బుధవారం 02 డిసెంబర్ 2020
Rangareddy - Aug 03, 2020 , 00:09:05

కృత్రిమ గర్భధారణతో పాడికి భ‌రోసా..

కృత్రిమ గర్భధారణతో  పాడికి భ‌రోసా..

  • qజాతీయ కృత్రిమ గర్భధారణ  రెండో విడుత కార్యక్రమం నేటి నుంచి షురూ  
  • qమేలు జాతి పశుసంపద, అధిక పాలదిగుబడే లక్ష్యం  
  • qదేశవాళి  పశువుల నుంచి మేలు జాతి  అభివృద్ధి  
  • qఈ సంవత్సరం 475 రెవెన్యూ గ్రామాలు ఎంపిక  
  • qఒక్కో  గ్రామానికి 100చొప్పున మొత్తం 47,500 కృత్రిమ గర్భధారణలే  టార్గెట్‌

పాడి అభివృద్ధిలో చిన్న, సన్నకారు రైతులకు మరింత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకం రెండో విడుత జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. దేశవాళి పశువులకు అధిక పాలు ఇచ్చే మేలు రకమైన సంకరజాతి పశువీర్యంతో కృత్రిమ గర్భధారణ చేపట్టి మేలు జాతి పశువులను ఉత్పత్తి చేయడంతో పాటు పాలదిగుబడిని పెంచే విధంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సంవత్సరం 475 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి.. గ్రామానికి 100 చొప్పున మొత్తం 47,500 పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా చేసిన ప్రతి పశువుకు గుర్తింపు నెంబర్‌ వేసి జాతి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనింది, యజమాని ఎవరు అనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. కేవలం పశుపునరుత్పత్తి కోసం దాదాపు లక్ష రూపాయలకు ఆంబోతులను కొనుగోలు చేస్తున్న రైతులు వాటి పోషణ, దాణా ఖర్చు భరించ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ గర్భధారణ విధానం ఉచితంగా చేస్తుండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

- రంగారెడ్డి, నమస్తే తెలంగాణ


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతిలో పశుపోషణ చాలా ముఖ్యమైనది.. పశుపోషణలో ప్రధాన పాత్ర వహిస్తున్న పాడి పశువుల పెంపకం ఎక్కువగా సన్న,చిన్న కారు వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పిస్తున్నది. దేశవాళి ఆవులలో ఉత్తమ జాతి లక్షణాలు కలిగిన ఒంగోలు, షాహివాల్‌, గిర్‌ అదేవిధంగా గేదెలలో ముర్రా, గ్రేడేడ్‌ ముర్రా, మొహసాన తదితర జాతులు జిల్లాలో ఉన్నప్పటికీ మరిన్ని జాతులను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జాతీయ కృత్రిమ గర్భధారణ రెండో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో నేటి నుంచి నిర్వహించేందుకు పశు సంవర్ధకశాఖ అధికారులు సిద్ధమయ్యారు. నగర శివారులో ఉన్న రంగారెడ్డి జిల్లాకు మార్కెట్‌ సౌకర్యం ఉండడంతో పాడి అభివృద్ధిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు మేలు జాతి గేదెలు, ఆవులను ఒక్కోదానికి రూ.80వేల నుంచి రూ.1లక్షకు ఖర్చు చేస్తున్నారు రైతులు. ఇలా రైతులు లక్షల రూపాయలు వెచ్చించి పశువులను కొనాల్సిన అవసరం లేకుండా దేశవాళి పశువుల జాతిని.. మేలు జాతి పశువులుగా అభివృద్ధి చేస్తూ, పాల దిగుబడి పెంచేందుకు కేంద్రం కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా దేశవాళి పశువులకు అధిక పాలు ఇచ్చే మేలురకమైన సంకర జాతి పశువీర్యంతో కృత్రిమ గర్భధారణ చేపట్టి మేలు జాతి దూడలను పుట్టించడంతో పాలదిగుబడిని పెంచుకోవచ్చు. 

47,500 లక్ష్యంగా..

జిల్లాలోని 27 మండలాల్లోని 560 పంచాయతీలు, 15మున్సిపాలిటీల్లో తాలూక స్థాయిలో 4 పశువైద్యశాలలు, 46 పశువైద్యకేంద్రాలు,87 గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గోజాతి పశువులు 2,34,453, గేదె జాతి పశువులు 1,65,586 ఉన్నాయి. గతేడాది మొదటి దశ కృత్రిమ గర్భధారణ ద్వారా 2019 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 2,19,474 బ్రీడ్‌ బుల్‌ పాపులేషన్‌ ఉన్నాయి.దీని ఆధారంగా 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 మే వరకు టార్గెట్‌ 20వేలు ఉండగా ..24,603 పూర్తిచేశారు. అయితే, గత సంవత్సరం 200 గ్రామాల్లో 100 చొప్పున టార్గెట్‌గా నిర్ణయించారు. ఈ సంవత్సరం 475 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయగా.. గ్రామానికి 100 చొప్పున మొత్తం 47,500 కృత్రిమ గర్భధారణను లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆగస్టు 1 నుంచి 2021 మే 31 వరకు..

దేశవాళి పశువుల జాతిని మేలు జాతి పశువులుగా అభివృద్ధి చేస్తూ పాల దిగుబడిని పెంచాలనే ఉద్దేశంతో జాతీయ గర్భధారణ రెండో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. 2020 ఆగస్టు 1 నుంచి 2021 మే 31 వరకు 10 నెలల పాటు  47,500 వేల పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడుతలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48వేల పశువులకు గర్భధారణ చేయాల్సి ఉండగా.. 54,776 పశువులకు సూదులు వేశారు.

ప్రతి పశువుకు గుర్తింపు నెంబర్‌(చెవిపోగు)..

కృత్రిమ గర్భధారణ చేసిన ప్రతి పశువుకు గుర్తింపు నెంబర్‌ (చెవిపోగు) వేయడంతో పాటు పశుజాతి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది తదితర పూర్తి వివరాలతో పాటు పశు యజమాని వివరాలను ఎప్పటికప్పుడు ఐఎన్‌ఏపీహెచ్‌ (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ, హెల్త్‌) పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అయితే, కేవలం పునరుత్పత్తి కోసం సన్న, చిన్నకారు రైతులు ఆంబోతులను పోషించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. పోషణ, దాణా ఖర్చు కూడా అధికంగా అవుతుండడం కృత్రిమ గర్భధారణ విధానం ఉచితంగా చేస్తుండడంతో అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. 

కృత్రిమ గర్భధారణతో ఎంతో మేలు 


కృత్రిమ గర్భధారణతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ఈ సంవత్సరం 475 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేయగా.. గ్రామానికి 100 చొప్పున మొత్తం 47,500 టార్గెట్‌గా పెట్టుకున్నాం. గత సంవత్సరం 200 గ్రామాల్లో 100  లక్ష్యంతో ముందుకు వెళ్లాం. మేలు జాతి పశుసంపదను పెంచుకోవడంతో పాల ఉత్పత్తి అధికంగా వస్తుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

- డాక్టర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి,  జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి