శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 01:27:41

కొవిడ్‌ టెస్టుల కోసం ఆరు బస్సులు

 కొవిడ్‌ టెస్టుల కోసం ఆరు బస్సులు

  • ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ అనాలసిస్‌ సర్వీస్‌ ద్వారా టెస్ట్‌లు 
  • u జీహెచ్‌ఎంసీ, నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు
  • u ఇప్పటికే 52,839 మందికి టెస్ట్‌లు
రంగారెడ్డి,నమస్తే తెలంగాణ :  కరోనా వైరస్‌ బారినపడిన వారిని మరింత వేగంగా గుర్తించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని మండలాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు చేస్తుండగా.. రంగారెడ్డి జిల్లాలో మళ్లీ కొత్తగా ప్రభుత్వం ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్ట్‌లను (ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ ఆనాలసిస్‌ సర్వీస్‌) ద్వారా చేయనున్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాలు(పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్‌సీ) వ్యాధి నివారణ పరీక్షలు చేస్తుండగా.. ఇక నుంచి మరిన్ని పరీక్షల కోసం ప్రత్యేకంగా బస్సులను కేటాయించారు. శుక్రవారం జిల్లాకు మూడు బస్సులు రాగా, మరో మూడు సోమవారం రానున్నాయి. ఈ ఆరు బస్సులను జిల్లాలోని బాలాపూర్‌, జల్‌పల్లి, సరూర్‌నగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, హఫీజ్‌పేటలకు కేటాయించారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశానుసారం కొవిడ్‌ టెస్ట్‌లు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.అత్యధికంగా టెస్ట్‌లను నిర్వహించడం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది.  ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నది. ఇప్పటికే 52,839 మందికి పైగా టెస్ట్‌లు నిర్వహించగా.. ఇందులో 18,503లకు పైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.  జీహెచ్‌ఎంసీ, నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాలో టెస్ట్‌లతోనే వైరస్‌ను కట్టడి చేయాలనే లక్ష్యంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ముందుకు వెళుతున్నది. అయితే, గతంలో 600-800 పైగా కేసులు వస్తుండగా...ప్రస్తుతం 200 నుంచి 400  కేసులు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 73 మంది కొవిడ్‌తో చనిపోయారు. 


logo