సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Aug 04, 2020 , 00:04:03

రావిర్యాలలో మెగా డెయిరీ

రావిర్యాలలో మెగా డెయిరీ

  • మహేశ్వరం మండలం  ఇమరత్‌ కాంచా,  రావిర్యాలలో నిర్మాణం   
  • రూ.250కోట్ల వ్యయంతో విజయ డెయిరీ  అల్ట్రా మోడ్రన్‌ ప్లాంట్‌ ఏర్పాటు
  • పెరుగనున్న ఉపాధి అవకాశాలు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : జిల్లా శిగలో మరో మెగా ప్రాజెక్టు చేరనున్నది. ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన విజయ డెయిరీ జిల్లాలో తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఆరు లక్షల లీటర్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యం గల అల్ట్రా మోడ్రన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఐదేండ్లలో ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ మెగా ప్లాంట్‌లో మజ్జిగ, వెన్న, కోవా వంటి పదార్థాలు ఉత్పత్తి చేయనున్నారు. మహేశ్వరం మండలం మామిడి పల్లి రెవెన్యూలో పరిధి..ఇమరత్‌ కాంచా, రావిర్యాల గ్రామంలో పశుసంవర్ధకశాఖకు చెందిన 32.20 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ  (కేంద్ర ప్రభుత్వ రీజనల్‌ ఫోరేజ్‌ స్టేషన్‌లో) గడ్డి, పశుగ్రాస విత్తనాల ఉత్పత్తి కేంద్రం ఉన్నది. ఈ భూమిలోనే డెయిరీ నిర్మాణానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి.        

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ఏటా ఎకరానికి రూ.30వేల చొప్పున సంవత్సరానికి రూ.9.75 లక్షలు తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌కు చెల్లించేలా 99 సంవత్సరాల పాటు వివిధ షరతులతో లీజు ఒప్పందం గత గురువారం కుదుర్చుకుంది. ఆధునిక టెక్నాలజీతో రూ.250కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ మెగా డెయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర సమక్షంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్‌ రావు ఒప్పంద ప్రతాలపై సంతకాలు చేశారు. త్వరలో మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం ఈ డెయిరీ సికింద్రాబాద్‌ మౌలాలిలో కొనసాగుతుండగా, నూత న యూనిట్‌ సామర్థ్యం ప్రస్తుత.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అతి పెద్ద ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలని విజయ డెయిరీ రూపకల్పన చేసింది.  పశుసంవర్ధకశాఖ, విజయ డెయిరీలు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో డీపీఆర్‌ను సిద్ధం చేసే పని లో నిమగ్నమైన విజయ .. వచ్చే మూడేండ్లలో ప్లాంటును ప్రారంభించనుంది.  

మౌలాలీలో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం..

   మౌలాలీలో ఉన్న విజయ డెయిరీ యూనిట్‌కు కేవలం 3లక్షల లీటర్ల సామర్ధ్యం ఉన్నది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ 5లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నది. వీటిలో మూడు లక్షల లీటర్లను మాత్రమే ప్రాసెస్‌ చేస్తున్నది. ప్రాసెసింగ్‌లో భాగంగా పాలు, నెయ్యి, పెరుగు, బటర్‌ మిల్క్‌, లస్సీ, ప్లేవర్డ్‌ మిల్క్‌ వంటి పలు రకాలు తయారవుతున్నాయి. సామర్థ్యం తక్కువగా ఉండడం వల డిమాండ్‌కు తగ్గట్లు పాల ఉత్పత్తులు తయారు చేయలేకపోవడంతో ఈ అల్ట్రా మోడ్రన్‌ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది విజయ. మరో పక్క మిగిలిపోతున్న పాలను పాలపొడిగా చేయడానికి యంత్రాలు లేకపోవడంతో ప్రైవేట్‌ డెయిరీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాలకు పంపి పాలపొడిగా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత స్థాయిలోనే పాలను సేకరిస్తున్నది. దీనిని అధిగమించేందుకు అధిక సామర్థ్యంతో అల్ట్రా మోడ్రన్‌ ప్లాంట్‌ నిర్మించాలని నిర్ణయించింది. 

80వేల మంది పాడి రైతులకు మేలు..

    జిల్లాలోని 80వేల మంది పాడి రైతులకు మేలు జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 9-10లక్షల లీటర్ల పాల దిగుబడి ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా. చాలా మంది రైతులు పాలను లూజుగా విక్రయిస్తారు. మరికొందరు నగరానికి తరలిస్తుంటారు. మిగిలిన పాలను ప్రైవేట్‌ డెయిరీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ, నార్ముల్‌ డెయిరీలు సేకరిస్తున్నాయి. అత్యధికంగా షాద్‌నగర్‌, కడ్తాల్‌, కందుకూరుల నుంచే విజయ డెయిరీకి పాలు వస్తున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్‌, షాబా ద్‌, శంకర్‌పల్లి మండలాల నుంచి నగరంలోని హోటల్స్‌కు పాలు సరఫరా అవుతుంటాయి. మెగా డెయిరీ పూర్తయితే పాల సేకరణ మరింత విస్త్రతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీని ఏర్పాటుతో డెయిరీ ఉత్పత్తులు పెరుగడంతో పాటు అమ్మకాలు మరింత అధికం కానున్నాయి. ఎక్కువ సంఖ్యలో స్టాల్స్‌ మంజూరు చేస్తే నిరుద్యోగ యువకులు ఫ్రాంచైజీలు తీసుకుని వ్యాపారం చేస్తూ జీవనోపాధి పొందుతారు.