బుధవారం 23 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 15, 2020 , 00:49:43

క‌లెక్ట‌రట్‌లో ఈ-ఆఫీస్‌

క‌లెక్ట‌రట్‌లో ఈ-ఆఫీస్‌

  • n కాగిత రహిత దస్ర్తాల నిర్వహణకు శ్రీకారం         
  • n దశలవారీగా మండల కేంద్రాల్లో ...
  • n అధికారులు, సిబ్బందికి శిక్షణ             
  •   n మరింత పారదర్శక సేవలకు ప్రభుత్వం చర్యలు   
  • n     నేడు ప్రారంభించనున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 

రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలన నిర్వహించేందుకు సర్కార్‌ చర్యలు చేపట్టింది. ప్రతి ఫైలును ఆన్‌లైన్‌లో పరిశీలించి ఆమోదం తెలిపేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. మొదటగా కలెక్టరేట్‌లోని 54 శాఖల్లో ఆ తర్వాత మండలాల్లో ఈ - ఆఫీస్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా ఒక దరఖాస్తు కలెక్టరేట్‌ ఇన్‌వార్డులో వచ్చిన దగ్గర నుంచి కలెక్టర్‌ వద్దకు వెళ్లే వరకు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగనున్నది. ఒక్కో విభాగానికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమించి ఈ ఫైలింగ్‌ గురించి శిక్షణ ఇచ్చి వారి ద్వారా మిగతా సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఫైళ్ల పరిస్థితిని ఏ రోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల జాప్యం ఎక్కడ జరిగిందో తెలిసిపోయే అవకాశం ఉన్నది. దీంతో ఇటు దరఖాస్తుదారుడికి అటు అధికారులకు ఫైలుపై కచ్చితమైన సమాచారం ఉండనున్నది. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ అనంతరం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ - ఆఫీస్‌ను ప్రారంభించనున్నారు.    

   - రంగారెడ్డి,నమస్తే తెలంగాణ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విభాగాల వారీగా నోడల్‌ అధికారులను నియమించి వారికి ఈ-ఫైలింగ్‌ విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు ఈ- ఆఫీస్‌ను కలెక్టరేట్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నారు. అన్ని విభాగాల్లో ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా కార్యకలాపాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. 

ఈ -ఆఫీస్‌ విధానం ఇలా..

ఈ-ఆఫీస్‌ విధానంలో ముఖ్యంగా ఒక ఫైల్‌ను ఈ-ఫైలింగ్‌ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో ఒక విభాగం నుంచి మరో విభాగానికి చేరవేస్తారు. కలెక్టరేట్‌ ఇన్‌వార్డులో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అసిస్టెంట్‌ స్కానింగ్‌ చేసి నంబర్‌ కేటాయించి కార్యాలయ నిర్వహణాధికారికి ఆన్‌లైన్‌లో పంపిస్తారు. నిర్వహణాధికారి వాటిని పరిశీలించి విభాగాధికారికి అసైన్‌ చేస్తారు. విభాగాధికారి నోట్‌ ఫైల్‌ తయారు చేసి ఉన్నతాధికారికి ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే దరఖాస్తుదారులకు తెలిపి పూర్తి సమాచారం సేకరించిన తర్వాతనే ఫైల్‌ ముందుకు కదిలేలా చూస్తారు. 

 ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో శిక్షణ 

ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌) ద్వారా ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-ఆఫీస్‌ అమలుకు జిల్లా స్థాయి నోడల్‌ అధికారిని నియమించారు. ప్రతి విభాగానికి ఒక నోడల్‌ అధికారిని నియమించి  వారికి మొదట శిక్షణ ఇచ్చి వారితో మిగిలిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

పైళ్ల కదలిక ..

ఇన్‌వార్డు నుంచి మొదలుకొని జిల్లా ఉన్నతాధికారి వరకు ఫైళ్లను ఎక్కడి నుంచైనా పరిశీలించేందుకు ఈ ఫైలింగ్‌ విధానం ఉపయోగపడుతుంది. సిబ్బందితో సంబంధం లేకుండా కాగిత రహిత సేవలు వినియోగించుకోవచ్చు. సంబంధిత ఫైలును సెక్షన్‌ సిబ్బంది లేదా అధికారి పరిశీలించాక కార్యాలయ సూపరింటెండెంట్‌కు పంపిస్తారు. ఆయన లాగిన్‌ నుంచి ఫైలు కలెక్టర్‌ లాగిన్‌కు వెళుతుంది. కలెక్టర్‌ పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే దానికి ఆమోదం తెలుపుతారు. లేదంటే తిరస్కరించి వెనక్కి పంపిస్తారు. ఆ ఫైలు దశల వారీగా ఎలా వెళ్లిందో మళ్లీ తిరిగి అలాగే వెనక్కి వచ్చి మొదటికి చేరుకుంటుంది.

అవసరం ఉండదు

ఈ విధానం ద్వారా ఏ అధికారి అయినా ఫైలు ప్రస్తుత పరిస్థితిని ఎక్కడి నుంచైనా పరిశీలించే వీలుంటుంది. ప్రతి విభాగం అధికారి లేదా సిబ్బంది ఫైళ్లు పట్టుకుని తదుపరి విభాగానికి వెళ్లకుండా అంతా ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారానే పంపించే వీలుంటుంది. కాగితాలు వినియోగించే అవసరం లేదు. ఫైళ్లు ఏ రోజుకారోజు వెంటనే ఈ-ఫైలింగ్‌లో నమోదు చేయడం వల్ల ఎక్కడ జాప్యం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. 

ఈ-ఆఫీస్‌ను ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరిస్తారన్లి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్‌ను మంత్రి సబితారెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఆన్‌లైన్‌ పాలనతో పారదర్శక సేవలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ విధానం అమలుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అన్ని శాఖల్లో అమలుకు శ్రీకారం చుట్టాం. కలెక్టరేట్‌లో ఉన్న అన్ని శాఖల అధికారులకు ఎన్‌ఐసీ ద్వారా శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తాం. శిక్షణ ముగిసిన వెంటనే మొదటగా కలెక్టరేట్‌లోని 54 శాఖల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. -అమయ్‌కుమార్‌, రంగారెడ్డి కలెక్టర్‌logo