గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 02:42:43

రైతన్నకు ధీబీమా...

రైతన్నకు ధీబీమా...

రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకాన్ని మరో ఏడాదిపాటు కొనసాగిస్తున్నది. ఈ పథకాన్ని గతేడాది ఆగస్టు 15న ప్రవేశపెట్టగా ఈ నెల 14తో గడువు ముగియనున్నది. దీంతో మరో ఏడాది పాటు పథకాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఆగస్టు 13 వరకు రైతుబీమా పథకం అమలులో ఉండనున్నది. రైతు ఏ విధంగా మృతిచెందినా రైతుబీమా పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా ప్రతి రైతుకు సంబంధించిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే భరిస్తున్నది. అయితే గతేడాది ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3013 చెల్లించగా..ఏడాదికాలంగా చెల్లించిన పరిహారం, రైతు మరణాల సంఖ్యతోపాటు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని బీమా సంస్థ ఈ ఏడాది ప్రీమియం ధరలను పెంచింది. ఈ ఏడాది ఒక్కో రైతుకు  రూ.3486 ప్రీమియం ఖరారు చేసింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు రైతులకు రైతుబీమా వర్తిస్తుంది. 1961 ఆగస్టు 14 నుంచి 2002 ఆగస్టు 14 మధ్య జన్మంచిన వారు రైతుబీమా పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రైతు మరణిస్తే సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. కేవలం వారం రోజుల్లో బీమా డబ్బులు సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 

ఇప్పటివరకు 1354 మందికి..

జిల్లాలో ఇప్పటివరకు 1354 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.67.70 కోట్లను అందజేసింది. మొదట రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం.. అనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 779 మంది రైతులు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోగా.. 761 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.38.05 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 641 మంది దరఖాస్తు చేసుకోగా.. 593 మంది అర్హులకు రూ.29.65 కోట్ల సొమ్మును అందజేసింది. రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకోగా.. ఈ ఆరేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేసింది. ఇక రెండేండ్లలోనే వ్యవసాయానికి  24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నది.  అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా మొదటి విడుతగా రూ.25 వేలను ఇప్పటికే మాఫీ చేసింది.  రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. అదేవిధంగా రైతు ఆత్మహత్యలను నివారించేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తున్నది. 

ప్రీమియం రూ.3486లకు పెంపు...

ఇప్పటివరకు ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ.3013 ఉండగా, ప్రస్తుతం రూ.3486లకు పెంచారు. అయితే రైతులు చెల్లించాల్సిన సంబంధిత ప్రీమియం డబ్బు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. జిల్లావ్యాప్తంగా సుమారుగా 2 లక్షల మంది రైతులు ఉండగా సుమారుగా 1.10 లక్షల మంది రైతులు  బీమాకు అర్హులుగా జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అయితే గతేడాది ఒక్కో రైతుకు 3013 చొప్పున రూ.31.01 కోట్ల ప్రీమియం చెల్లించగా.. ఈ ఏడాది  రూ.3486 లెక్కన రూ.38.34 కోట్లు చెల్లించనున్నది.