శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:05:46

కట్టుదిట్టంగా

కట్టుదిట్టంగా

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ /వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వలస పాలకులు చెరువులు, కుంటలను పట్టించుకున్న దాఖాలు లేవు. కనీసం గండ్లు పడితే వాటికి మరమ్మతులు చేయడానికి పుణ్యకాలం గడిచిపోయేది. చాలా చెరువులు కబ్జాకు గురై కుచించుకుపోయాయి. చిన్న, పెద్ద, మధ్య తరహా చెరువులు నిండితే కట్టలు తెగి, రైతుల పంటలను ముంచెత్తేవి.  ప్రతి ఏటా చెరువులు నిండి గండి పడినా, వాటి పునరుద్ధరణకు ఎలాంటి బడ్జెట్‌ కేటాయించకపోవడంతో అధికారులు కూడా చేతులేత్తేసేవారు. దీంతో రైతులు సాగు చేసిన పంటలు వర్షార్పణం అవుతుండేది.  గత ఐదారేండ్లుగా ఆ పరిస్థితి కనిపిస్త్తలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో మిషన్‌ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చింది. వర్షాలు ప్రారంభం కాకముందే ఇరిగేషన్‌ శాఖ వేసవికాలంలోనే చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు పెట్టి మరీ మిషన్‌ కాకతీయ పథకంలో చెరువుల్లో పూడికతీత పనులు చేస్తుండడంతో ఈసారి జిల్లాలోని ఒక్క చెరువుకూ గండిపడలేదు. చెరువులను పటిష్టం చేయడంతో వర్షపు నీటితో చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో భారీ వర్షాలు వచ్చినా చింతలేకుండా రైతులు గుండెల మీద చేయివేసుకుని నిద్రపోతున్నారు. అబ్దూల్లాపూర్‌మెట్‌ చెరువులో సామర్థ్యం కంటే ఎక్కువగా నీరు రావడంతో అధికారులు కట్టను మధ్యలో తొలగించారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు విడుతలుగా మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చిన్ననీటి వనరుల పునరుద్ధరణ చేపట్టారు. జిల్లాలోని 2033 చెరువులను ఈ పథకంలో ఐదేళ్లలోపు పునరుద్ధరించారు. ప్రతి ఏడాది 20 శాతం చెరువుల చొప్పును పనులు చేపట్టారు.  ఫేజ్‌-1లో 1325 చెరువులకు గాను 310 చెరువులకు రూ.29.45 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు పూర్తిచేశారు. ఫేజ్‌-2లో 357 చెరువులకు రూ.48.40 కోట్లు, ఫేజ్‌-3లో 144 పనులను రూ.8.12 కోట్లు, ఫేజ్‌-4లో 34 చెరువులకు రూ.20.21 కోట్లు ఖర్చు చేసి మరమ్మతులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్‌ శాఖ వెల్లడించింది. 

చెరువులు, కుంటలకు జలకళ

జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మిషన్‌ కాకతీయ పథకంలో చేపట్టిన మరమ్మతులతో చెరువులు, కుంటలు ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. ఈ పథకంలో పునరుద్ధరణ, అన్ని పనులు చేయడానికి శ్రీకారం చుట్టారు. భారీ వర్షాలు పడినా ఎక్కడ గండ్లు పడిన దాఖాలాలు లేవు. వర్షం నీటిని ఎక్కడిక్కడ ఆపగలిగారు. గతంలో సమస్య వస్తే ప్రతిపాదనలు పెట్టిన తర్వాత మంజూరు చేయిచుకుని పనులు చేసే సరికి పుణ్యకాలం కాస్త ముగిసేది. ప్రస్తుతం ముందుచూపుతో ప్రభుత్వమే వేసవి కాలంలో చెరువుల పురుద్ధరణకు శ్రీకారం చుట్టడంతో వర్షాకాలం వచ్చినా, టెన్షన్‌ పడకుండా సంబంధిత శాఖ అధికారులు కేవలం పర్యవేక్షణ చేస్తున్నారు.  

వికారాబాద్‌ జిల్లాలో..

 జిల్లాలో కోట్‌పల్లి, లక్నాపూర్‌, కాకరవేణి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులతోపాటు చెరువుల కింద వేల ఎకరాలకు నీరందించే వెసులుబాటు ఉన్నప్పటికీ గండ్లు పడి సగానికిపైగా నీరు వృథాగా పోయే దయనీయ పరిస్థితి ఉండేది. దీంతో రైతాంగం నిరాశ వ్యక్తం చేసేవారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్‌ కాకతీయ పథకంతో జిల్లాలోని చెరువులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. కాకతీయ పనులతో చెరువులకు చుట్టూ కట్టల నిర్మాణం కూడా పకడ్బందీగా నిర్మించడంతో నాలుగేండ్లుగా చుక్క నీరు వృథాగా బయటకు వెళ్లడంలేదు. జిల్లావ్యాప్తంగా 1126 చెరువులుండగా, 78,091 ఎకరాల ఆయకట్టు ఉంది. తాండూరు డివిజన్‌లో 285, వికారాబాద్‌లో 294, కొడంగల్‌లో 199, పరిగి డివిజన్‌లో 348 చెరువులున్నాయి. 

722 చెరువుల పునరుద్ధరణ..

మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నాలుగు విడుతల్లో 734 చెరువులకు రూ.256 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మొదటి విడుతలో 241 చెరువులకు రూ.82.23 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో 240 చెరువుల్లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రెండో విడుతలో 264 చెరువులకు రూ.126 కోట్లతో 261,  మూడో విడుత 124 చెరువులకు రూ.26.14 కోట్లతో 123, నాలుగో విడుతలో 100 చెరువులకు రూ.21.82 కోట్లతో 98 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. దాదాపు అన్ని చెరువులకు మిషన్‌ కాకతీయలో మరమ్మతులు చేయడంతో పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి. ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పెరిగాయి. గతంలో సగటున 80 ఎకరాలకు నీరందించే చెరువులు  ప్రస్తుతం 180 నుంచి 200 ఎకరాలకు నీరందించే స్థితికి చేరుకున్నాయి. వికారాబాద్‌ జిల్లాలోనే నాలుగు విడుతల్లో చేపట్టిన పూడికతీత పనులతో వృథాగా పోయే కృష్ణా జలాలను మళ్లించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా చెరువుల్లో పూడికతీతతో కనీసం 500 మిలియన్‌ క్యుబిక్‌ ఫీట్ల (5 టీఎంసీల) కృష్ణా జలాలు చెరువుల్లో నిల్వ చేసుకునే అవకాశం కలిగినట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

282 చెరువుల్లో 100 శాతం నీరు..

జిల్లాలోని చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ పనులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావడంతోపాటు ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. గతంలో ఒకట్రెండు చెరువులు నిండితే మహా అనుకునే రోజులు పోయి ప్రస్తుతం చాలా చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లాలో 1126 చెరువులుండగా 58 చెరువులు అలుగు పారుతున్నాయి. 282 చెరువులు పూర్తిగా నిండాయి. 317 చెరువుల్లో 75 శాతం, 291 చెరువుల్లో 50 శాతం, 178 చెరువుల్లో 25 శాతం నీటి నిల్వలు పెరిగాయి.