గురువారం 29 అక్టోబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:28:20

కొండకల్‌లో రైల్వే ఫ్యాక్టరీ

కొండకల్‌లో రైల్వే ఫ్యాక్టరీ

  • 100 ఎకరాల్లో నిర్మాణం
  • 13న భూమిపూజ చేయనున్న  మంత్రి కేటీఆర్‌
  • 2017లో మేధా సర్వో డ్రైవ్స్‌  ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ప్రభుత్వం ఎంవోయూ 
  • 2022 నాటికి ఉత్పత్తులు ప్రారంభించేలా ప్రణాళికలు
  • మెరుగపడున్న ఉపాధి, ఉద్యోగావకాశాలు

ఇప్పటికే ఎన్నో భారీ పరిశ్రమలు ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరో మణిహారం రాబోతున్నది. శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో రైలు కోచ్‌లు, బోగీలు, రైల్వే వ్యాగన్ల్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమతో సుమారు 2వేల మందికి ఉపాధి లభించనున్నది. ఈ నెల 13న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు 2017 సంవత్సరంలోనే మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నది. దీనికోసం టీఎస్‌ఐఐసీ ఇప్పటికే వంద ఎకరాలను సేకరించింది. 2022 నాటికి పనులు పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.  స్థానికంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడనుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

- రంగారెడ్డి, నమస్తే తెలంగాణ

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: జిల్లాలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్నది. అందుకోసం ఈ నెల 13న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ భూ మి పూజ చేయనున్నారు. ఈ పరిశ్రమలో కోచ్‌లు, బోగీ లు, రైల్వే వ్యాగన్లు తయారు చేయనున్నారు. ఈ మేరకు 2017లోనే ప్రభుత్వం మేధా సర్వోడ్రైవ్స్‌ ప్రైవే ట్‌ లిమిటేడ్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నది. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో రూ.800 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే టీఎస్‌ఐఐసీ ద్వా రా 100 ఎకరాలను కేటాయించారు. 2022 నాటికి పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. ఈ పరిశ్రమలోని ఆర్‌అండ్‌డీ విభాగంలో 500 మంది ఇంజినీర్లు పనిచేయనున్నారు. 

రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో..

రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల సరిహద్దులో హైదరాబాద్‌ నుంచి 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండకల్‌ వద్ద వంద ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించనున్నారు.  అందుకోసం కొండకల్‌లో సర్వే నంబర్‌ 310, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన సర్వే నంబర్‌ 615లో భూములను సేకరించారు. హైదరాబాద్‌కు చెందిన రైలు కోచ్‌లు, డీజిల్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల కో తయారీ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్‌ దీన్ని ఏర్పాటు చేయనున్నది. 1984లో స్థాపించిన ఈ సంస్థ 1990లో రైల్వేల్లోకి ప్రవేశించింది. ఇది రైల్వే కోచ్‌లు, ప్రొపల్షన్‌ వ్యవస్థలను రైల్వేలకు సరఫరా చేస్తున్నది.  

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సరఫరాలో నంబర్‌ వన్‌.. 

ఇండియన్‌ రైల్వేకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను సరఫరా చేయడంలో మేధా సర్వోడ్రైవ్స్‌ సంస్థకు దేశంలోనే నంబర్‌వన్‌గా ముద్రపడింది. అంతర్జాతీయస్థాయిలో ఆ కంపెనీ ఇతర ప్రముఖ కంపెనీలతో పోటీపడుతూ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. కొండకల్‌లో ఏర్పా టు చేయబోయే పరిశ్రమను సొంత నిధులతో నిర్మించ నున్నది. వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి ఇంజినీర్లను ఎంపిక చేసుకోనున్నది.  

దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా..

రాష్ర్టాన్ని పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామిగా నిలుపాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే అనేక సంస్థలతో ఎంవోయూ చేసుకుని పారిశ్రామిక రంగం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కొండకల్‌లో రైల్‌, మైట్రోకోచ్‌లు, బోగీలు తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంకల్పించింది. జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.  

ఉపాధి కల్పన..

కొండకల్‌లో రైల్‌, మెట్రోకోచ్‌ పరిశ్రమను ఏర్పాటు చేయనుండడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమ ఏర్పాటుతో 600 వేల మందికి ప్రత్యేక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2022 నాటికి నిర్మాణం పూర్తి చేసి పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభించే దిశగా కసరత్తు జరుగుతున్నది.

మరింత అభివృద్ధి..


కొండకల్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దాదాపుగా 2వేల మంది ఉపాధి పొందుతారు. రాష్ర్టాన్ని మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారు. అందులోనూ చేవెళ్ల నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటుకు అనుకులంగా ఉన్నది. రైల్వేవ్యాగన్లు, బోగీలు, మెట్రోకోచ్‌ తయారీ పరిశ్రమతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.

- కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల logo