బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 06, 2020 , 01:28:22

కోటి చేప పిల్లలు పెంచడమే లక్ష్యం...

 కోటి చేప పిల్లలు పెంచడమే లక్ష్యం...

షాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కోటి చేప పిల్లలు పెంచడమే లక్ష్యంగా మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 536 చెరువులున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన వర్షాలకు 50 శాతం చెరువులు మాత్రమే నిండాయి. దీంతో 200 చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నిరుపేద వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది.అన్ని కులాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకానికి మత్స్యకారులను ప్రోత్సహిస్తుంది. సొసైటీల ద్వారా చేప పిల్లల పెంపకం చేపడుతుంది. జిల్లా వ్యాప్తంగా 102 సొసైటీల్లో 5941 మంది సభ్యులున్నారు. జిల్లా స్థాయిలో మత్స్యకో-ఆపరేటివ్‌ సొసైటీ కూడాఉంది. అదే విధంగా 11 మహిళా సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో 610 మహిళలు సభ్యులుగా ఉన్నారు. పూర్తి సబ్సిడీపై చేప పిల్లలను అందజేయడంతో పాటు మత్స్యకారులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

కోటి లక్ష్యంగా..

జిల్లా వ్యాప్తంగా కోటి చేప పిల్లలు పెంచడమే లక్ష్యంగా మత్స్యశాఖ చర్యలు చేపడుతుంది. ఇందులో పెద్ద చేప పిల్లలు(8200 మి.మీ), చిన్న చేప పిల్లలు(35మి.మీ-40 మి.మీ) రెండు రకాలు ఉన్నాయి. ఈ చేప పిల్లలను కృష్ణా జిల్లా కైకలూరు నుంచి తీసుకువస్తున్నారు. కోటి చేప పిల్లల పెంపకం చేసేందుకు 100శాతం సబ్సిడీపై అందజేస్తారు. 92 లక్షల చిన్న చేప పిల్లలను, 8 లక్షల పెద్ద చేప పిల్లలను 536 చెరువుల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 536 చెరువులకు గాను ఇప్పటివరకు కురిసిన వర్షాలకు 50 శాతం చెరువుల్లోకి నీరు వచ్చింది. అందకోసం మొదటి దశగా 200 చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో బొచ్చ, రవ్వ, బంగారు తీగ చేపలను పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో 200 చెరువుల్లో చేప పిల్లలను వదులుతారు. తర్వాత చెరువుల్లోకి నీరువచ్చిన దాని బట్టి చేప పిల్లలను వదలనున్నట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది 536 చెరువుల్లో కోటి చేపపిల్లలు వదలాల్సి ఉండగా 326 చెరువుల్లో మాత్రమే నీరు ఉండటంతో 70 లక్షల పిల్లలను వదిలిపెట్టారు. 

మత్స్యకారులకు వాహనాల సదుపాయం

మత్స్యకారులకు చేపల వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం వాహనాల సదుపాయం కల్పించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 804 టీవీఎస్‌ మోపెడ్‌లు, 48 లగేజీ ఆటోలు, 16 సంచార చేపల అమ్మకం వాహనాలు అందించారు. 5 పరిశుభ్ర చేపల అమ్మకం వాహనాలు, 190 ప్లాస్టిక్‌ క్రెట్స్‌, 159 వలలు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉన్న 9 హౌస్‌లను క్లీన్‌ చేయించి 12లక్షల చేప పిల్లల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నేడు పంపిణీ చేయనున్న మంత్రులు..

షాద్‌నగర్‌ డివిజన్‌ కమ్మదనంలోని వెంకట్రాయి కుంట చెరువులో చేప పిల్లల పంపిణీని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితారెడ్డి గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మండలాల వారీగా చేపపిల్లల పంపిణీ షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.