శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rangareddy - Aug 20, 2020 , 01:08:59

సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కాన్ఫరెన్స్‌లు

సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కాన్ఫరెన్స్‌లు

  • l భూ సమస్యలతోపాటు సంక్షేమ పథకాలపై ప్రత్యేక నజర్‌
  • l  డివిజన్‌ స్థాయిలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సమావేశం
  • l కందుకూరు డివిజన్‌ కార్యాలయంలో పూర్తయిన సమీక్ష
  • l పారదర్శకంగా సేవలందించాలని   అధికారులకు సూచించిన కలెక్టర్‌
  • l త్వరలో మిగతా డివిజన్లలో..

భూ సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం మరోసారి కదిలింది. అందుకు డివిజన్‌ స్థాయిలో ‘రెవెన్యూ కాన్ఫరెన్స్‌'లు నిర్వహిస్తున్నది. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై భూ సమస్యలతోపాటు సంక్షేమ పథకాలపై సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరాసత్‌, మ్యూటేషన్‌, మీసేవ, డీఎస్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ పెండింగ్‌ ఫైళ్లను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే చేవెళ్ల, షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ డివిజన్లలోనూ సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కాన్ఫరెన్స్‌లు 

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ/ కందుకూరు: ‘పాలన’ పరుగులు పెడుతున్నది. ప్రజల సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కదిలారు. రైతన్నల కష్టాలు తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా పాస్‌ పుస్తకాలు వచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడ భూ సమస్యలతో అన్నదాతలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొవిడ్‌-19కి ముందు నిర్వహించిన గ్రీవెన్స్‌లో భూ సమస్యల ఫిర్యాదులే అధికంగా వస్తుండేవి. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన లోకేశ్‌కుమార్‌ భూ సమస్యల పరిష్కారానికి డివిజన్ల వారీగా ప్రత్యేకంగా పర్యటించి సమస్యల పరిష్కారం కోసం చొరువచూపారు. ఇప్పుడు అదే మాదిరి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ‘రెవెన్యూ కాన్ఫరెన్స్‌' మీటింగ్‌లు ప్రారంభించారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో సక్సెషన్‌ 48, మ్యూటేషన్‌ 551, కందుకూరు డివిజన్‌ పరిధిలో సక్సెషన్‌ 47, మ్యూటేషన్‌ 393 చొప్పున పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపుగా జిల్లాలో 90% భూ సమస్యలు తగ్గగా.. అక్కడక్కడ మరో 10% సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొదటగా ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్లలో సమీక్ష నిర్వహించగా.. చేవెళ్ల, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌ డివిజన్ల పరిధిలో త్వరలో సమీక్ష జరుగనున్నది. 

సమస్యల పరిష్కారం దిశగా..

‘రెవెన్యూ కాన్ఫరెన్స్‌' కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైంది. రైతుల సమస్యల పరిష్కారం కోసం డివిజన్‌ స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ శ్రీకారంచుట్టారు. కొవిడ్‌-19 కారణంగా ఆరు నెలలుగా రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టలేదు. కరోనా టెస్ట్‌లు పెరుగడంతో.. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ప్రధానంగా రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించారు. జిల్లాలో కొన్నాళ్లుగా రెవెన్యూ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతున్నది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్‌ దృష్టి సారించడంతో జిల్లాలోని తహసీల్దార్లంతా ఇప్పుడు పాత ఫైళ్ల దూమ్ము దులుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ హరీశ్‌, ఆర్డీవోలు రవీందర్‌రెడ్డి, వెంకటచారిలతో కలిసి ఆయా మండలాల తహసీల్దార్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు తలెత్తితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడిక్కడే పరిష్కర మార్గం చూపించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెవన్యూ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విరాసత్‌, మ్యూటేషన్‌, మీసేవ, డీఎస్‌, ఆర్‌ఎస్‌ఆర్‌ పెండింగ్‌ ఫైళ్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

 పథకాలపై ప్రత్యేక నజర్‌

కేవలం రెవెన్యూ సమస్యలపైనే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ వంటి వాటిని పెండింగ్‌లో పెట్టకూడదని సూచించారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌-19 కేసులు తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించే దిశగా అడుగులు వేయనున్నారు.  

పారదర్శకంగా సేవలు అందించాలి..

కందుకూరు: రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టరు అమయ్‌కుమార్‌ తెలిపారు. కందుకూరు ఆర్‌డీవో కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టరు హరీశ్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల ఆర్‌డీవోలు రవీందర్‌రెడ్డి, వెంకటాచారి, ఆయా మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రెవెన్యూ అంశాలను సత్వరమే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పావని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విరాసత్‌, మ్యూటేషన్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి వాటిని పెండింగ్‌లో పెట్టకూదన్నారు. ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న పథకాలు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో కార్యాలయ ఏవో బైరు సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్లు జ్యోతి, రాంమోహన్‌, శ్రీనివాస్‌రెడ్డి, జ్యోతి, శ్రీనినాస్‌, మహేందర్‌రెడ్డి, చందర్‌, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగయ్య, దేవుజా, పురోషోత్తం, ప్రమీళారాణి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.