బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 02:43:37

గణపయ్యా.. మా కష్టాలు తీర్చవయ్యా..

గణపయ్యా.. మా కష్టాలు తీర్చవయ్యా..

రొటీన్‌గా సాగిపోయే నగర జీవితంలో గణపతి నవరాత్రులు ఒక్కసారిగా వేయివోల్టుల ఉత్సాహాన్ని రగిలిస్తాయి. పది రోజుల పాటు వీధివీధినాఆబాలగోపాలంతో ఆధ్యాత్మిక సందడి చేయిస్తాయి. రంగురంగుల అలంకరణల మండపాలతో, పరవశింపజేసే భక్తి పాటలతో,కిలోమీటర్ల పొడవైన వీడ్కోలు యాత్రలతో యావత్‌ భాగ్యనగరాన్ని ఉర్రూతలూగిస్తాయి. ఇంత పెద్ద ఉత్సవానికి మూలాధారం...

భిన్న ఆకృతులతో కొలువుదీరే గణనాథులే. మట్టిని మహాగణపతులుగా మలిచి సంబురాలకు వన్నెలద్దేది మాత్రం వీటిని తయారుచేసే కళాకారులే. ఏడాది పాటు ఇంటిల్లిపాది అహరహం శ్రమిస్తే కానీ వారికి పూట గడవదు. అలాంటి ఆ కార్మికులు ఈ సారి కష్టాల వలయంలో చిక్కుకున్నారు. కరోనా వారిపైనా ముప్పు వల విసిరింది. ప్రతి ఏడాది లాగా ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగే అవకాశం లేకపోవడంతో విగ్రహాల తయారీదారులకు ఈ సారి ఆర్డర్లు రావడం లేదు. లాక్‌డౌన్‌ కంటే ముందుగా తయారుచేసి ఉంచిన విగ్రహాలు కొనేవారూ లేరు. దీంతో ముందుగానే అప్పులు చేసి లక్షలు తెచ్చి ప్రతిమలు సిద్ధం చేసిన తయారీ దారులభవితవ్యం అంధకారంలో పడింది.

ఆబిడ్స్‌/హయత్‌నగర్‌, ఆగస్టు 10: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వైరస్‌ విజృంభణతో వ్యాధి బారిన పడ్డ కష్టం కంటే ఆర్థికంగా చేసిన నష్టమే ఎక్కువ. వినాయక ఉత్సవాలకు నగరంలో ప్రతి ఏటా కొన్ని వేల సంఖ్యలో ప్రతిమలు అమ్ముడవుతాయి. జిల్లాలకు కూడా అవసరమైన విగ్రహాలు ఇక్కడే తయారవుతాయి. వీటి కోసం ఆరేడు నెలల ముందే అంటే మార్చి నెలలోనే తయారీ ప్రక్రియ మొదలవుతుంది. కరోనా మహమ్మారి విస్తరిస్తుందని తెలియని కళాకారులు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక ప్రతిమల పనులను చేపట్టి మార్చి 22 వరకు కొనసాగించారు. ఆ తర్వాత లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నగరంలో ధూల్‌పేట్‌, హయత్‌నగర్‌, మియాపూర్‌ వంటి పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో తయారీ దారులు ఉన్నారు. వినాయక చవితి సమీపిస్తుండగానే వివిధ కాలనీ సంఘాలు ముందే ఆర్డర్లు ఇస్తారు. తమకు నచ్చిన రీతిలో వినాయకుల్ని తయారు చేయించుకుంటారు. ఏటా నగరంలో సుమారు లక్షకు పైగా చిన్నా పెద్ద గణపతి మూర్తులు అమ్ముడవుతాయి. కానీ ఈ సారి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. పండుగకు మరో పదిరోజులే ఉన్నప్పటికీ అడ్వాన్సు బుకింగులు లేక షెడ్లు వెలవెలబోతున్నాయి. 

ఖైరతాబాద్‌

వినాయకుడు ఈ సారి

తొమ్మిదడుగులే

ఆరు దశాబ్దాల నుంచి ఒక్క అడుగుతో మొదలై 62 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఖైరతాబాద్‌ వినాయకుడు ఈ సారి 9 అడుగుల ఎత్తులోనే దర్శనం ఇవ్వనున్నాడు. ఈ మహాగణపతికీ కరోనా ప్రభావం తప్పలేదు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా తక్కువ ఎత్తులోనే గణనాథుడిని  ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కరోనా విపత్తును తొలగించే చిహ్నంగా ఈ సారి ధన్వంతరి నారాయణుడిగా దర్శనమివ్వనున్న ఈ గణపయ్యను కోల్‌కతాలోని గంగానది ఒడ్డు నుంచి బంకమట్టిని తీసుకొచ్చి తయారు చేస్తున్నారు. - ఖైరతాబాద్‌


బంగారం కుదువ పెట్టి మెటీరియల్‌ తెచ్చినం 

రాజస్థాన్‌లోని మా సొంతూర్లో ఇంటోళ్ల ఒంటిపై ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి 20 లక్షలు అప్పు తెచ్చినం. విగ్రహాలు తయారుచేసేందుకు మెటీరియల్‌ తీసుకొచ్చినం. పోయిన ఏడాది 30 లక్షల రూపాయలతో 400 పెద్ద విగ్రహాలను తయారుచేసినం. ఈ సారి రూ.20 లక్షలతో 3 నుంచి 4 ఫీట్ల ఎత్తు వరకు 600 విగ్రహలు చేసినం. కరోనా ప్రభావంతో గణపతి విగ్రహాలను ఎవ్వరూ కొంటలేరు. విగ్రహాల తయారీ పైనే ఆధార పడి బతుకుతున్నం. కరోనా మా పొట్టలు కొట్టింది. ఇప్పటికే తయారైన విగ్రహాలు అమ్ముడుపోతే తప్ప మా అప్పులు తీరే పరిస్థితి లేదు. 

-బాటి పింకీ, విగ్రహ తయారీదారురాలు


400 కుటుంబాలు..10వేల విగ్రహాలు

రాజస్థాన్‌కు చెందిన సుమారు 400 కుటుంబాలు 20 ఏండ్ల క్రితం నగరానికి వలస వచ్చాయి. వీరంతా.. ఎల్బీనగర్‌ చౌరస్తా నుంచి విజయవాడ వెళ్లే హైవేపై భాగ్యలతనగర్‌, సూర్య నగర్‌, రేడియో స్టేషన్‌ వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే గణేశ్‌ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. కరోనా లాక్‌డౌన్‌ విధించే సమయానికే (మార్చి 22 నాటికి) సుమారు 50 షెడ్లలో ఇప్పటికే 10 వేల విగ్రహాల(చిన్న పెద్దవి కలిపి)ను తయారుచేసి ఉంచారు.  ఇప్పుడవి అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. భారీ గణనాథుల అమ్మకాలు నిలిచిపోతే కార్మికులు మరింత అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సంవత్సరంలో పది నెలలు విగ్రహాల తయారీలోనే శ్రమించే ఈ కార్మికులకు విగ్రహాల తయారీ ఎత్తు పెద్ద సమస్యగా మారింది. పెద్ద విగ్రహాలు అమ్ముడు పోకపోతే తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.


8 అడుగుల

ఎత్తు వరకు

విగ్రహాలను అనుమతించాలె

విగ్రహాల అమ్మకాల్లో 8 అడుగుల ఎత్త వరకు అనుమతిస్తే కార్మికులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది. ఇప్పటికే తయారైన విగ్రహాలను నగరాల నుంచి పట్టణాలకు తరలించి అమ్ముకుంటే కొంచమైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చు. హయత్‌నగర్‌లో వినాయక విగ్రహ తయారీ దారుల కష్టాలు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ దృష్టికి తీసుకెళ్తా. అప్పులు తెచ్చి విగ్రహాలు తయారు చేసిన కార్మికులను ప్రభుత్వం ఏదో ఒక మార్గంలో ఆదుకునే ప్రయత్నం చేయాలి. 

-సామ తిరుమలరెడ్డి, కార్పొరేటర్‌