సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 01, 2020 , 23:57:47

కానుకల పంపిణీకి సన్నాహం

కానుకల పంపిణీకి సన్నాహం

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌ : బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా సీఎం కేసీఆర్‌ గత నాలుగేండ్ల్లుగా అందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో జిల్లాకు బతుకమ్మ చీరలు రానున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన 4.96లక్షల మందికి చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొయినాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఉన్న గోదాంలో బతుకమ్మ చీరల స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు.  

రంగం సిద్ధం..

గ్రామీణ, అర్బన్‌ మండలాల్లో ఈ చీరలు పంపిణీ చేయనున్నారు. మొత్తం 27 మండలాల్లో ఉన్న 18 ఏండ్ల్లు నిండిన ప్రతి ఆడపడుచుకు చీరను అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక్కో గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామాలవారీగా జాబితా ఆయా రేషన్‌ డీలర్ల దగ్గరకు చేరింది. బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. చేనేత కార్మికులను ఆదుకోవడంతో పాటు మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. చేనేత చీరలను పెద్దఎత్తున కొనుగోలు చేసి ప్రభుత్వం నిరుపేదలకు పండుగ కానుకగా అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాలకు బతుకమ్మ చీరలను అందించనున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేనేత కార్మికులు, సంఘాల నుంచి చీరలను ఇప్పటికే కొనుగోలు చేసింది. సివిల్‌ సప్లయ్‌ శాఖ ఆహార భద్రత కార్డులను ఎంతమందికి ఇచ్చిందనే సమాచారం సేకరించి.. వాటి ఆధారంగా మహిళలకు చీరలను అందిస్తారు. గతేడాది 4.20లక్షల మంది మహిళలు బతుకమ్మ చీరలను తీసుకోగా ఈసారి 4.96లక్షల మందికి అందజేయనున్నారు.   

5,24,868 రేషన్‌ కార్డులు.. 

 జిల్లాలో మొత్తం 27 మండలాలు ఉండగా సుమారుగా 5,24,868 రేషన్‌ కార్డులు ఉన్నాయి. అందులో ఆంత్యోదయ ఆహార భద్రత కార్డులు (ఏఎఫ్‌ఎస్‌సీ) 35 వేల 170లు, ఆహార భద్రత కార్డులు (ఎఫ్‌ఎస్‌సీ) 4లక్షల 89వేల 656, అన్నపూర్ణ కార్డులు 42 చొప్పున ఉన్నాయి. బతుకమ్మ చీరలను జిల్లాలోని తెల్లరేషన్‌కార్డులున్నవారికి ఇవ్వాలని నిర్ణయించారు. 5,24,868 రేషన్‌ కార్డులకు గాను దాదాపుగా జిల్లాలో 919  రేషన్‌ సరుకుల దుకాణాలున్నాయి. ఇప్పటికే తహసీల్దార్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు, వీఆర్వోలు ఇతర అనుబంధ శాఖల అధికారులు ముమ్మరం చేశారు.అందరికీ చీరలకు సంబంధించిన టోకెన్లు కూడా అందజేశారు. 

 స్టాక్‌ పాయింట్‌...

చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండల కేంద్రంలో ఉన్న మార్కెట్‌ కమిటీ గోదాంలో భద్రపర్చనున్నారు. జిల్లాలో చేవెళ్ల, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, కందుకూరు తదితర డివిజన్లు ఉన్నాయి. వీటీలో చేవెళ్ల డివిజన్‌లో  స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయనుండగా.. కందుకూరు డివిజన్‌లో సైతం బతుకమ్మ చీరల స్టాక్‌ పాయింట్ల  ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

వికారాబాద్‌జిల్లాలో  3,26,620 మంది అర్హులు..

 బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే నిరుపేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ చేసేందుకు వికారాబాద్‌ జిల్లా అధికారులు సిద్ధమతున్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడపడుచులకు ఏటా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 3,26,620 మంది ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పంపిణీ ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2,34,500 తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 3,26,620 మంది 18 ఏండ్లు నిండిన మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు జిల్లాలో దౌల్తాబాద్‌ మండల పరిధిలోని చంద్రకళ్‌లోని ఏఎంసీ గొడౌన్‌, పరిగి ఇండోర్‌ స్టేడియం, వికారాబాద్‌ ఏఎంసీ గోదాములను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.