శనివారం 05 డిసెంబర్ 2020
Rangareddy - Sep 12, 2020 , 00:11:11

మానవత్వానికి మారుపేరు ‘ఫిలిప్‌ రామ్‌బన్‌'

మానవత్వానికి మారుపేరు ‘ఫిలిప్‌ రామ్‌బన్‌'

  • అనాథలను అక్కున చేర్చుకోవడం ఆయన అభిమతం
  • అభాగ్యులను ఆదుకోవడం ఆనందం
  • యాచారం బాలాగ్రాం నిర్వాహణతో అనాథలకు ఆశ్రమం
  • ఉచిత కంటి వైద్యశాలతో ఎంతో మంది నిరుపేదలకు సేవ
  • ప్రత్యాస భవనంతో వృద్ధులకు ఆశ్రయం
  • బాలాగ్రాం వ్యవస్థాపకుడు ఫిలిప్‌ రామ్‌బన్‌ మృతి తీరనిలోటు

యాచారం: సమాజంలో చీదరింపులకు గురై ఆదరణకు నోచుకోని వారిని అక్కున చేర్చుకోవటమే ఆయన నైజం.. అనాథపిల్లలను చేరదీసి, పెంచి, పోషించి వారిని ప్రయోజకులను చేయటంలోనే ఆయనకు చెప్పలేని ఆనందం. కుష్ఠువ్యాధిగ్రస్తుల పిల్లలను చిన్నతనం నుంచే కన్నతండ్రిలా సాకి, విద్యాబుద్దులు నేర్పి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దే వరకు నిద్రపోకుండా సేవచేస్తూ ఆప్యాయతకు మారుపేరుగా నిలిచారు. అనాథపిల్లలనే తన పిల్లలుగా భావిస్తూ వారిపట్ల మమతను చాటారు. సేవే మార్గంగా సెయింట్‌ గ్రిగోరియస్‌ బాలాగ్రాం అనాథ ఆశ్రమం స్థాపించారు కేరళ రాష్ర్టానికి చెందిన ’కేఐ ఫిలిప్‌ రామ్‌బన్‌. యాచారం గ్రామానికి ఆయనకు విడదీయలేని అనుబంధం. బాలాగ్రాం ద్వారా 33 ఏండ్లుగా సమాజ సేవచేసిన అతను ఈనెల 7న కేరళలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు. అతని సేవలు పొందిన ఎంతోమంది కన్నీళ్ల పర్యంతమయ్యారు. 


రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనే తక్కళ్లపల్లితండా సమీపంలో హైదరాబాద్‌కు 50కిలో మీటర్ల దూరంలో సెయింట్‌ గ్రిగోరియస్‌ బాలాగ్రాంను 1985లో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో స్థాపించారు. మొదట్లో అక్కడ చర్చిని నిర్మించారు. 1987 జూన్‌14న కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న పిల్లల ఆశ్రమాన్ని ఏర్పాటుచేశాడు. వారిని పెంచి, పోషించి, విద్యావంతులను చేయటమే బాలాగ్రాం ప్రధాన ధ్యేయం. మొదట ఐదుగు రు అనాధ చిన్నారులతో ప్రారంభమై, 1988లో 46 మంది, 2000లో 100 మంది.. ఇలా ప్రతి ఏడాది సేవలు విస్తృతం చేస్తూ ప్రపంచస్థాయిలో బాలాగ్రాం పేరు నిలబెట్టారు. ప్రస్తుతం 260 మంది అనాథపిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో అధికంగా కుష్ఠు వ్యాధిగ్రస్తుల పిల్లలుండగా, మిగతావారు అనాథ, నిరుపేద పిల్లలున్నారు. ప్రస్తుతం థామస్‌ (పప్పా) బాలాగ్రాంను నిర్వహిస్తున్నారు.

తల్లిదండ్రుల్లేరనే లోటు రాకుండా..

కుష్ఠువ్యాధి బాధితుల పిల్లలు, ఎయిడ్స్‌ బాధితుల పిల్లలు, అనాథ పిల్లలను చిన్న వయస్సులోనే ఆశ్రమంలో చేర్చుకుని అన్ని తానై వారికి తల్లిదండ్రులు లేరనే లోటు రానీయకుండా ఫిలిప్‌ స్ఫూర్తితో థామస్‌ బాలాగ్రాంను నిర్వహిస్తున్నాడు. పిల్లలందరిని చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. ఇక్కడి పిల్లలు ఎంతో మంది పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఇందులో ఫిలిప్‌ సహకారం, థామస్‌ వర్గీస్‌ కృషి ఎంతో ఉన్నది. 

స్నేహానికి నిలయం..

బాలాగ్రాంలో వివిధ రాష్ర్టాలకు చెందిన అనాథపిల్లలు, అన్ని కుల, మతాలకు చెందిన బహుభాషలు మాట్లాడేవారు ఉన్నా రు. దీంతో బాలాగ్రాం స్నేహాలయానికి నిదర్శనంగా చెప్పవ చ్చు.  థామస్‌ వారికి కరాటే, ఐఏఎస్‌, ఐపీఎస్‌లాంటి శిక్షణ ఇస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. 

బాలాగ్రాం కంటి వైద్యశాల 

ఆశ్రమం వద్ద 2001లో సెయింట్‌ గ్రిగోరియస్‌ బాలాగ్రాం కంటి వైద్యశాలను ఫిలిప్‌ రామ్‌బన్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ దవాఖాన సహకారంతో పేదలకు సౌకర్యవంతంగా దవాఖానను ఏర్పాటుచేశారు. ఈ దవాఖాన ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథ పిల్లల పోషణకు ఖర్చు చేస్తారు. ఇక్కడ ఎంతో ప్రతిభ కలిగిన కేరళ కంటి వైద్య నిపుణులు తక్కువ ఫీజుతో సుమారు లక్షకుపైగా కంటి పరీక్షలు చేశా రు. అవసరమైన వారికి 12వేల మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. 2006లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఓమెన్‌ చండి బాలాగ్రాం సందర్శించి అనాథపిల్లలకు చేస్తున్న సేవలకు అభినందించారు. ఫిలిప్‌ రామ్‌బన్‌ సేవలను కొనియాడారు. సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ తరుచూ బాలాగ్రాంను సందర్శించి విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.  

వృద్ధుల కోసం ప్రత్యాస భవనం..

కన్న కొడుకులు కాదనుకున్న వృద్ధులు, దిక్కు మొక్కులేని అనాథ వృద్ధులు ఆశ్రయం కల్పిస్తూ ఫిలిప్‌ రామ్‌బన్‌ 2008లో ప్రత్యాస భవనం ఏర్పాటు చేశారు. 

సకల సౌకర్యాలతో నూతన భవనం..

సెయింట్‌ గ్రిగోరిస్‌ బాలాగ్రాంలో అనాథ, పేద విద్యార్థుల కోసం ఫిలిప్‌ రామ్‌బన్‌ కృషితో సీబీఎస్‌ఈతో కూడిన ఇంగ్ల్లిష్‌ మీడియాన్ని ఇక్కడే మొదటిసారి ప్రవేశపెట్టారు. పాఠశాల భవనం పక్కాగా లేకపోవడంతో 2014లో సకల సౌకర్యాలతో ఇంజినీరింగ్‌ కళాశాల భవనాన్ని తలపించే విదంగా నూతన భవనాన్ని ఫిలిప్‌ రామ్‌బన్‌ సహకారంతో నిర్మించారు. అందు లో బాలాగ్రాం ఆశ్రమానికి చెందిన విద్యార్థులే కాకుండా మండలంలోని చుట్టు పక్కల గ్రామాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు తక్కవ ఫీజుతో కేరళ ఉపాధ్యాయులతో ఉత్తమ విద్యను అందిస్తున్నారు.. 

దాతల సహకారంతోనే

ఆశ్రమ నిర్వహణకు బాలాగ్రాం వ్యవస్థాపకుడు ఫిలిప్‌ రామ్‌బన్‌ దేశంలోని అన్ని ప్రాంతాలు తిరిగి విరాళాలు సేకరించి, అనాథ పిల్లలను ఉన్నతస్థాయికి చేర్చటంలో సఫలీకృతులయ్యారు. గతంలో ఇక్కడ చదివి మంచి స్థాయిలో స్థిరపడిన విద్యార్థులు విశ్వాసం వీడక ప్రతినెల తమకు తోచిన సహాయాన్ని అందజేస్తుంటారు. చారిటీ ఎయిడ్‌ ఫౌండేషన్‌, హెల్పేజ్‌ ఇండియా, దుబాయ్‌కు చెందిన స్కాట్‌ బాడర్‌ మిడిల్‌ ఈస్ట్‌, నుతక్కి రామశేషయ్య మెమోరియల్‌ ట్రస్టు, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కెనడా అండ్‌ ఇండియా, కెనడా గవర్నమెంట్‌ ఆర్గనైజేషన్‌(సీఉడీఏ)లతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి చేయూతనిస్తున్నారు.

విజన్‌ 2020 అవార్డు

యాచారంలోని సెయింట్‌ గ్రిగోరియస్‌ బాలాగ్రాం ఉత్తమ సేవలకుగాను రైట్‌ టూ సైట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ద్వారా ఆలిండియా కాంపిటేషన్‌లో మొదటి స్థానం సంపాదించి విజన్‌ 2020 అవార్డును సొంతం చేసుకుంది. అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాలాగ్రాం నిర్వాహకుడు రేవ ఫాదర్‌ థామస్‌ వర్గేస్‌ అవార్డును అందుకున్నాడు. దీంతో రేవ ఫిలిప్‌ రామ్‌బన్‌ హర్షం వ్యక్తం చేశాడు. 

ఫిలిప్‌ రామ్‌బన్‌ మృతి తీరని లోటు..

బాలాగ్రాం వ్యవస్థాపకుడు కేఐ ఫిలిఫ్‌ రామ్‌బన్‌(86) 33ఏళ్లుగా యాచారం బాలాగ్రాం ద్వారా ఎంతో మంది అనాథలకు సేవలను అందించాడు. అతను ఈ నెల 7న కేరళ రాష్ట్రం పుతుప్పడిలోని కోజికోడ్‌లో ఆశ్రమంలో అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతికి ఇక్కడి ప్రాంతవాసులు, విద్యార్థులు, బాలాగ్రాం నిర్వాహకులు, మత పెద్దలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.