మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 02:27:02

వర్షం..నష్టం..l

వర్షం..నష్టం..l

  • రంగారెడ్డి  జిల్లాలో 60 ఎకరాల్లో  నీట మునిగిన పంటలు .. కూలిపోయిన 419 ఇండ్లు ..
  • షాద్‌నగర్‌ డివిజన్‌లో పర్యటించిన జిల్లా వ్యవసాయాధికారి, ఏరువాక శాస్త్రవేత్తలు
  • వికారాబాద్‌ జిల్లాలో 776 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఐదు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు 60 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాల కారణంగా షాద్‌నగర్‌ డివిజన్‌లోని కేశంపేట, తలకొండపల్లి, కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌, నందిగామ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆయా మండలాల పరిధిలో పత్తి, వరి, కంది, జొన్న, మక్కజొన్న తదితర పంటలను సోమవారం జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, ఏరువాక శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆమనగల్లు మండలంలో 13 మంది రైతులకు చెందిన 8.35 ఎకరాలు, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 14 మంది రైతులకు చెందిన 9.1 ఎకరాల్లో జొన్న, వరి నీట మునిగాయి. అలాగే, కొందుర్గు మండలంలో 11 మంది రైతులకు చెందిన  12 ఎకరాలు, కేశంపేట మండలంలో 40 ఎకరాల్లో  పత్తి పంట నీట మునిగిందని జిల్లా వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

ప్రాంతాల్లో కూలిపోయిన 419 ఇండ్లు 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, పెంకుటిండ్లు ఏ సమయంలో కూలుతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుంటున్నారు. కొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిని పడిపోతున్నాయి. పాత ఇండ్లను గుర్తించి ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గత రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన రెవెన్యూ శాఖ 419 ఇండ్లు కూలిపోయాయని గుర్తించింది. చేవెళ్ల  33, కందుకూర్‌ 112, రాజేంద్రనగర్‌  16, షాద్‌నగర్‌ 108, ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 150 కూలిపోయినట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. 

వికారాబాద్‌ జిల్లాలో 776 ఎకరాల్లో పంట నష్టం

అల్పపీడన ప్రభావంతో  మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో వికారాబా ద్‌లోని పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 776 ఎకరాల్లో  వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లాలోని బొంరాసుపేట్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బంట్వారం మండలాల్లోని 29 గ్రామాల్లో 461 రైతులకు సంబంధించిన పంటలు అధిక వర్షాలతో నీటమునిగినట్లు తేల్చారు. పత్తి 26 , పెసర 585, మినుములు 165 ఎకరాల్లో నష్టపోయినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.