్కెట్‌ ధర తక్కువగా ఉన్న దృష్ట్యా ఆ సమయంలో భూముల రిజిస్ట్రేషన్‌ అయిన వారికి భారీ ఉపశమనం కలుగనుంది. అదేవిధంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనుమతిలేని లేఅవుట్లకు సంబంధించి కటాఫ్‌ తేదీని 2020 ఆగస్టు 26గా నిర్ణయించారు. ఈ తేదీ వరకు రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ అయిన స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. 

రిజిస్ట్రేషన్‌ చార్జీలను నిర్ణయించిన ప్రభుత్వం...

భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలోని మార్కెట్‌ ధరను బట్టి రెగ్యులరైజేషన్‌ చార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రిజిస్ట్రేషన్‌ చార్జీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చదరపు గజం విలువ రూ.3 వేలు, అంతకంటే తక్కువ గల భూమికి సంబంధించి బేసిక్‌ రెగ్యులరైజేషన్‌ చార్జీలలో 20 శాతం, చదరపు గజం విలువ రూ.3001 నుంచి రూ.5000 వరకు ఉన్న భూమికి 30 శాతం, చదరపు గజం విలువ రూ.5001ల నుంచి రూ.10,000 వరకు.. 40 శాతం, చదరపు గజం విలువ రూ.10,001 నుంచి రూ.20,000 వరకు.. 50 శాతం, రూ.20,001 నుంచి రూ.30,000 వరకు.. 60 శాతం, రూ.30,001 నుంచి రూ.50,000 వరకు.. 80 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా చదరపు గజం విలువ రూ.50 వేలకుపైగా ఉన్నట్లయితే 100 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్లాట్ల యజమానులు, సొసైటీ సభ్యులు, కాలనీ డెవలపర్స్‌ క్రమబద్ధ్దీకరణకు సాక్ష్యంగా సేల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒప్పందం చేసుకున్న స్థలాలను క్రమబద్ధీకరించే వీలులేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో   3,416 లేఅవుట్లు..

  రంగారెడ్డిజిల్లాలోని 21 మండలాల్లోని 560 గ్రామ పంచాయతీలకు గాను 374 గ్రామ పంచాయతీల్లో మాత్రమే లేఅవుట్లు ఉన్నాయి. 374 గ్రామ పంచాయతీల్లో 42వేల ఎకరాల విస్తీర్ణంలో 4,86,832 ప్లాట్స్‌ ఉన్నాయి. ఇందులో 16,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 1609 లేఅవుట్స్‌లోని 1,75,669 ప్లాట్లకు మాత్రమే హెచ్‌ఏండీఏ అనుమతులు ఉన్నాయి. మిగతా 25,821,38 ఎకరాల్లో నిర్మాణం చేపట్టిన 1807 లేఅవుట్స్‌లోని 3,11,163 ప్లాట్లకు అనుమతులు లేవు. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని యజమానులు వినియోగించుకుని క్రమబద్ధీకరణ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రభుత్వం కల్పిస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోవాలని పంచాయతీ అధికారులు అవగాహన పెంచేందుకు యత్నిస్తున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో  ఇప్పటివరకు 3965 దరఖాస్తులు...

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించడంతో అనధికారిక లే అవుట్ల నిర్వాహకులతోపాటు సంబంధిత లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి భారీ స్పందన వస్తున్నది. వచ్చేనెల 15వ తేది వరకు మాత్రమే గడువు ఉండడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నేటి నుంచి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగనుంది. అయితే జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీలతోపాటు 18 మండలాల్లోని అనధికారిక లేఅవుట్లు, ప్లాట్లు కలిగిన 59 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కుగాను ఇప్పటివరకు 3965 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 3565 దరఖాస్తులు, గ్రామ పంచాయతీల్లో 400 దరఖాస్తులు అందినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని 59 గ్రామ పంచాయతీల్లో 221 అనధికారిక లేఅవుట్లకుగాను ఇప్పటివరకు 400 దరఖాస్తులు అందగా వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ మున్సిపాలిటీల పరిధిలో 214 అనుమతిలేని లేఅవుట్లు ఉండగా 3565 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే మున్సిపాలిటీల్లోని 214 అనధికారిక లే అవుట్లలో 12,675 అనధికారిక ప్లాట్లున్నట్లు గుర్తించారు. అయితే జిల్లాలో అత్యధికంగా పరిగి మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. పరిగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైనప్పటికీ గతంలో పంచాయతీగా ఉన్న సమయంలోనే చాలావరకు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వెలిశాయి. పరిగి మున్సిపాలిటీలో 117 అనుమతిలేని లేఅవుట్లు ఉంటే వీటిలో 8214 అనధికారిక ప్లాట్లుండగా 1510 దరఖాస్తులు, వికారాబాద్‌ మున్సిపాలిటీలో 81 అనుమతిలేని లే అవుట్లలో 3081 అనధికారిక ప్లాట్లుండగా.. 1417 దరఖాస్తులు, తాండూర్‌ మున్సిపాలిటీలో 11 అనుమతిలేని లేఅవుట్లలో 900 అనధికారిక ప్లాట్లుండగా.. 600 దరఖాస్తులు, కొడంగల్‌ మున్సిపాలిటీలోని 5 అనుమతిలేని లే అవుట్లలో 480 అనధికారిక ప్లాట్లుండగా.. 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని తాండూర్‌, యాలాల మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో అధికంగా అనధికారిక లే అవుట్లున్నట్లు పంచాయతీ అధికారులు గుర్తించారు. logo