గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 06, 2020 , 23:49:41

అర్హులందరికీ రైతుబంధు

అర్హులందరికీ రైతుబంధు

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ: అర్హత కలిగిన రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక్క రైతును కూడా వదలకుండా జిల్లాలోని అర్హులందరికీ ఈ పథకంలో సాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎవరైనా ఉదాసీనంగా ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గురువారం తన కార్యాలయం నుంచి మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెట్టుబడుల కోసం ఏ రైతు ఇబ్బంది పడకూడదన్నారు. జూన్‌ -18 వరకు పట్టాదార్‌ పాసు పుస్తకాలు కలిగి ఉన్న 3,04,026 మంది రైతులు ఈ పథకానికి అర్హులు కాగా, అందులో 2,64,858 మంది వారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు అందజేశారని, మిగతా వారూ వారం రోజుల్లోగా అందించాలని మంత్రి కోరారు. జిల్లాలోని రైతాంగానికి వానకాలం-2020 కోసం రూ.336.31 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. 

స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి

వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారంతో రైతుల బ్యాంకు వివరాలు అందించేలా  చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో రైతుబంధులో వచ్చిన నగదును ఉపయోగించుకుని రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు జిల్లాలో నియంత్రిత సాగు విధానం జోరుగా సాగుతున్నదని, ఈ సందర్భంగా జిల్లా రైతాంగాన్ని ఆమె అభినందించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయరంగంపై ఉన్న శ్రద్ధతో రైతుబంధు సాయం అందించామన్నారు. ప్రతీ రైతుకు ఈ సాయం అందేలా చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని మంత్రి తెలిపారు. అన్నదాతలు లబ్ధిపొందేందుకు బ్యాంకు అకౌంట్‌ వివరాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతు బీమా పథకంలో 645 కుటుంబాలకు రూ.32.25 కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల నిర్మాణాలను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వానకాలం- 2020లో ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా తమ పంట వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలని మంత్రి కోరారు. సమావేశంలో కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీశ్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.