బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Sep 13, 2020 , 00:25:05

హామీలన్నీ నెరవేరుస్తున్నాం

హామీలన్నీ నెరవేరుస్తున్నాం

  • గ్రామాల అభివృద్ధే  ప్రభుత్వ లక్ష్యం
  • కరోనా ఉన్నా అభివృద్ధి ఆగడంలేదు
  • సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
  • ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి సబితా రెడ్డి

పట్టణాలతో పాటు ప్రతీ పల్లె  అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం కొందుర్గు తదితర మండలాల్లో నిర్వహించిన  పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తున్నదన్నారు. మన రాష్ట్రంలో రైతులతో పాటు మిగతా అన్ని వర్గాల వారికోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- కొందుర్గు


కొందుర్గు: పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృధ్ద్యే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయారు. కొందుర్గు మండలంలోని గంగన్నగూడ నుంచి గుంజల్‌పహాడ్‌ వరకు 9కిలో మీటర్లకు గాను 5.54 కోట్లు, ఉమ్మెంత్యాల నుంచి షాబాద్‌ వరకు 7కిలోమీటర్లకు గాను 4.54కోట్లతో ఏర్పాటు చేస్తున్న నూతన బీటీరోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కొందుర్గు మండలంలోని ఆయా గ్రామాల్లో గల కల్యాణలక్ష్మి 70మంది లబ్ధిదారులకు, జిల్లెడు చౌదరిగూడ మండలలంలోని 84మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని అన్నారు. 

సాగునీరు అదించేందుకు కృషి

కందుకూరు:  మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  శనివారం కందుకూరు మండల పరిధిలోని కల్వకుర్తి రోడ్డు నుంచి సరస్వతీగూడ, లేమూరు గ్రామాల మీదుగా గూడూరు గేటు వరకు రూ. 6.94కోట్లతో,  పులిమామిడి నుంచి మహేశ్వరం వరకు రూ. 5.13 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఆమె ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం  సరస్వతీగూడ, అగర్‌మియగూడ, లేమూరులో నిర్మించిన వైకుంఠధామం, సీసీ రోడ్లను ప్రారంభించారు. 


రైతులకు అండగా..

రాష్ట్రంలోని రైతాంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఇదివరకే రైతులకు రైతుబంధు ద్వారా ఎకరాకు 5వేలు, రైతుబీమా కల్పిస్తున్నట్లు వివరించారు.  రైతు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.5లక్షలను అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు పదివేల రూపాయలను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. రైతుల కోసం గ్రామాల్లో రైతు వేదికలు ఏర్పాటు చేసి వారికి మరింత సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కరోనా ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపలేదని తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఏర్పడితే రైతులు పండించిన పంటలు అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వమే రైతుల నుంచి దాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.  మిషన్‌ కాకతీయ పథకం వల్ల గ్రామాల్లోని చెరువులు పునర్జీవం పోసుకున్నాయని అన్నారు.  మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నట్లు వివరించారు.  రైతుబంధు పథకం వల్ల రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. 

షాద్‌నగర్‌ నియోజకవర్గానికి పెద్దపీట..

రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేసి అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం షాద్‌నగర్‌ అని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించుకుంటారని అన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతునందుకు ఆమె ఎమ్మెల్యేను అభినందించారు. 

ప్రభుత్వ పథకాలను  సద్వినియోగం   చేసుకోవాలి : ఎంపీ శ్రీనివాస్‌రెడ్డ్డి

ప్రభుతం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల పక్షాన ఉందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకున్న రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ఎక్కడ ఆపడం లేదని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ర్టానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి : ఎమ్మెల్యే

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, ఆర్‌డీఓ రాజేశ్వరి, ఎంపీపీలు జంగయ్య, యాదమ్మ, జడ్పీటీసీలు రాగమ్మ, స్వరూప, ఎంపీడీఓ ఆంజనేయులు, తాసిల్దార్లు రాములు, శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రాజేశ్‌పటేల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, హాఫీజ్‌ పాల్గొన్నారు.