బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 03, 2020 , 04:13:42

క్రమబద్ధీకరణపై అవగాహన పెంచాలి

క్రమబద్ధీకరణపై అవగాహన పెంచాలి

  • అక్రమ లేఅవుట్ల వివరాలు సేకరించాలి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ 

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎల్‌ఆర్‌ఎస్‌కు అక్టోబర్‌ 15వరకు అవకాశం ఉందని, జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ లే అవుట్ల వివరాలు సేకరించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పంచాయతీ రాజ్‌ రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. అందులోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌, హరితహారంపై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 26 నాటికి అక్రమ లేఆవుట్లలోని ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినందున ఆ దిశగా సన్నాహాలు చేయాలన్నారు. రెగ్యులరైజేషన్‌ చేసుకోకపోతే విద్యుత్‌, వాటర్‌ కనెక్షన్‌తో పాటు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు కల్పించడం జరుగదని పేర్కొన్నారు. 

    హరితహారంపై సమీక్ష నిర్వహిస్తూ పల్లె ప్రకృతి వనం కింద 560 గ్రామ పంచాయతీలకు గాను 518 చోట్ల భూములను గుర్తించామన్నారు. ఇప్పటివరకు 398 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటారని, మిగిలిన చోట్ల త్వరగా పనులు పూర్తిచేయాలని  ఆదేశించారు. కందుకూరు, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల డివిజన్లలోని పల్లె ప్రకృతి వనాల్లో పెద్ద మొత్తంలో మొక్కలను నాటారని,షాద్‌ నగర్‌ డివిజన్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కు సంబంధించి 10 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3లక్షలు నాటామన్నారు. మిగిలిన 7 లక్షల మొక్కలను తొందరగా నాటాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి , డీపీవో శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్‌డీవో ప్రశాంత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.