సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Aug 21, 2020 , 01:54:07

లఖ్నాపూర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

లఖ్నాపూర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
  • ప్రాజెక్టు సందర్శన.. మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

పరిగి : లఖ్నాపూర్‌ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం అలుగు పారుతున్న  ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించి పూజలు జరిపారు. అనంతరం మినీ ట్యాంక్‌ బండ్‌ పనులు  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లఖ్నాపూర్‌ ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మారుస్తామన్నారు. ఉదయం వాకింగ్‌ చేయడానికి, సాయంకాలం  కుటుంబసభ్యులతో  సేద తీరే విధంగా  సిద్ధం చేస్తామన్నారు. రూ.6.81కోట్లతో ప్రాజెక్టు పునరుద్ధరణ, మినీ ట్యాంక్‌బండ్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దసరా నాటికి పనులన్నీ పూర్తి చేయాల్సిందిగా నీటి పారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామస్తుల కోరిక మేరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రాజెక్టు సమీపంలో ఒక ఎకరం స్థలం ఇవ్వాలని, ఇక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తే మరింత పచ్చదనం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ క్రిష్ణారెడ్డి, ఏఈ నిఖేశ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మీ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

రెండవరోజు అలుగు పారిన లఖ్నాపూర్‌ ప్రాజెక్టు 

 లఖ్నాపూర్‌ ప్రాజెక్టు రెండో రోజు గురువారం సైతం అలుగు పారింది. బుధవారం రాత్రి వర్షం కురియడంతో మరింత వరద ప్రాజెక్టులోకి చేరింది.   అలుగు పారడాన్ని చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలు ఆసక్తిగా వీక్షించారు.