శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 29, 2020 , 00:07:04

దళారీ వ్యవస్థను నిర్మూలించాలి

	  దళారీ వ్యవస్థను నిర్మూలించాలి

  • ‘నిల్వ చేసిన ధాన్యంపై రైతులకు రుణాలివ్వాలి
  • n రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • n దేశంలోని అన్ని గోదాంలకు జియో ట్యాగింగ్‌
  • n తెలంగాణలో 500 బ్యాంకులకు రుణాలు
  • n త్వరలోనే అన్ని సహకార బ్యాంకుల్లో 
  • కంప్యూటరీకరణ
  • n నాబార్డు చైర్మన్‌ గోవిందరాజులు
  • n రూ.2 కోట్లతో ఇబ్రహీంపట్నంలో గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • n మంత్రితో కలిసి ఉప్పరిగూడ సహకార బ్యాంకు దర్శన

ఇబ్రహీంపట్నం: దళారీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాంపేట్‌ సమీపంలో రూ.2 కోట్లతో నిర్మించనున్న గోదాం పనులకు శుక్రవారం నాబార్డు జాతీయ చైర్మన్‌ చింతల గోవిందరాజులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళారి వ్యవస్థను రూపుమాపేందుకే గోదాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేవరకు ఈ గోదాముల్లో నిల్వ ఉంచుకోవచ్చునన్నారు

. నిల్వ చేసిన ధాన్యంపై సహకార సంఘాల నుంచి రుణ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి సహకార సంఘం పరిధిలో గోదాంల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.  రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో రెట్టింపు ధాన్యం దిగుబడి వస్తున్నదన్నారు. రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేక దళారులు నిర్ణయించిన ధరకే విక్రయించి నష్టపోతున్నారన్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం గోదాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.  వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని సహకార సంఘాల పరిధిలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని కేటాయించే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రాచకొండ లిఫ్టు ఇరిగేషన్‌ పనులు పూర్తయితే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందుతుందన్నారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి నాబార్డు సహకరించాలని కోరారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గోదాంల నిర్మాణానికి మరిన్ని నిధులు అందించి అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

రాచకొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన నాబార్డు రాచకొండ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులకు కూడా నిధులు కేటాయించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అత్యధిక ఎత్తులో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సాగునీరు అందడంలేదన్నారు. రాచకొండ లిప్టు ఇరిగేషన్‌ పూర్తయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. 

సహకార బ్యాంకులకు పునర్జీవం 

రాష్ట్రంలోని సహకార బ్యాంకులకు పునర్జీవం పోసేందుకు కృషి చేస్తున్నామని నాబార్డు చైర్మన్‌ చింతాల గోవిందరాజులు అన్నారు. తెలంగాణలో మోడల్‌ సహకార బ్యాంకుగా సేవలందిస్తున్న ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ సహకార బ్యాంకును మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్‌ మనోహరెడ్డితో కలసి సందర్శించారు. బ్యాంకు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యాపార లావాదేవీలు, రుణాల మంజూరుపై ఆ బ్యాంక్‌ చైర్మన్‌ టేకుల సుదర్శన్‌రెడ్డి, సీఈవో గణేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాబార్డు చైర్మన్‌ మాట్లాడుతూ దేశంలోని 2,287 సహకార సంఘాలకు 4శాతం వడ్డీతో 12వందల కోట్ల రుణాలు ఇవ్వనున్నామన్నారు. తెలంగాణలో 800 సహకార సంఘాలు ఉండగా, అందులో 500 సంఘాలకు 4 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించే సహకార బ్యాంకులకు ఒక శాతం వడ్డీ  మాత్రమే పడుతుందన్నారు. సహకార బ్యాంకులకు పక్కా భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వీటిని కంప్యూటరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిడ్డంగులకు ఆరు నెలల్లో జియో ట్యాగింగ్‌ చేస్తామన్నారు. దీని ద్వారా గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ చేసుకునేందుకు స్థలం ఉందా లేదా అని రైతుల సెల్‌ఫోన్‌లకు సమాచారం అందించే అవకాశం ఉంటుందన్నారు.

సహకార సంఘాల్లో రూ.2కోట్లు పెట్టి గోదాం నిర్మిస్తే, వాటికి 5 నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌ రవీందర్‌రావు, జిల్లా సహకార సంఘం చైర్మన్‌ మనోహర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సత్తయ్య, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్‌, జడ్పీటీసీ మహిపాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ చైర్మన్‌ యాదగిరి, కౌన్సిలర్లు మంద సుధాకర్‌, యాచారం సుజాత రవీందర్‌, శ్రీలతరాంబాబు, అల్వాల జ్యోతి, దండుమైలారం సహకార సంఘం చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, మంగల్‌పల్లి సహకార సంఘం చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు సత్తువెంకటరమణారెడ్డి, నాబార్డు సీజీఎం కృష్ణారావు, సహకార సంఘం అధికారులు జనార్దన్‌రెడ్డి, వీరబ్రహ్మయ్య, కృష్ణారావు, మురళీధర్‌, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఉప్పరిగూడ సహకార సంఘం ఉపాధ్యక్షుడు క్యామ శంకర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.