సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 08, 2020 , 00:09:12

అమ్మ పాలు అమృతం

అమ్మ పాలు అమృతం

  • l ముగిసిన తల్లిపాల వారోత్సవాలు
  • l ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించిన సిబ్బంది
  • l జిల్లాల్లో 13,421 మంది గర్భిణులు, 11,033 మంది బాలింతలు

 తల్లి పాల వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఏడు రోజులపాటు తల్లిపాల విశిష్టతపై బాలింతలు, గర్బిణులకు రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ  అవగాహన కల్పించింది. అంగన్‌వాడీ సిబ్బంది  ఇంటింటికీ వెళ్లి తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో 1600 అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. 13,421 మంది గర్భిణులు, 11,033 మంది బాలింతలు ఉన్నారు. 

            రంగారెడ్డి,నమస్తే తెలంగాణ: ప్రకృతిలో ప్రతి ప్రాణికి ప్రాణం అమ్మే.. అమ్మ ప్రేమ మధురం.. అమ్మ చనుబాలు అమృతం .. తల్లి పాల విశిష్ట గురించి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి ఏడాది అవగాహన కల్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా  ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహించి, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేవారు. ఈసారి మాత్రం కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో తల్లి పాల వారోత్సవాలు ఇండ్ల వద్దే నిర్వహించి, శుక్రవారం ముగించామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మోతీ వెల్లడించారు. 

13,421 మంది గర్భిణులు,   11,033 మంది బాలింతలు

జిల్లాలోని 27 మండలాలు.. 5 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1380 మెయిన్‌, 220 మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 13,421 మంది గర్భిణులు, 11,033 మంది బాలింతలు నమోదు చేసుకున్నారు. బాలింతలు తల్లిపాలు ఇవ్వడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి పాల విశిష్టత, తల్లి పాలు వైద్యపరంగా ఎంత విలువైనవో ఇండ్ల వద్దే ఆ శాఖ సిబ్బంది వారికి వివరించారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లి పాల వారోత్సవాలను అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుపుకొంటారు. ఈసారి కొవిడ్‌-19 కారణంగా రంగారెడ్డి జిల్లాలో అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూనే తల్లి పాలు, వాటి విశిష్టతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

 కొవిడ్‌-19 జాగ్రత్తలు ..

 పాలు ఇచ్చే ముందు శుభ్రంగా చేతులు కడుకోవాలి. విధిగా మాస్కు ధరించాలి. ఇంటి పరిసరాలను ఎల్లపుడూ పరిశుభ్రం  గా ఉంచుకోవాలి. కొవిడ్‌-19 బారిన పడ్డ తల్లులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని తమ బిడ్డలకు పాలు పట్టించొచ్చు. తల్లి పాలల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో కొవిడ్‌-19 సోకకుండా ఉంటుంది. ఒక వేళ  సోకినా కూడా తల్లి పాలు పట్టడంతో త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. పుట్టిన వెం టనే బిడ్డకు సరైన సమయానికి తల్లి పాలు అందించడంలో దవాఖాన యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే 155 209 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని మహిళా, శిశు సంక్షేమ అధికారులు సూచిస్తున్నారు. 

పాలిస్తున్న తల్లులు  తీసుకోవాల్సిన ఆహారం 

బిడ్డలకు పాలిచ్చే సమయంలో తల్లులు షోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తున్నానని ప్రతీ తల్లి భావించాలి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. ఆ సమయంలో ఘనాహారం కంటే ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పండ్ల రసాలు తీసుకోవాలి. పాలు పట్టించడానికి కనీసం ఓ అరగంట ముందైనా పండ్ల రసం తీసుకోవడం మంచిది. దీని వల్ల ఉపయోగం ఉంటుంది. పాల ద్వారా తల్లి నుంచి చిన్నారికి కాల్షియం వెళ్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండే  ఫుడ్‌ తీసుకోవడం మంచిది. 

అయితే, కొంత మంది ఉద్యోగినులు ఉంటారు. అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా తల్లిపాలను సేకరించి నిల్వ చేయవచ్చు. ఇందుకోసం సక్షన్‌ పంప్‌ సాయంతో పాలు సేకరించి ఫ్రిజ్‌లో నిల్వ చేయుచ్చు. ఈ పాలను బిడ్డకు  పట్టే ముందు ఫ్రీజ్‌ నుంచి బయటకు తీసి సాధారణ టెంపరేచర్‌కి చేరాక స్పూన్‌, ఉగ్గు గిన్నెతో పాలుపట్టించాలి. 

సామాజిక మాధ్యమాల ద్వారా ..

పత్రికలు, ప్రసార సాధనాలు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే నమోదైన గర్భిణుల వివరాల ప్రకారం ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ సిబ్బందితో ప్రసూతి అయిన తల్లులకు ఇంటి వద్దనే తల్లి పాల విశిష్టత గురించి అవగాహన కల్పించారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు తల్లి పాల వారోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 

ఇండ్ల  వద్దనే  అవగాహన కల్పించాం

కొవిడ్‌-19 నిబంధనల మేర  కు ఈ సంవత్సరం తల్లి పాల వారోత్సవాలను నిర్వహించలేదు. కానీ ప్రసూతి అయిన తల్లుల ఇండ్ల వద్దనే అవగాహన కల్పించాం. జిల్లా వ్యా ప్తంగా ఉన్న ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో పనిచేసే టీచర్లు, ఇతర సిబ్బంది ప్రసవమైన తల్లుల ఇంటి వద్దకు వెళ్లి పాల గురించి అవగాహన కల్పించారు. పాల తల్లి సంస్కృతిని సామాజిక బాధ్యతగా భావించాలి. ఒక జీవ శాస్త్ర ప్రక్రియగా గుర్తించాలి. ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తల్లి పాలను శిశువుకు పట్టాలి.

    - మోతీ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి