గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 31, 2020 , 01:37:54

ప్రకృతి...పరవశం...

ప్రకృతి...పరవశం...

  •  రెండు జిల్లాల్లో సండే సందడి...
  • ప్రకృతి అందాలను ఆస్వాదించిన పర్యాటకులు
  •  కట్టిపడేస్తున్న మంచాల మండలం బోడకొండ  జలపాతం,  పచ్చటి పరిసరాలు
  • తెలంగాణ ఊటీ.. అనంతగిరిలో యువత కేరింత
  • షూటింగ్‌లు, ట్రెక్కింగ్‌లతో బిజీబిజీ

ఎటు చూసినా ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.. పచ్చదనం... చెరువులు, కుంటల్లో జలకళను చూస్తూ పర్యాటకులు పరవశించిపోతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు జిల్లాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ వద్ద జలపాతాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాలతో పాటు నగరం నుంచి పెద్ద ఎత్తున యువత వచ్చారు. వికారాబాద్‌ అనంతగిరి అందాలను వీక్షిస్తూ చిన్నా, పెద్దా ఉత్సాహంగా గడిపారు.

   -మంచాల, వికారాబాద్‌


మంచాల: మంచాల మండలం బోడకొండ సమీపంలో  కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి  పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి అందాలని వీక్షిస్తూ  ఆనందంగా గడుపుతున్నారు.  బోడకొండ హైదారాబాద్‌కు అతి దగ్గరగా ఉండడంతో వాహనాల్లో టూరిస్టులు ఇక్కడికి చేరుకోని జలపాతాలను, పచ్చని పంటపొలాలను, ఎత్తైన కొండప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలను వీక్షిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. సెలవు రోజు వచ్చిందంటే ఇక్కడికి పర్యాటకులు క్యూకడుతున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బోడకొండ సర్పంచ్‌ అలివేలు  వాహనాల పార్కింగ్‌ ఏర్పాటుతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

తెలంగాణ ఊటీలో పర్యాటకుల సందడి

వికారాబాద్‌ రూరల్‌ : తెలంగాణ ఊటీగా పిలువబడుతున్న అనంతగిరిలో పర్యాటకుల సందడి పెరుగుతున్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో అనంతగిరి అందాలను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చారు. కరోనా మహమ్మారి భయానికి ఇండ్లకు పరిమితమయిన పట్టణవాసులు జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో, పిల్లలతో, స్నేహితులతో కలిసి అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని ఆధ్యాత్మికతతో గడుపగా.. మరికొందరు వారి పిల్లలకు ఆట వస్తువులు, తినుబండారాలు తీసుకొచ్చి రోజంతా ఆటలు ఆడి, ఫొటోలు దిగి ఉత్సాహంగా గడిపారు. కొందరు ట్రెక్కింగ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు.


షూటింగ్‌లకు అనుమతులు తప్పనిసరి : అనంతగిరి ఎఫ్‌ఆర్‌ఓ కృష్ణ

అనంతగిరి అటవీ క్షేత్రంలో షూటింగ్‌లకు అనుమతులు తప్పనిసరి. ఆదివారం కొందరు షూటింగ్‌ నిమిత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలియడంతో అనుమతి తీసుకొని షూటింగ్‌ నిర్వహించుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం షూటింగ్‌ ఏర్పాట్లను  నిలిపివేశామన్నారు.  గొర్రెలు, మేకలతో షూటింగ్‌లకు అనుమతులు లేవన్నారు. అటవీశాఖ నియమ నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.