మంగళవారం 24 నవంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 02:42:46

పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి..

పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి..

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి ప్రమాదాలు జరుగకముందే కట్టడి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఐదు శాఖలతో కూడిన మూడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు పరిశ్రమల్లో తనిఖీ చేసి అమలు చేస్తున్న నిబంధనలు, భద్రతా ఏర్పాట్లపై యాజమాన్యాలను ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించకున్నా.. భద్రతా చర్యలు తీసుకోకపోయినా భారీగా జరిమానాలు విధించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. మంగళవారం జిల్లాలోని పలు పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు చేశారు. పరిశ్రమల్లో బాయిలర్‌ నిర్వహణ, కెమికల్స్‌ స్టోర్‌, ఫైర్‌ సేఫ్టీ, నీటి, గాలి కాలుష్య నివారణ తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. 

 3400 పరిశ్రమలు.. 

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3400 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 500 పరిశ్రమలు రెడ్‌ అండ్‌ ఆరెంజ్‌ క్యాటగిరీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. జిల్లాలో కెమికల్స్‌, ఫార్మా, స్టోన్‌, టెక్స్‌టైల్స్‌, ఆయిల్‌, స్టీల్‌ అండ్‌ ఐరన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డెయిరీ తదితర రకాల పరిశ్రమలు ఉన్నాయి. బాయిలర్‌ వాడే ప్రతి పరిశ్రమ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. భద్రతా చర్యలు చేపట్టని పరిశ్రమలపై కఠిన చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టర్స్‌ డిపార్ట్‌మెంట్‌, బాయిలర్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందాలు పలు పరిశ్రమల్లో తనిఖీలు చేసి ఈ నెల 18లోపు నివేదిక ఇవ్వనున్నాయి.

ప్రమాదాల నివారణకు..

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ బృందాలు  పనిచేయనున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సక్రమంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల హిమాక్షి బిస్కెట్‌ పరిశ్రమలో బాయిలర్‌ లేడ పేలి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేయనున్నారు. తనిఖీ బృందాలను సమన్వయ పరిచే బాధ్యతను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు. 

మూడు బృందాలు..

మొదటి బృందం : ఈ బృందం రాజేంద్రనగర్‌(రూరల్‌, అర్బన్‌), నందిగామ, కొత్తూరు, ఫరూఖ్‌నగర్‌, షాద్‌నగర్‌, మున్సిపాలిటీ,  కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నది. 

 రెండవ బృందం : హయత్‌నగర్‌(రూరల్‌,అర్బన్‌), అబ్దూల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం(రూరల్‌,అర్బన్‌), మంచాల, యాచారం, మాడ్గుల, మహేశ్వరం,కందుకూరు, కడ్తాల్‌ తదితర ప్రాంతాల పరిశ్రమలు తనిఖీ చేయనున్నది. 

 మూడో బృందం : శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌, చేవెళ్ల, శేరిలింగంపల్లి, శంషాబాద్‌(రూరల్‌, అర్బన్‌), గండిపేట, సరూర్‌నగర్‌, బాలాపూర్‌, ఆమనగల్లు, తలకొండపల్లి తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలను తనిఖీ చేయనుంది. 

రెడ్‌ అండ్‌ గ్రీన్‌ క్యాటగిరీలో 500 పరిశ్రమలు :రాజేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి 

  రంగారెడ్డి జిల్లాలో 3400 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 500 పరిశ్రమలు రెడ్‌ అండ్‌ గ్రీన్‌ క్యాటగిరీలో ఉన్నాయి.  వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.  తనిఖీలతో యాజమాన్యాలను అప్రమత్తం చేయడంతోపాటు ఎక్కడైనా లోటు పాట్లు, నిర్లక్ష్యంగా ఉన్నవారు సరిదిద్దుకునే ఆస్కారం ఉన్నది.  నిబంధనలు పాటించనివారిపై చర్యలకు ఈ బృందాలు సిఫారసు చేస్తాయి. మంగళవారం మూడు రెడ్‌, ఐదు అరేంజ్‌ క్యాటగిరీ పరిశ్రమలను పరిశీలించాం.