శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 22, 2020 , 00:07:56

ఇంట‌ర్నెట్‌తో హైఫై విద్య‌

ఇంట‌ర్నెట్‌తో హైఫై విద్య‌

సర్కారు స్కూళ్లకు ఇంటర్నెట్‌

పైలెట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా  u 

జిల్లా విద్యాధికారికి ప్రభుత్వ ఆదేశాలుl  

పైలెట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లా ఎంపిక 

జిల్లా విద్యాధికారికి ప్రభుత్వ ఆదేశాలు

జిల్లాలో మొత్తం 1,200 పాఠశాలల్లో అమలు

లక్ష 17వేల 772 మంది వద్ద  డిజిటల్‌ పరికరాలు 

లేని వారికోసం ప్రయత్నాలు..

అన్ని పాఠశాలలకు వైఫై సౌకర్యం 

కొవిడ్‌ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ బోధనకు అనువుగా సర్కారు స్కూళ్లలో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.  రంగారెడ్డి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.  ఇందులో భాగంగా 3 నుంచి 5వ తరగతి వరకు,   6 నుంచి 10వ తరగతి వరకు డిజిటల్‌ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబ్‌ సౌకర్యంతోపాటు ఇంటర్నెట్‌, విద్యార్థులకు మొబైల్‌ ఫోన్‌ ఉంటే వైఫై కనెక్షన్‌ ఇచ్చి భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు నేర్పించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోనున్నది. జిల్లాలో మొత్తం 1,200 పాఠశాలలు ఉన్నాయి. అందులో 886 ప్రాథమిక, 178 ప్రాథమికోన్నత, 244 ఉన్నత పాఠశాలలు, 27 కేజీబీలు, 10 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. సుమారు లక్షా 22వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.  ఇందులో  లక్షా 17వేల 772 మంది  వద్ద డిజిటల్‌ సౌకర్యాలు ఉండగా.. 5036 మంది విద్యార్థులకు అందుబాటులో లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.   

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు మొదలయ్యాయి. పైలెట్‌ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం.. మొదటగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. దశలవారీగా మిగతా ప్రాంతాలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు అందాయి. సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో అమలుకు అన్వేషణ చేస్తున్నారు. కొవిడ్‌ -19 వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించనున్నారు. ఆన్‌లైన్‌ బోధనకు అనువుగా ఇంటర్నెట్‌ వసతి కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్యను అందించేందుకు.. అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీని ద్వారా జిల్లాలోని 1,200 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.20 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగనున్నది. విద్యార్థులకు ప్రయోజనం కల్గించేందుకు ఈ దిశగా జిల్లా విద్యాశాఖ అన్వేషణ సాగిస్తున్నది. వైబ్‌ ఆప్షన్‌తో, వైఫైతో ఇంటర్నెంట్‌ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. 

ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి.. పాఠాలు బోధించి..

జిల్లాలో కరోనా కేసులు పెరిగి పోతుండడంతో పాఠశాల విద్యాశాఖ డిజిటల్‌ తరగతుల వైపు మొగ్గు చూపుతున్నది. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించి పాఠాలు బోధించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు సర్వేలు చేసింది. ఒకటి పాఠశాలలను ఎప్పుడు తెరువాలి, తరగతుల వారీగా విద్యార్థుల వద్ద ఎంత మందికి మొబైల్‌ ఫోన్లు, టీవీలు (డిజిటల్‌ సౌకర్యం) ఉన్నాయనే వివరాలు సేకరించేందుకు సర్వే చేసింది. ఈదిశగా కసరత్తు మొదలు పెట్టి డిజిటల్‌ సౌకర్యం అధికంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందడంతో మొదట జిల్లాల్లోనే డిజిటల్‌ క్లాసులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. డిజిటల్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖ సర్వే రిపోర్టును ప్రభుత్వానికి నివేదించింది. ఆ నివేదిక ఆధారంగా ఇంటర్నెట్‌ సౌకర్యం పైపు దృష్టి సారించింది. 

డిజిటల్‌ పాఠాల కోసం అన్ని ఏర్పాట్లు

జిల్లాలో మొత్తం 1,200 పాఠశాలలు ఉండగా.. వీటిలో 886 ప్రాథమిక, 178 ప్రాథమికోన్నత, 244 ఉన్నత పాఠశాలలు, 27 కేజీబీలు,10 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో బాలురు 61,241, బాలికలు 56,531, మొత్తం లక్ష 17వేల 772 మంది వద్ద డిజిటల్‌ సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించారు. డిజిటల్‌ పరికరాలు లేని బాలురు 2619, బాలికలు 2417, మొత్తం 5,036 గుర్తించారు. ఇందులో భాగంగా 6 నుంచి 10 వరకు, 3 నుంచి 5 వరకు డిజిటల్‌ తరగతులు మొదలు పెట్టేందుకు కసరత్తు మొదలైంది. విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు వినేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద డిజిటల్‌ సౌకర్యాలతో పాఠాలు చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నెట్‌ సదుపాయం లేని విద్యార్థుల వివరాలు సేకరించిన ప్రభుత్వం వారి కోసం ఆలోచన చేస్తున్నది. డిజిటల్‌ సదుపాయాలు ఉన్న విద్యార్థుల వివరాలు క్రోడీకరించి.. పాఠశాలల్లోనే డిజిటల్‌ సౌకర్యాలు లేని విద్యార్థులకు కొవిడ్‌-19 నిబంధలనకు లోబడి పాఠాలు చెప్పనున్నారు. వీరందరికి డిజిటల్‌ బోధనలు చేసే విధంగా జిల్లా విద్యాశాఖ సిఫారసు చేసింది. 

వైఫై సౌకర్యం కల్పన..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు వైఫై కనెక్షన్‌ ఇవ్వనున్నారు. అలాగే జిల్లాలోని ఆయా పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబ్‌ సౌకర్యం ఉంటే వారికి ఇంటర్నెట్‌తో కనెక్టు కానున్నారు. మొబైల్‌ ఫోన్‌ ఉంటే వైఫై కనెక్షన్‌ ఇస్తే విద్యార్థులు దూరం .. దూరం కూర్చుని పాఠాలు వింటారు. భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు వినేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యశాఖ ఆదేశాలు జారీ చేయనున్నది. వెబ్‌ ఆప్షన్‌తో మొబైల్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తారు.