ఆదివారం 29 నవంబర్ 2020
Rangareddy - Aug 13, 2020 , 00:03:20

క‌ల సాకారం..

క‌ల సాకారం..

  • నేడు కొండకల్‌లో  రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ
  • మంత్రుల రాకకు ఏర్పాట్లు పూర్తి
  • హాజరవనున్న మంత్రులు  కేటీఆర్‌, హరీశ్‌, సబితారెడ్డి
  • రూ.800 కోట్ల పెట్టుబడులు..
  • వందలాది మందికి ఉద్యోగావకాశాలు
  • జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్‌వేర్‌    కంపెనీలకు నెలవు
  • నిర్మాణ, రియలెస్టేట్‌ రంగాల్లోనూ ఘనత 

        నగరానికి అతిచేరువలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. ఓ వైపు వ్యవసాయం, రైతులు, రైతు కూలీలు.. మరోవైపు ప్రపంచ దేశాల సరసన నిలిచిన ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌, హార్డ్‌వేర్‌ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. ఇరవై రోజుల క్రితం షాబాద్‌ మండలం చందన్‌వెళ్లిలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ, తాజాగా మరో భారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన రైలు కోచ్‌లు, డీజిల్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్‌ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో తమ యూనిట్‌ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్‌ఐఐసీ వంద ఎకరాలను సేకరించి, కేటాయించింది. ఈ కంపెనీ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించనున్నది. జనవరి 2022 నుంచి ఉత్పత్తిని మొదలుపెట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గురువారం కంపెనీ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేయనుండగా, మంత్రి  సబితారెడ్డి, ఎంపీలు డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి హాజరవనున్నారు.

గ్రామం: కొండకల్‌

మండలం: శంకర్‌పల్లి

సర్వే నంబర్‌: 310 కొండకల్‌, రంగారెడ్డి జిల్లా 

 (615 వెలిమల, రామచంద్రాపురం మండలం సంగారెడ్డి జిల్లా)

స్థలం కేటాయింపు: 100 ఎకరాలు

పరిశ్రమ పేరు : కోచ్‌లు, బోగీలు, రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్లు

నిధులు: రూ.800 కోట్ల వరకు పెట్టుబడులు

ఎప్పుడు పూర్తి: జనవరి 2022 ఉత్పత్తులు ప్రారంభం

ఒప్పందం: 2017లో రాష్ట్ర ప్రభుత్వానికి మేధా సర్వోడ్రైవ్స్‌ ప్రైవేట్‌  లిమిటెడ్‌ కంపెనీకి మధ్య ఎంవోయూ

ఉపాధి: ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు వేల మందికి..


రంగారెడ్డి,నమస్తే తెలంగాణ :  రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతి బాటలో సాగుతోంది.జిల్లాకు నూతనంగా భారీ ప్రాజెక్టులు తరలివస్తుండడంతో జిల్లావాసుల్లో ఆనందం వెల్లువెత్తుతున్నది. హైదరాబాద్‌కు అనుకొని జిల్లా ఉండడంతో ఇక్కడ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. కంపెనీలు వస్తుండడంతో ఉద్యోగాలు వస్తాయని ఉపాధి అకాశాలు మెరుగుపడతాయని, శ్రామికవర్గం, వ్యవసాయ రంగం మరింత ముందుకు దూసుకుపోయే అవకాశాలున్నాయని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నప్పటికీ మరిన్ని పరిశ్రమల రాకతో జిల్లా రూపురేఖలు మారిపోనున్నాయి.  సాధారణంగా దశాబ్ద కాలం క్రితం వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాగా ముద్రఉండేది. ఆలాంటిది ప్రస్తుతం పారిశ్రామిక ప్రగతితో రాష్ర్టానికే ఆదర్శంగా మారింది. సరిగ్గా 20 రోజుల క్రితం చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌ మండలం చందన్‌వెళ్లి గ్రామంలో టెక్స్‌టైల్స్‌, ఇతర పరిశ్రమలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ అదే నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మండలం కొండకల్‌, వెలిమల గ్రామాల పరిధిలో రైల్వే ఫ్యాక్టరీకి భూమి చేయడానికి మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌ రావు, సబితారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు రానున్నారు. మంత్రుల రాక కోసం సర్వం సిద్ధం అయింది.

కొండకల్‌లో రూ.800 కోట్ల పెట్టుబడులతో ..

హైదరాబాద్‌కు చెందిన రైలు కోచ్‌లు, డీజిల్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్‌, రైలు, మెట్రో కోచ్‌ల కోసం  జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నది.  హైదరాబాద్‌ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండకల్‌ వద్ద టీఎస్‌ఐఐసీ ద్వారా సేకరించిన 100 ఎకరాల భూమిని కంపెనీకి ప్రభుత్వం కేటాయించింది . కొండకల్‌ గ్రామ సర్వే నంబర్‌ 310, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 615లో పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థతో మేధా కంపెనీ 2017లో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ రూ.800 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమను నెలకొల్పనున్నారు. దీంతో 600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 600 మందికి ఉపాధి లభించనుంది. వచ్చే జనవరి 2022 నాటికి పరిశ్రమ నిర్మాణం పూర్తై పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొండకల్‌లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలో ఆర్‌అండ్‌డీ విభాగంలో 500 మంది ఇంజినీర్లు పనిచేయనున్నారు. 

జిల్లా సిగలో మరో భారీ ప్రాజెక్టు

సరిగ్గా 20 రోజుల్లో మరో భారీ పరిశ్రమకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. హైదరాబాద్‌ తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుందనే అపోహలను పటాపంచలు చేస్తూ పడమరలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో దూసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షాబాద్‌ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరుస్తామని చెప్పిన 20 రోజుల్లోనే ఉత్తరాన ఉన్న శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్‌లో రైల్వే ఫ్యాక్టరీ ఏర్పాటుతో చేవెళ్ల నియోజకవర్గం పరిశ్రమలకు అడ్డాగా మారనుంది. జిల్లాలో ల్యాండ్‌ బ్యాంక్‌ అధికంగా ఉండడంతో మరిన్ని పరిశ్రమలు జిల్లా సిగలో చేరనున్నాయి.

హైదరాబాద్‌ తర్వాత రంగారెడ్డే..!

హైదరాబాద్‌ తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లాకే పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే జిల్లాకు పరిశ్రమల ఖిల్లాగా పేరుంది. ఐటీ ఆధారిత కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే హైదరాబాద్‌ గ్రిడ్‌ (గ్రోత్‌ ఇన్‌ డిపెస్పెర్షన్‌) పాలసీని ఇటీవల క్యాబినెట్‌  ఆమోదించింది. వచ్చే ఐదేండ్లలో కొత్త గా లక్ష ఐటీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. రంగారెడ్డి జిల్లాలోని దక్షిణాన ఉన్న విమానాశ్రయం, శంషాబాద్‌, ఆదిభట్ల వాయవ్యంలో (జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొల్లూరు, ఉస్మాన్‌ సాగర్‌లో) సహా పశ్చిమానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహించడానికి గ్రిడ్‌ విధానం ఉపకరించనుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 30 చోట్ల ఐటీ కమర్షియల్‌ స్పేస్‌ కొనసాగుతున్నది. రూ.5,422 కోట్లతో ఏర్పాటైన ఈ కంపెనీలలో 1,79,622 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే మరో 66 చోట్ల అండర్‌ ఇంప్లిమెంటేషన్‌ దశలో మరిన్ని కంపెనీలు ఉన్నాయి. వీటిని రూ.22,760.51కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్నారు.  దాదాపుగా 5,39,693 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 2014 టీఎస్‌ఐపాస్‌ తర్వాతే ఈ ప్రాజెక్టులన్నీ వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో అవసరమైన వనరులు అందుబాటులో ఉండడంతో ఐటీ కంపెనీలతో పాటు ఇరత పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పవచ్చు.

 స్థానికులకే ఉద్యోగావకాశాలు : ఎమ్మెల్యే యాదయ్య

షాబాద్‌ : నిరుద్యోగ యువతకు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ గ్రామంలో గురువారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించే రైల్వేకోచ్‌ ఏర్పాటు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శంకర్‌పల్లి మండలంలో నిరుద్యోగులకు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు వివరించారు. ఐటీ మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. మండలంలోని చందనవెళ్లిలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్స్‌ పార్కుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. రైల్వే కోచ్‌ ప్రారంభాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజునాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌, గోపాల్‌, వాసుదేవ్‌కన్నా, గోపాల్‌రెడ్డి ఉన్నారు.\

హాజరుకానున్న ప్రముఖులు 

శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న రైల్వే ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్‌ చెరువు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లు తీగల అనితారెడ్డి, మంజుశ్రీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, జిల్లా కలెక్టర్లు అమయ్‌కుమార్‌, హన్మంత్‌రావు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నున్నారు.