శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 24, 2020 , 01:45:48

దేశానికే ఆదర్శం ‘మిషన్‌ భగీరథ’

  దేశానికే ఆదర్శం  ‘మిషన్‌ భగీరథ’

  • ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది 
  • సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  • వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • ఆమనగల్లు మండలం  రాంనుంతలలో ప్లాంట్‌ పరిశీలన
  • ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబానికి పరామర్శ

ఆమనగల్లు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఈ పథకం ద్వారా ఇంటింటికి శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీళ్లు లభిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాంనుంతల గ్రామ పంచాయతీలో మిషన్‌ భగీరథ ప్లాంట్‌ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, ఎంపీపీలు కమ్లీమోత్యానాయక్‌, అనితతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టారని తెలిపారు. మిషన్‌ భగీరథతో ఇంటింటికి శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతుండటంతో ఆడపడచులు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. అంతకుముందు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ వస్పుల జంగయ్య, నాయకులు సురేందర్‌రెడ్డి, విజయ్‌, శివలింగం, బాబా, హన్మానాయక్‌, వేణుగోపాల్‌, యాదగిరిరెడ్డి, జహంగీర్‌, చందోజీ పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి పరామర్శ... 

ఇటీవల మృతిచెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. కల్వకుర్తి పట్టణంలోని ఎడ్మ కిష్టారెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాళులర్పించారు. ఎడ్మ కిష్టారెడ్డి మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి, కల్వకుర్తి ప్రాంతానికి తీరనిలోటని మంత్రి అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.