శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 10, 2020 , 00:20:08

న‌భూతో

న‌భూతో

  • వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ తాసిల్దార్లకు...
  • వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ సబ్‌ రిజిస్ట్రార్లకు అప్పగింత
  • రెండు విభాగాలుగా ధరణి పోర్టల్‌
  • కులం, ఆదాయం సర్టిఫికెట్‌లు జారీ చేసే బాధ్యత మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలదే... 
  • వీఆర్వోలు వివిధ శాఖలకు బదిలీ..
  • వీఆర్‌ఏలు  పే స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తింపు
  • రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వెల్లువెత్తిన సంబురాలు

అవినీతికి చరమగీతం

పారదర్శతే ప్రామాణికం

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సరళతరం

కొత్త రెవెన్యూ చట్టంతో తీరనున్న కష్టాలు

ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా రెవెన్యూ వ్యవస్థలో నూతన ఒరవడికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. అవినీతి, అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించి సామాన్య ప్రజలకు మరింత పారదర్శకపాలన అందించేందుకు నూతన రెవెన్యూ చట్టాన్ని బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కొత్త చరిత్ర సృష్టించారు. ఇక నుంచి తాసిల్దార్లు వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములను సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఏ రకమైన భూమి అయినా రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యుటేషన్‌ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తాసిల్దార్లకు అప్పగించారు. అలాగే కుల ధ్రువీకరణ పత్రాలను లైఫ్‌టైమ్‌కి ఒకే సారి జారీ చేయనున్నారు. తొలిగించిన వీఆర్వోలను నీటిపారుదల, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖల్లో ఏదైనా సమాన స్థాయి ఉద్యోగానికి బదిలీ చేయనున్నారు. వీఆర్‌ఏలను సర్వీస్‌ రూల్స్‌ పే స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తించనుండడంతో రంగారెడ్డిలో 842, వికారాబాద్‌లో 800మందికి ప్రయోజనం కలుగునున్నది.  వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన నేపథ్యంలో కొత్త చట్టంపై రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో  రైతులు ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి నూతన చట్టానికి ఆమోదం తెలిపారు.       

 - రంగారెడ్డి నమస్తే తెలంగాణ/ పరిగి

 నవశకానికి నాంది..

 రెవెన్యూ ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. అవినీతిరహితంగా సేవలందించే దిశగా సీఎం కేసీఆర్‌ చూపిన చొరవకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ చట్టం వలన భవిష్యత్తులో భూములకు సంబంధించిన వివాదాలు అనేవే ఉండవు.  దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ అండగా ఉంటున్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేయడం, జాప్యాన్ని నివారించడం లాంటి అనేక అంశాలు కొత్త చట్టంలో ఉండడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ చట్టం కారణంగా మరోసారి దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తున్నది.                  

- బుయ్యని మనోహర్‌రెడ్డి  ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్‌    


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/ పరిగి : ప్రజలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంతో పాటు అవినీతి అంతానికి ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చట్టాన్ని సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో  హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మరింత అవినీతి రహితంగా, నాణ్యమైన, పారదర్శకంగా సేవలు అందించాలన్న సత్సంకల్పంతో చట్టాన్ని రూపొందిండంతో  రెండు జిల్లాల్లో  ప్రజలు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి, బాణాసంచా కాలుస్తూ సంబురాలు జరుపుకున్నారు. కొత్త చట్టం అమలుతో ప్రజలకు మేలు కలుగడంతోపాటు ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. 

 జాయింట్‌ రిజిస్ట్రార్‌లుగా తాసిల్దార్లు

ప్రభుత్వం అమలు చేయనున్న నూతన రెవెన్యూ చట్టంతో తాసిల్దార్లు జాయింట్‌ రిజిస్ట్రార్‌లుగా వ్యవహరిస్తారు. జిల్లా పరిధిలో 18 మండలాలు ఉండడంతో ఇక నుంచి తాసిల్దార్‌లు వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఏ రకమైన భూమి అయినా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండవు.. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు ఇవ్వనున్నారు. ధరణి పోర్టల్‌ రెండు విభాగాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించినవి వేర్వేరుగా ఉంటాయి. వ్యవసాయేతర భూములను సబ్‌ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. మ్యుటేషన్‌ పవర్‌ను కూడా ఆర్డీవో నుంచి తాసిల్దార్లకు అప్పగించారు.

భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే మ్యుటేషన్‌ జరుగుతుంది. ఆ వివరాలను ఎప్పటికపుడు ధరణి పోర్టల్‌లో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా మరింత వేగవంతంగా పనులు పూర్తవుతాయి. భూముల విరాసత్‌కు సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది.  పట్టాదారు పాసు పుస్తకాలు గల వారు తమ కుటుంబ సభ్యుల వివరాలను అందజేయాలని సూచించింది. ఇకమీదట కుల ధ్రువీకరణ పత్రాలను లైఫ్‌టైమ్‌ సర్టిఫికెట్‌గా అందజేయనుండడంతో ఒక్కసారి ఈ సర్టిఫికెట్‌ తీసుకుంటే సరిపోతుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ డేటాబేస్‌ ఆధారంగా అందజేయనుండడంతో మరింత పకడ్బందీగా ఈ సర్టిఫికెట్ల జారీ చేయనున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు జారీ చేస్తాయి. 

వీఆర్వోలు, వీఆర్‌ఏకు ఉద్యోగ భద్రత 

నూతన రెవెన్యూ చట్టంతో వీఆర్వోల వ్యవస్థ రద్దు కానుంది. దీంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌, కందుకూరు, షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 27 మండలాలు 606 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 282 మంది వీఆర్వోలు, 842 మంది వీఆర్‌ఏలు విధులు నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 240 మంది వీఆర్వోలు, 800 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వీఆర్వోలను నీటిపారుదల, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ తదితర శాఖలలో ఆప్షన్లు ఇచ్చి  ఏదైనా సమాన స్థాయి ఉద్యోగానికి బదిలీ చేయనున్నారు. వీఆర్‌ఏలను సర్వీస్‌ రూల్క్‌ పే స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తించనుండడంతో రంగారెడ్డిలో 842, వికారాబాద్‌లో 800మందికి ప్రయోజనం కలుగుతుంది.. 

జిల్లాల్లో  సంబురాలు 

అవినీతిని అంతం చేసేందుకు, పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్‌ బుధవారం అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, రైతులు, టీఆర్‌ఎస్‌ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశంతో నూతన రెవెన్యూ చట్టాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారని పలువురు కొనియాడారు. రెండు జిల్లాలోని అనేకచోట్ల సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించడంతో పాటు బాణాసంచా కాల్చారు. 

నూతన రెవెన్యూ బిల్లుతో తీరనున్న కష్టాలు 

 

   తరతరాలుగా ఇబ్బందిపడుతున్న రైతాంగానికి రక్షణ కల్పించేందుకు, భూముల సొంతదారులకు రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకం. బిల్లు ప్రవేశ పెట్టడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా చిన్న ఉద్యోగంతో, తక్కువ వేతనంతో పనిచేస్తున్న విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లను ప్రభుత్వోద్యోగులుగా మార్చుతూ.. వారికి  వేతన స్కేలు నిర్ణయించడం హర్షణీయం. ఈ క్రమంలో సుమారు 22 వేల మంది వీఆర్‌ఏలు లబ్ధి పొందనున్నారు. మరో ఐదు వేలకు పైగా ఉన్న వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేయడానికి, వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ముఖ్యమంత్రికి ఉద్యోగులపై ఉన్న సానుభూతికి నిదర్శనం.

- కప్పాటి పాండురంగారెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌